mobile services
-
మన్యంలో మొబైల్ సేవల విస్తరణకు చర్యలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మొబైల్ సేవల విస్తరణకు చర్యలు చేపట్టామని, గిరిజన ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ మరింత పురోభివృద్ధి సాధించినట్లు సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ నిర్వహించిన పీఎం ప్రగతి సమీక్ష వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి సీఎస్ జవహార్‌రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టెలికం సర్వీ సుల విస్తరణకు చేపడుతోన్న చర్యల గురించి ప్రధానికి వివరించారు. సీఎస్ మాట్లాడుతూ..టవర్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకు గుర్తించిన అన్ని ప్రాంతాల్లోనూ స్థలాలను మంజూరు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ మల్లికార్జున, అదనపు డీజీపీ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల బోట్లకు ట్రాకింగ్ వ్యవస్థ సముద్రంలో చేపల వేటకు వెళ్లే అన్ని రకాల బోట్లకు ట్రాకింగ్ సిస్టమ్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ తెలిపారు. విశాఖలోని తూర్పు నౌకా దళ ప్రధాన కేంద్రంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. సీఎస్‌తో పాటు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పాల్గొన్నారు. సముద్ర తీర భద్రత, సరిహద్దులు దాటకుండా మత్స్యకారుల్ని సుశిక్షుతుల్ని చేయడం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి విశాఖలో నిర్వహించనున్న మిలాన్–2024ను విజయవంతం చేసేందుకు అనుసరించాలి్సన వ్యూహాలపై చర్చించారు. -
సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశం
వాషింగ్టన్: అంతరిక్షం నుంచి భారీ సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రభావంతో జీపీఎస్, మొబైల్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం కలగొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. సౌర తుపాను ప్రభావం భూకక్ష్యలోని ఉపగ్రహాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతరిక్షంలో సంభవించే సౌర తుపానులు అప్పుడప్పుడు భూమిని తాకే సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆయా సమయాల్లో శాటిలైట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది కూడా. The long snake-like filament cartwheeled its way off the #Sun in a stunning ballet. The magnetic orientation of this Earth-directed #solarstorm is going to tough to predict. G2-level (possibly G3) conditions may occur if the magnetic field of this storm is oriented southward! pic.twitter.com/SNAZGMmqzi — Dr. Tamitha Skov (@TamithaSkov) July 16, 2022 శక్తివంతమైనదే! జులై 15న సూర్యుడి ఉపరితలంపై శక్తివంతమైన సౌర జ్వాల మొదలైంది. బలమైన ఫొటాన్ల నుంచి వెలువడే రేడియేషన్ విస్పోటనం వల్ల ఇది ఏర్పాడుతుంది. గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. అయితే జులై 20-21 తేదీల మధ్య భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకవచ్చని ముందు నుంచి పరిశోధకులు చెప్తూ వస్తున్నారు. ఎఫెక్ట్.. గతంలో భూమి మీద సౌర తుపానుల ప్రభావం పడింది. సౌర తుపాను కారణంగా ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో ఖగోళ కాంతి ప్రకాశంగా కనిపిస్తుంది. అదే సమయంలో భూ వాతావరణం కూడా వేడక్కే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీపీఎస్, మొబైల్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చు కూడా. -
పల్లెపల్లెకూ మొబైల్
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ సేవలు లేని గ్రామాలకు 4జీ సేవలు అందించడానికి కేంద్రం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు బుధవారం సమావేశమయ్యాయి. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. యూఎస్ఓఎఫ్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని 44 ఆకాంక్ష జిల్లాల్లో 7,287 గ్రామాల్లో సుమారు రూ.6,466 కోట్ల అంచనా వ్యయంతో 4జీ ఆధారిత మొబైల్ సేవలు అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాల అనంతరం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీలోని ఆకాంక్ష జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, కడపల్లోని మారుమూల గ్రామాలకు మొబైల్ సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,054, విజయనగరంలో 154, కడప జిల్లాలో 10 గ్రామాల్లో మొబైల్ సేవల విస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.