న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో రూ. 13,101 కోట్లు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది రూ. 11,640 కోట్లు. తాజా మూడో త్రైమాసికంలో నికర లాభం సుమారు రూ. 11,420 కోట్లు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కంపెనీ ఆదాయంలో గణనీయ వాటా ఉండే రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారం తగ్గినప్పటికీ.. టెలికం, రిటైల్ విభాగాలు రాణించడంతో మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఏడాది క్రితం దాకా కంపెనీ ఆదాయంలో 37 శాతంగా ఉన్న ఈ రెండు విభాగాల వాటా ప్రస్తుతం 51%కి పెరిగింది. పన్నులకు ముందస్తు లాభంలో దాదాపు 56 శాతం వాటా జియో, రిలయన్స్ రిటైల్‌దే ఉంది. సమీక్షాకాలంలో ఆర్‌ఐఎల్ ఆదాయం సుమారు 19% క్షీణించి రూ. 1,37,829 కోట్లకు పరిమితమైంది. చమురు, రసాయనాల వ్యాపారం (ఓ2సీ) త్రైమాసికాలవారీగా మెరుగుపడినప్పటికీ.. వార్షికంగా మాత్రం తగ్గింది.
ఓ2సీ విభాగం పునర్‌వ్యవస్థీకరణ..
‘ఓ2సీ (చమురు, రసాయనాలు తదితర విభాగాలు), రిటైల్ విభాగాలు కాస్త కోలుకోవడంతో పాటు డిజిటల్ సేవల విభాగం నిలకడగా వృద్ధి సాధిస్తుండటంతో మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పరిశుభ్రమైన, పర్యావరణహిత అభివృద్ధి సాధన దిశగా కొత్త ఇంధన, మెటీరియల్స్ వ్యాపారాలను విస్తరించేందుకు ఇది సరైన తరుణం. దీనికి అనుగుణంగానే ఓ2సీ విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించి కస్టమర్లకు మరింత చేరువలోకి తెస్తున్నాం. దేశ ఎకానమీలోని ప్రతీ రంగానికి అవసరమైన ఇంధన, మెటీరియల్స్ సొల్యూషన్స్‌ను దీని ద్వారా అందుబాటు ధరల్లో అందించవచ్చు‘ అని రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. ఓ2సీ ప్లాట్‌ఫామ్ పునర్‌వ్యవస్థీకరణతో ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ ఆదాయాలను ఒకే పద్దు కింద రిలయన్స్ చూపించింది. దీనితో రిఫైనింగ్ మార్జిన్లను ప్రత్యేకంగా ప్రకటించలేదు.
జియో జోష్..: త్రైమాసికాలవారీగా చూస్తే.. డిజిటల్, టెలికం సేవలందించే జియో ప్లాట్‌ఫామ్స్ లాభం 15 శాతం వృద్ధితో రూ. 3,489 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 31 నాటికి జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 41 కోట్లుగా ఉంది. ప్రతీ యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ. 145 నుంచి రూ. 151కి పెరిగింది.
రిటైల్‌కు ఫ్యాషన్ ఊతం..: ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ విభాగాలు గణనీయంగా కోలుకోవడంతో రిలయన్స్ రిటైల్ మెరుగైన పనితీరు కనపర్చింది. పన్నుకు ముందస్తు లాభం సుమారు 12 శాతం పెరిగి రూ. 3,102 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 2,736 కోట్లు. అయితే, ఆదాయం మాత్రం రూ. 45,348 కోట్ల నుంచి దాదాపు 23 శాతం క్షీణించి రూ. 36,887 కోట్లకు పడిపోయింది.
మరిన్ని విశేషాలు..
► కరోనా మహమ్మారి, రేట్లు పడిపోవడం వంటి అంశాలు ఇంధన డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపడంతో ఓ2సీ వ్యాపారం ఆదాయం రూ. 1,19,121 కోట్ల నుంచి రూ. 83,838 కోట్లకు తగ్గింది.
► త్రైమాసికాల వారీగా చూస్తే వడ్డీ వ్యయాలు 29 శాతం తగ్గి రూ. 4,326 కోట్లకు పరిమితమయ్యాయి.
► జియోలో వాటాల విక్రయం ద్వారా రూ. 1,52,056 కోట్లు, రిటైల్‌లో వాటాల విక్రయంతో రూ. 47,265 కోట్లు రిలయన్స్ సమీకరించింది.
► స్థూల రుణ భారం డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 2,57,413 కోట్లకు తగ్గింది. 2020 మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 3,36,294 కోట్లు. ఇక చేతిలో ఉన్న నగదు రూ. 1,75,259 కోట్ల నుంచి రూ. 2,20,524 కోట్లకు పెరిగింది. కంపెనీ చేతిలో పుష్కలంగా నిధులు ఉండటంతో నికర రుణం మైనస్ రూ. 2,954 కోట్లుగా ఉంది.
శుక్రవారం బీఎస్‌ఈలో రిలయన్స్ షేరు సుమారు 2 శాతం క్షీణించి రూ. 2,050 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెల్లడయ్యాయి.
అంచనాలు మించిన రిలయన్స్
Published Sat, Jan 23 2021 1:10 AM | Last Updated on Sat, Jan 23 2021 11:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment