
అమెరికన్ టవర్స్‌తో రిలయన్స్ జియో జట్టు
న్యూఢిల్లీ: మొబైల్ సేవలను ప్రారంభించేందుకు రిలయన్స్ జియో జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికన్ టవర్ కార్పొరేషన్ తో(ఏటీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏటీసీకి దేశవ్యాప్తంగా ఉన్న 11,000 టవర్లను మొబైల్ సేవల కోసం వినియోగించుకోనుంది. తాజా ఒప్పందంతో రిలయన్స్ జియో చేతిలో మొత్తం 1,80,000 టవర్లు ఉన్నట్లు అవుతుంది. వీటి కోసం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, వ్యోమ్ నెట్‌వర్క్‌లతో ఇప్పటికే జియో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్‌తో ఒప్పందం ద్వారా 82,000 టవర్లు, ఆర్‌కామ్ డీల్‌తో 45,000 టవర్లు, వ్యోమ్‌తో ఒప్పందం ద్వారా 42,000 టవర్లు జియో వినియోగించుకోనుంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో.. సెప్టెంబర్ త్రైమాసికంలో 4జీ సేవలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.