మొత్తంగా 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్ పవర్ బ్యాటరీలు ద్వారా టెలికాం టవర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 2022 వరకు పీఎంజీఎస్‌వై పథకం ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్ 1, 2 లను సెప్టెంబరు 2022 వరకూ కొనసాగించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రూ.33,822 కోట్లతో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 32,152 కి.మీ.ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం కేంద్రం పీఎంజీఎస్‌వైను ప్రారంభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధానం (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఏ) ద్వారా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 4,490 కిలోమీటర్ల మేర రహదారిలో 105 వంతెనలు ఇప్పటికే పూర్తిచేశామన్నారు. 5,714 కిలోమీటర్ల రహదారి, 358 వంతెనలు పూర్తి కావాల్సి ఉండగా మరో 1,887 కిలోమీటర్ల రహదారి, 40 వంతెనల నిర్మాణాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. ఈ పథకాన్ని మార్చి 2023 వరకు కొనసాగించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాల రాష్ట్రాల్లోని మిగిలిన పనులు పూర్తి కానున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ పతనం వెనక కారణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై వాసి అమిష్ గుప్తా 2005లో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ పెట్టించుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అది పని చేయడం మానేసింది. ఆయన దాన్ని పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్ మాత్రమే ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. హఠాత్తుగా గత మే నెలలో మళ్లీ ఆయన ఇంట్లోని ల్యాండ్‌లైన్ పని చేయడం ప్రారంభించింది. ఈ విషయమై ల్యాండ్‌లైన్ టెలికాం సర్వీసు ప్రొఫైడర్ అయిన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)కు ఫిర్యాదు చేయాలని అమిష్ గుప్తా నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు ఎంటీఎన్ఎల్ అనుబంధ సంస్థ. ఇది ఢిల్లీ, ముంబై నగరాల్లో టెలికమ్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఎలాగు ఫోన్ పని చేస్తోందిగదా! అని గుప్తా ఎంటీఎన్ఎల్ అధికారులకు పది, పదిహేనుసార్లు ఫోన్లు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయనే ఓ రోజు వడాలాలోని ఎంటీఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రెండు, మూడు కుర్చీలు, టేబుళ్లు తప్పా అన్ని కుర్చీలు, టేబుళ్లు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు, మూడు టేబుళ్ల చుట్టే ఐదారు సార్లు తిరగాల్సి వచ్చింది. అప్పటికి సరైన సమాధానం లేకపోవడంతో జూలై నెలలో ఆయన తన ల్యాండ్‌లైన్ సర్వీసును రద్దు చేసుకోవాలనుకున్నారు. ‘ల్యాండ్‌లైన్‌ను సరండర్ చేయడానికి నాకు మరో రెండు నెలలు పట్టింది. నేను సహజంగా ఎంటీఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలను అభిమానిస్తాను. ఎందుకంటే నేను అంభాని అభిమానిని కాదు. ఇంటి నుంచి పనిచేయాల్సిన కరోనా గడ్డుకాలంలో పటిష్టమైన ఇంటర్నెట్ అవసరం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఎంటీఎన్ఎల్ సర్వీసును రద్దు చేసుకొని ఆ స్థానంలో జియో ల్యాండ్‌లైన్, బ్రాండ్ బ్యాండ్ తీసుకోవాల్సి వచ్చింది’ అంటూ గుప్తా వాపోయారు. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ముకేష్ అంబానీదని తెల్సిందే. ఆ కంపెనీ 2016లో 4జీ సర్వీసులను అత్యంత చౌకగా అందిస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. ‘టెలికం రంగంలో ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడం కోసమే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నీరుగారుస్తూ వచ్చాయి’ ఎంటీఎన్ఎల్ మాజీ డిప్యూటి మేనేజర్ సూర్యకాంత్ ముద్రాస్ వ్యాఖ్యానించారు. 2010లో ముంబై, ఢిల్లీ నగరాల్లో 60 లక్షల ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం 27 లక్షలకు పడి పోయింది. ఇక దేశవ్యాప్తంగా 2016 నాటికి 2.4 కోట్ల మంది ల్యాండ్‌లైన్ వినియోగదారులుండగా, వారి సంఖ్య 2020, జూలై నాటికి 1.9 కోట్లకు పడిపోయింది. ఒక్క మొబైల్ ఫోన్ల వాడకం పెరగడమే దీనికి కారణం కాదని, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సర్వీసులు మరీ అధ్వాన్నంగా ఉండడమే కారణమని పలువురు వాటి మాజీ వినియోగదారులు తెలియజేశారు. ఫోన్ పనిచేయడం లేదంటూ ఎన్ని సార్లు ఫిర్యాదు చే సినా వచ్చి చూసేందుకు సిబ్బంది లేరంటూ నెలల తరబడి రాకపోవడంతో 2009లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్‌ను సరెండ్ చేయక తప్పలేదని హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన టీచర్ మంజులా గోస్వామి తెలిపారు. 2000 సంవత్సరం నుంచే బీఎస్ఎన్ఎల్లో సిబ్బంది తగ్గుతూ వచ్చింది. సాధారణంగా ప్రతి 500 ల్యాండ్‌లైన్ ఫోన్లకు ఒక టెక్నీషియన్ అవసరమని, అయితే ప్రస్తుతం రెండువేల ఫోన్లకు ఒక టెక్నీషియన్ చొప్పున ఉన్నారని ‘ఫెడరేషన్ ఆఫ్ టెలికామ్ ఆపరేటర్స్ యూనియన్’ అధ్యక్షుడు థామస్ జాన్ తెలిపారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ల విభాగం ‘స్వచ్ఛంద పదవీ విరమణ పథకం’ ప్రవేశపెట్టినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల్లో సిబ్బంది బాగా తగ్గిపోయారు. ఈ వాస్తవానికి ఈ రెండు సంస్థల పునరుద్ధరకు కేంద్ర ప్రభుత్వం 70 వేల రూపాయల నిధులను ప్రకటించగా, అందులో 30 వేల కోట్ల రూపాయలను పదవీ విరమణ పథకానికే కేటాయించడం గమనార్హం. పథకాన్ని అమలు చేసిన తొలి రోజే ఈ రెండు ప్రభుత్వ టెలికమ్ సంస్థల నుంచి 92,300 మంది పదవీ విరమణ పొందారు. ఆ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా టెలికం సిబ్బంది ఆందోళన చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 2019 నాటికి బీఎస్ఎన్ఎల్ నష్టాలు 13,804 కోట్ల రూపాయలుకాగా ఎంటీఎన్ఎల్ నష్టాలు 3,693 కోట్ల రూపాయలు. సిబ్బంది కొరత కారణంగానే ప్రభుత్వ టెలికమ్ సంస్థలు దెబ్బతినలేదని, ల్యాండ్లైన్లకు ఉపయోగించిన కాపర్లైన్లను మార్చి కొత్తగా ఫైబర్ కేబుళ్లు వేయాల్సి ఉండగా, అందుకు బడ్జెట్‌ను కేటాయించలేదని ఎంటీఎన్ఎల్ సెక్షన్ సూపర్వైజర్ షర్కీ తెలిపారు. ప్రైవేటు టెలికమ్ సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు జరపలేదని పేర్లు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఎంటీఎన్ఎల్ అధికారులు మీడియాకు తెలిపారు. 2016లో రిలయెన్స్ జియో సహా అన్ని ప్రైవేటు టెలికమ్ కంపెనీలు 4 జీ సర్వీసులను ప్రవేశపెట్టగా, ప్రభుత్వ సంస్థలు 3 జీ టెక్నాలజీకే పరిమితం అవడం కూడా వాటి పతనానికి దారితీసిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ‘బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం వాటి ప్రయోజనాలకు వ్యతిరేకమైనదే. వాటిని చంపేయాలనే ఉద్దేశంతోనే వారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు’ అని ఎంటీఎన్ఎల్ కామ్‌గర్ సంఘ్ అధినేత, శివసేన పార్లమెంట్ సభ్యులు అర్వింద్ సామంత్ ఆరోపించారు. -
నెలకు 1.6 జీబీ మాత్రమే : లేదంటే మోతే!
సాక్షి, ముంబై: రానున్న కాలంలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఈ సంకేతాలను సోమవారం వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరల పెరగనున్నాయంటూ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తక్కువ రేటుతో డేటా సేవలను అందించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తక్కువ ధరకు డేటా ఇవ్వడం వల్ల టెలికాం పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని మిట్టల్ అందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు 160 రూపాయలకే నెలకు 16జీబీ డేటా ఇవ్వడం బాధాకరం అన్నారు. (చదవండి : క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్) నెలకు1.6 జీబీ వినియోగానికి అలవాటు పడాలి లేదా ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాల్సిందేనని మిట్టల్ వ్యాఖ్యానించారు. అమెరికా యూరప్ లో లాగా 50-60 డాలర్లు కాకపోయినా, ఖచ్చితంగా నెలకు 160 రూపాయలకు 16జీబీ వినియోగం మాత్రం ఒక విషాదమే అని తేల్చి చెప్పారు. ఆరు నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) 200 రూపాయలు దాటొచ్చని అంచనా వేశారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకం విడుదల సందర్భంగా మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు. డేటా కోసం అయితే 100 సరిపోతుంది కానీ టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమకు 300 ఏఆర్పీయూ కావాల్సిందేనని మిట్టల్ పేర్కొన్నారు. మిట్టల్ సూచించిన లెక్కల ప్రకారం ఏఆర్పీయూ 60శాతం పెరిగితే మంచిది. కనీసం 27శాతం పెరగాలి. ప్రస్తుతం ఒక జీబీకి చెల్లిస్తున్న10 రూపాయలకు బదులుగా భవిష్యత్తులో100 రూపాయలు చెల్లించాలి. అలాగే నెలకు 45 రూపాయలు చెల్లిస్తున్న వారు రెట్టింపు కంటే ఎక్కువగా 100 రూపాయలు చెల్లించాలి. కష్ట కాలంలో కూడా టెలికాం ఆపరేటర్లు దేశానికి సేవ చేశారని, అలాగే 5జీ, ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మిట్టల్ వెల్లడించారు. కేవలం 2-3 ఆపరేటర్లతో సంక్షోభంలో పడిన పరిశ్రమ స్థిరంగా కొనసాగాలంటే రాబోయే 5-6 నెలల్లో ఖచ్చితంగా 200-250 మార్కును దాటాల్సిందేనని మిట్టల్ వెల్లడించారు. టెలికాం వ్యాపారం డిజిటల్ బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా డిసెంబర్ 2019లో టారిఫ్ పెంచిన అనంతరం జూన్ 30 నాటికి తొలి క్వార్టర్ లో ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.157కి పెరగడం గమనార్హం. -
అమెరికా–చైనా మధ్య మళ్లీ చిచ్చు!
వాషింగ్టన్: కరోనా వైరస్ అమెరికాను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న సమయంలో చైనాపై అగ్రరాజ్యం మరోసారి కన్నెర్ర చేసింది. అమెరికా మార్కెట్లో మొబైల్ సేవలు అందిస్తున్న ‘చైనా టెలికం (అమెరికా)’ను నిషేధిస్తామంటూ హెచ్చరించింది. భద్రత, న్యాయపరమైన ముప్పు ఉందంటూ అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. చైనాలో రెండో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన ‘చైనా టెలికం’ సబ్సిడరీయే చైనా టెలికం (అమెరికా). అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి అమెరికాకు టెలికమ్యూనికేషన్ సర్వీసులకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలంటూ అమెరికా న్యాయ, రక్షణ, అంతర్గత భద్రత (హోం), వాణిజ్య శాఖలు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)ను కోరాయి. కీలక శాఖల డిమాండ్‌ను ఎఫ్‌సీసీ ఆమోదిస్తే కోట్లాది అమెరికన్ల ఫోన్ సేవలకు విఘాతం ఏర్పడనుందన్నది విశ్లేషకుల అంచనా. వ్యతిరేకించిన చైనా అమెరికా చర్యలను చైనా వ్యతిరేకించింది. ‘‘అమెరికా మార్కెట్ విధానాలకు కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. వాణిజ్య విషయాలను రాజకీయం చేయడం, జాతీయ భద్రతను ఊతపదంగా వాడడాన్ని ఆపేయాలి. అలాగే, అనుచితంగా చైనా కంపెనీలను అణచివేసే విధానాలను కూడా నిలిపివేయాలి’’ అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావోలిజియాన్ ప్రకటన విడుదల చేశారు. -
జమ్మూ కశ్మీర్లో మొబైల్ సేవల పునరుద్ధరణ
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు అక్కడి అధికారులు శనివారం నిర్ణయం తీసుకున్నారు. ప్రీపెయిడ్ మొబైల్ సేవల్లో భాగంగా వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ మీడియాకు వెల్లడించారు.శనివారం నుంచే ఇది అమల్లోకి రానుందని ఆయన తెలిపారు. జమ్మూలోని పది జిల్లాలు, కశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను తిరిగి ప్రారంభించాలని ఆయన కోరారు. కాగా మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో సిమ్‌కార్డులను ఆధారాలతో దృవీకరించుకోవాలని టెలికాం అధికారులకు కన్సాల్ సూచించారు. అయితే కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న సైట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని, సోషల్ మీడియాపై మాత్రం నిషేధం అలాగే కొనసాగుతుందని కన్సాల్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శాంతి భద్రతలు పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జమ్మూ కశ్మీర్లో అన్ని ప్రీపెయిడ్ మొబైల్ సేవలను నిలిపివేస్తూ టెలికాం శాఖ ఆంక్షలు విధించింది. -
2018లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ షట్‌డౌన్
కశ్మీర్లో కల్లోలం.. ఇంటర్నెట్ కట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తం.. సమాచారం షట్ డౌన్ సున్నిత అంశాలపై కీలక తీర్పు.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవ్ ఏ ఆందోళనకైనా, ఏ నిరసనకైనా అదే తంత్రం, అదే వ్యూహం న్యూఢిల్లీ/వాషింగ్టన్: పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాంలో అంతకంతకూ ఆందోళనలు అధికమవడంతో పది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని 24 గంటల సేపు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పుడే కాదు 2018లో భారత్‌లో పలు సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. భద్రతా కారణాల రీత్యా సమాచార సంబంధాలను నిలిపివేయడం ఇవాళ, రేపు చాలా దేశాల్లో జరుగుతోంది. ఆందోళనల్ని అణచివేయాలంటే ప్రజలకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా చేయడమే మార్గమన్న ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి.భారత్‌తో పాటు చైనా, ఇరాన్, ఇథియోపియా దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్ హౌస్ సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఇంటర్నెట్, డిజిటల్ మీడియా స్వేచ్ఛపై 65కు పైగా దేశాల్లో ఈ సంస్థ సమగ్ర అధ్యయనాన్నే నిర్వహించింది. ఎప్పుడెప్పుడు ఇంటర్నెట్ షట్డౌన్లు మన దేశంలో మొదటిసారిగా 2010లో గణతంత్ర దినోత్సవాలకు ముందు కశ్మీర్ లోయలో ఇంటర్నెట్, ఫోన్ సేవల్ని నిలిపివేశారు. ► 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హన్ వనిని హతం చేసిన తర్వాత కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి. ► కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు రోజు ఆగస్టు 4 నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఫోన్ సేవలు పునరుద్ధరించారు కానీ, 130 రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్ ఇంకా వాడకంలోకి రాలేదు. ► 2016లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆందోళన సమయంలో 100 రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ► 2015లో గుజరాత్లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ పటీదార్ ఉద్యమం సందర్భంలోనూ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ► గత నెలలో రామజన్మ భూమి తీర్పుకు ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్తాన్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ అయింది. ఏ ఏడాది ఎన్నిసార్లు 2017 79 2018 134 2019 90 2012 నుంచి లెక్కల్ని చూసుకుంటే 360సార్లకు పైగా దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. హోంశాఖకి అధికారాలు ప్రజల భద్రత కోసం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, ఆంక్షలు విధించడానికి 2017లో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని కొన్ని నిబంధనల్ని చేర్చారు.. దీని ప్రకారం కేంద్ర హోంశాఖ, హోంశాఖ కార్యదర్శులకు తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసే అధికారం ఉంటుంది. అయితే అయిదు రోజుల తర్వాత పరిస్థితుల్ని తప్పనిసరిగా సమీక్షించాలి. ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు భారత్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చిన్నపాటి అనిశ్చితి పరిస్థితులకి కూడా ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని నిలిపివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేరళ హైకోర్టు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అన్నది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. రోజుల తరబడి ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం చట్టవ్యతిరేకమని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీ సభ్యుడు ప్రణేష్ ప్రకాశ్ అంటున్నారు. -
మొబైల్ సర్వీస్ పొందాలంటే ఫేస్ స్కాన్ చేయాల్సిందే !
బీజింగ్ : చైనాలో ఇక నుంచి కొత్త మొబైల్ ఫోన్ సర్వీస్ పొందాలంటే తమ ముఖాన్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సింది ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చైనా ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే నిబంధనలను ప్రకటించింది. తాజాగా ఆదివారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 'కొత్త నిబంధనల ప్రకారం కొత్త మొబైల్ కొన్నప్పుడు గానీ, లేదా మొబైల్ డేటా కాంట్రాక్టులను తీసుకున్నప్పుడు జాతీయంగా గుర్తింపు ఉన్న కార్డు చూపిస్తే సరిపోయేది. కానీ ఇక నుంచి గుర్తింపు కార్డుతో వారి ముఖాన్ని కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. దీంతో కొనుగోలుదారులు ఇచ్చిన ఐడీ సరైందో కాదో గుర్తించే అవకాశం ఉందని' చైనా ప్రభుత్వం పేర్కొంది. చైనాలో చాలా రోజుల క్రితమే అక్కడి ప్రజలు ఇంటర్నెట్ వాడాలంటే వారి అసలు పేరుతోనే లాగిన్ అయ్యేలా ఏర్పాటు చేసింది. 2017 నుంచి ఎవరైనా ఆన్లైన్లో కొత్త విషయాన్ని పోస్టు చేయాలంటే అసలు ఐడీని ఎంటర్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. తాజాగా టెలికామ్ సంస్థల కోసం అమల్లోకి తెచ్చిన ఫేస్ స్కానింగ్ వల్ల వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించే అవకాశం కలుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో మొబైల్స్ వినియోగించి ఇంటర్నెట్ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. -
జమ్మూకశ్మీర్‌లో మొబైల్ సేవలు పునరుద్ధరణ
-
‘మొబైల్’ కశ్మీరం
మరో పది రోజుల్లో జమ్మూ–కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుండగా సోమవారం ఆ రాష్ట్రంలో మొబైల్ సర్వీసుల్ని పాక్షికంగా పునరుద్ధరించారు. ఇకనుంచి అమ్మాయిలు, అబ్బాయిలు ఇంచక్కా మళ్లీ ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకోవచ్చునని అంటూ త్వరలోనే ఇంటర్నెట్ సర్వీ సులు కూడా పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. అమ్మాయిలు, అబ్బాయిల సంగతేమోగానీ.. చదువులకోసం, ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వలసపోయిన తమ కన్నబిడ్డలెలా ఉన్నారో తెలియక కలవరపడిన తల్లిదండ్రులున్నారు. వయసు మీదపడిన తమ పెద్దలు అక్కడెలా కాలక్షేపం చేస్తున్నారో, వారి యోగక్షేమాలేమిటో తెలియక దేశంలోని వివిధచోట్ల ఉంటున్న వారి పిల్లలు బెంగపెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న బంధు వులు, స్నేహితుల మధ్య కూడా ఇటువంటి పరిస్థితే నెలకొన్నది. ఆపత్సమయాల్లో వైద్యుడికి కబురు పెట్టేందుకు కూడా వీలులేకుండా పోయింది. ఇలా లక్షలాదిమంది 72 రోజుల నుంచి పడుతున్న మానసిక యాతనలకు ఇప్పుడు ముగింపు లభించింది. గత నెల 15 నుంచి ల్యాండ్‌లైన్ ఫోన్ సదుపాయంపై ఉన్న ఆంక్షల్ని సడలించారు. దాన్ని ఇళ్లలో వినియోగిస్తున్నవారు తక్కువ గనుక అందువల్ల కలిగిన మార్పు స్వల్పమే. ఏదైనా అలవాటుగా, అతి సహజంగా మారినప్పుడు.. కోరుకున్న వెంటనే అందుబాటులో కొచ్చినప్పుడు దాని విలువను గుర్తించడం ఎలాంటి వారికైనా కష్టమే. కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడం మాత్రమే కాదు... సాధారణ కదలికలపై సైతం ఆంక్షలు వచ్చి పడిన కశ్మీర్లో ఫోన్ సౌకర్యం పునరుద్ధరణ జరిగాక ఎటువంటి భావోద్వేగాలు ఉబికి వచ్చాయో చానెళ్ల లోని దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఈ సమస్య ఒక్క కశ్మీరీలది మాత్రమే కాదు... అక్కడ శాంతిభద్రత లను కాపాడటానికెళ్లిన జవాన్లది కూడా. వారు సైతం తమ క్షేమసమాచారాలను దూరప్రాంతాల్లో ఉన్న తమ ఆప్తులతో పంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సత్యపాల్ మాలిక్ అన్నట్టు మొబైల్ సర్వీసుల కన్నా కశ్మీరీల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం కావొచ్చు. వాటిని ఉగ్రవాదులు వినియోగించుకుని విధ్వంసకర కార్యకలాపాలకు దిగే ప్రమాదం ఉండొచ్చని ప్రభుత్వానికేర్పడ్డ భయాందోళనలు సహేతుకమైనవే కావొచ్చు. అయితే వాటికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే, కొన్ని పరిమితులతోనైనా కమ్యూనికేషన్ సదుపాయాలకు వీలు కల్పించి ఉంటే బాగుండేది. పర స్పరం సంభాషించుకోవడానికి, స్వేచ్ఛగా సంచరించడానికి, తమ భావాలను వ్యక్తం చేయడానికి, అయినవారి గురించి తెలుసుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఎలాంటివారికైనా దుర్భరమనిపిస్తాయి. బతుక్కి అర్ధం లేదనిపిస్తాయి. ఒక్క కమ్యూనికేషన్ల వ్యవస్థ మాత్రమే కాదు...ఆ రాష్ట్రంలో లక్షలాదిమంది పిల్లలు బడి మొహం చూసి కూడా 72 రోజులవుతోంది. బడులేమిటి...ఉన్నత విద్యాసంస్థల వరకూ అన్నిటా అదే పరిస్థితి. ఈ నెల 9 నుంచి కళాశాలలు తెరిచారు. కానీ హాజరవుతున్న విద్యార్థులు అంతంత మాత్రమే. ఒక విద్యాసంవత్సరంలో ఇంత సుదీర్ఘకాలం విద్యార్థులు చదువులకు దూరం కావడం వారి భవిష్యత్తుకెంత నష్టం కలిగిస్తుందో చెప్పనవసరం లేదు. దేశంలో ఇతర ప్రాంతాల విద్యార్థు లతో సమంగా వారు పోటీపడటం అసాధ్యమవుతుంది. విద్యాసంస్థలతోపాటు దుకాణాలు, ప్రజా రవాణా వ్యవస్థ కూడా పడకేశాయి. ఆ రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు పునరుద్ధరించాలని ప్రభుత్వం కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నదనడానికి ఈమధ్య అక్కడి పత్రికల్లో ఇచ్చిన వాణిజ్య ప్రకటనే సాక్ష్యం. మూతపడిన దుకాణాలు, కనబడని ప్రజారవాణా వ్యవస్థ ఎవరి లబ్ధికంటూ ఆ ప్రకటన ప్రశ్నించింది. ‘మిలిటెంట్లకు లొంగిపోదామా... ఆలోచించండ’ని కోరింది. దుకాణాలు, విద్యాసంస్థలు మూతబడటం మిలిటెంట్ల బెదిరింపుల వల్లేనని అధికారులు చెబుతుంటే, అది నిరసన వ్యక్తీకరణగా 370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తున్నవారు చెబుతున్నారు. మీడియాపై ఆంక్షలు లేకుంటే ఇలాంటి పరిస్థితులు చాలావరకూ నిరోధించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో, వాటి మంచిచెడ్డలేమిటో తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు సాధారణ ప్రజానీకం భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉండదు. సమాచార వినిమయంపై ఆంక్షలున్నప్పుడే వదం తులు రాజ్యమేలుతాయి. ఆ స్థితిని తమకనుకూలంగా వినియోగించుకునేందుకు రకరకాల శక్తులూ ప్రయత్నిస్తాయి. కేంద్ర ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తు న్నప్పుడు చేసిన ప్రకటనలో ఇది తాత్కాలికమేనని ప్రకటించింది. పరిస్థితులు అనుకూలించాక తిరిగి రాష్ట్ర ప్రతిపత్తినిస్తామని తెలిపింది. ఇంకా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పక్షాల నేతలు నిర్బంధంలోనే ఉన్నారు. కనుకనే ఈ నెల 24న జరగబోయే బ్లాక్ డెవెలప్మెంట్ కౌన్సిళ్ల ఎన్నికల్లో తాము పాలు పంచుకోవడం లేదని ఆ పార్టీలు తెలియజేశాయి. 370 అధికరణ రద్దు విషయంలో భిన్నాభిప్రా యంతో ఉన్నా ఈ పార్టీలన్నీ జమ్మూ–కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని స్పష్టంగా ప్రకటించినవే. కశ్మీర్లో వేర్పాటువాదుల పలుకుబడి గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గడంలో ఈ పార్టీల పాత్ర కూడా తక్కువేమీ కాదు. ఈమధ్యకాలంలో వరసగా ఆంక్షలు సడలిస్తున్నామని జమ్మూ–కశ్మీర్ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటున్న పర్యాటకం నాలుగు రోజుల క్రితం మొదలైంది. అయితే సందర్శకుల తాకిడి పెరగడానికి కొంచెం సమయం పడుతుంది. అంతర్జాతీయంగా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట పడా లంటే అక్కడ సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడమే మార్గం. రాష్ట్రంలోనూ, వెలుపలా నిర్బం ధంలో ఉన్న కశ్మీర్ నేతలను కూడా సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తే అక్కడ పరిస్థితి మెరుగ వుతుంది. ఆ దిశగా కేంద్రం ఆలోచించాలి. -
ఇక ఫ్లయిట్‌లోనూ మొబైల్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇకపై విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాల్లో కూడా మొబైల్ కాల్స్‌కు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశ విదేశ ఎయిర్‌లైన్స్, షిప్పింగ్ కంపెనీలు ఇక నుంచి ఇన్–ఫ్లయిట్, మారిటైమ్ వాయిస్.. డేటా సర్వీసులు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం అవి దేశీ టెలికం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్–ఫ్లయిట్ అండ్ మారిటైమ్ కనెక్టివిటీ (ఐఎఫ్‌ఎంసీ) రూల్స్ 2018గా ఈ మార్గదర్శకాలను వ్యవహరించనున్నట్లు, అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు డిసెంబర్ 14న విడుదల చేసిన నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం భారత గగనతలంలో ఎగిరే విమానం కనీసం 3,000 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత ఐఎఫ్‌ఎంసీ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. వార్షికంగా రూ. 1 ఫీజుతో పదేళ్ల పాటు ఐఎఫ్‌ఎంసీ లైసెన్సులు జారీ అవుతాయి. అందించే సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి పర్మిట్ హోల్డరు.. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. -
పెట్రో మంట పరిష్కారానికి కృషి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదో రోజూ పెరగడంపై న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ స్పందించారు. అంతర్జాతీయంగా అస్థిరత, ముడిచమురు ధరల్లో మార్పులు వంటి సమస్యలకు ప్రజలు ప్రభావితం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బుధవారం నాడిక్కడ ప్రధాని నేతృత్వంలో కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం రూ.25 వరకూ తగ్గించవచ్చని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చేసిన ట్వీట్లపై వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి చిదంబరం ట్విటర్లో చురుగ్గా మారారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ అమలు ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించిందన్నారు. మొబైల్ కనెక్టివిటీ రెండో విడతలో భాగంగా 10 రాష్ట్రాల్లోని 96 జిల్లాల్లో రూ.7,330 కోట్లతో 4,072 టవర్లను 2జీ, 4జీ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా ఏపీలో 8 జిల్లాల్లో 429, తెలంగాణలో 14 జిల్లాల్లో 118 టవర్ లోకేషన్లు గుర్తించామన్నారు. దేశంలో తొలిæ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని మణిపూర్‌లో ఏర్పాటు చేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తెస్తామన్నారు. -
మొబైల్ సేవలు మరింత ప్రియం?
న్యూఢిల్లీ: టెలికం టవర్లకు పన్ను ప్రయోజనాలు లభించకపోవడం వల్ల సర్వీసులు మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయని టవర్, మౌలిక సదుపాయాల కల్పన సంస్థల సమాఖ్య టైపా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50,000 పైచిలుకు టవర్లు ఏర్పాటు కానుండగా, ఒక్కో దానిపై పన్నుల కింద రూ. 1–1.5 లక్షలు కట్టాల్సి రానుందని తెలిపింది. ఫలితంగా టెలికం సర్వీసుల వ్యయాలు కూడా సుమారు 10 శాతం పెరుగుతాయని కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు చైర్పర్సన్ వనజా ఎన్ సర్నాకి రాసిన లేఖలో టైపా డైరెక్టర్ జనరల్ తిలక్ రాజ్ దువా తెలిపారు. ఈ నేపథ్యంలో టెలికంయేతర ఇన్ఫ్రా సంస్థలకు ఇస్తున్న కొన్ని పన్ను ప్రయోజనాలను తమకూ వర్తింపచేయాలని, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించేలా జీఎస్టీలో తగు సవరణలు చేయాలని కోరారు. భారతి ఇన్ఫ్రాటెల్, ఇండస్ టవర్స్, ఏటీసీ మొదలైన వాటికి టైపాలో సభ్యత్వం ఉంది. మొబైల్ టవర్ కంపెనీలు దేశవ్యాప్తంగా 4.5 లక్షల పైగా టవర్ల ఏర్పాటుపై రూ. 2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశాయని.. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ కింద ఏటా రూ. 5,000 కోట్లు చెల్లిస్తున్నాయని దువా తెలిపారు. స్పెక్ట్రం హోల్డింగ్ పరిమితి పెంపునకు కమిషన్ మొగ్గు! రుణాల్లో కూరుకున్న టెల్కోలు వైదొలిగేందుకు వెసులుబాటు కల్పించే దిశగా.. ఆపరేటర్ల స్పెక్ట్రం హోల్డింగ్ పరిమితిని పెంచాలన్న ట్రాయ్ సిఫార్సులపై టెలికం కమిషన్ సానుకూలంగా స్పందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టెలికం కమిషన్ ముసాయిదా ప్రతిపాదనలను క్యాబినెట్ తుది ఆమోదానికి ఈ వారంలో పంపే అవకాశాలు ఉన్నట్లు వివరించాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఏరియాలో ఏ ఆపరేటరుకూ 25 శాతానికి మించి స్పెక్ట్రం ఉండటానికి వీల్లేదు. అయితే, నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల్లో దీన్ని 50 శాతానికి పెంచాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. -
రేపటి నుంచి మొబైల్ సర్వీసులు బంద్?
కొత్త ఏడాది సంబురం ఇంకా పూర్తిగా తీరనేలేదు. అప్పుడే ప్రజల్లో కలవరపెట్టే మెసేజ్‌లు. టెలికాం సబ్స్క్రైబర్లను టార్గెట్‌గా చేస్తూ... ఎస్ఎంఎస్ల వెల్లువ కొనసాగుతోంది. ఈ మెసేజస్‌లోని సందేశం.. జనవరి 7 నుంచి మీ నెంబర్‌పై వాయిస్ సర్వీసులు ఆగిపోనున్నాయని. ఇతర నెట్‌వర్క్‌లోకి మీ నెంబర్‌ను మార్చుకుంటేనే పనిచేస్తాయంటూ ఆందోళనకర మెసేజ్‌లు వస్తున్నాయి. అన్ని టెలికాం ఆపరేటర్లకు ఈ మెసేజ్‌లు వెళ్తున్నాయి. దీంతో వెంటనే కస్టమర్లు ట్విట్టర్ వేదికగా టెలికాం కంపెనీలకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. అయితే ఈ మెసేజ్‌లను టెలికాం కంపెనీలు పంపడం లేదట. యూజర్ల ఫిర్యాదులపై స్పందించిన జియో, వొడాఫోన్, ఐడియా కంపెనీలు, అది తప్పుడు మెసేజ్‌లను అని, యూజర్లు ఆ మెసేజ్‌ను పట్టించుకోవద్దంటూ క్లారిటీ ఇచ్చాయి. వాటిని తాము పంపడం లేదని కూడా పేర్కొన్నాయి. ఎయిర్టెల్ ప్రతినిధి ఆ మెసేజ్‌ను ఓ స్పామ్‌గా ధృవీకరించారు. టాటా డొకోమో, బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లకు కూడా ఈ మెసేజ్‌లు వస్తున్నట్టు తెలిసింది. ఆశ్చర్యకరంగా యూపీసీను జనరేట్ చేసి నెంబర్‌ను వేరే నెట్‌వర్క్‌కు పోర్టు పెట్టుకోవాలంటూ యూజర్లను ఆదేశిస్తున్నాయి. అయితే ఏ ఆపరేటర్‌కు పోర్టు పెట్టుకోవాలో చెప్పడం లేదు. ఒక్క ఆపరేటర్ సబ్‌స్క్రైబర్‌కు మాత్రమే కాక, ప్రతి ఆపరేటర్ యూజర్లకు ఈ మేరకు ఎస్ఎంఎస్లు వస్తుండటం సబ్స్క్రైబర్లను ఆందోళనలో పడేసింది. జనవరి 7 ఫేక్ డెడ్‌లైన్ అని, ఆధార్‌తో మొబైల్ నెంబర్‌ను వెరిఫికేషన్ చేసుకునే ప్రక్రియకు డెడ్‌లైన్ 2018 మార్చి 31 వరకు ఉందని కంపెనీ పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆధార్ లేనివారికైతే, మార్చి 31 డెడ్‌లైన్ కాగ, ఇప్పటికే ఆధార్ కలిగి ఉన్న వారికి సిమ్ వెరిఫికేషన్‌కు ఆఖరి తేది ఫిబ్రవరి 6. ఐవీఆర్ ద్వారా ఆధార్-మొబైల్ నెంబర్ సిమ్ రీ-వెరిఫికేషన్ చేపట్టుకోవచ్చని టెల్కోలు చెప్పాయి. @JioCare received following SMS from IM-INFOKB and HP-INFORM "Dear Customer, Voice services shall stop from 07/01/2018. Continue to use your number you can generate UPC to port in any other Network." Pl advise. — santhosh nair (@nair_san) January 5, 2018 Please ignore and don't believe on such fake messages. We are always here to give you authentic updates - Devendra — JioCare (@JioCare) January 5, 2018 Got a msg on my @VodafoneIN mobile - Dear Customer, Voice services shall stop from 07/01/2018. Continue to use your number you can generate UPC to port in any other Network. Any authenticity in this? — KRD Pravin (@krdpravin) January 5, 2018 This is a spam msg and has not been sent by Vodafone. We request you to ignore this msg & we assure you of continued uninterrupted services. - Harsha — Vodafone India (@VodafoneIN) January 5, 2018 @idea_cares Received sms from IM-INFOKB that "Dear Customer, Voice services shall stop from 07/01/2018. Continue to use your number you can generate UPC to port in any other Network. and IM stands for I-Idea and M-Mumbai. Is idea shutting voice service in mumbai — Kailas Dingankar (@KailasDingankar) January 5, 2018 Sorry for trouble caused to you,We request you to please kindly ignore the message. We have launched new postpaid plans (Nirvana) for our valuable customers.Write us back for further clarification. Regards, Simran.D — Idea Customercare (@idea_cares) January 5, 2018 -
టూ వీలర్, మొబైల్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు టూవీలర్, మొబైల్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం, వ్యక్తిగత వికాస తరగతులు, స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్థానిక వెంకటేశ్వరకాలనీలోని తమ సంస్థ కార్యాలయాన్ని, 08542-270395, 9985529381 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పాక్‌లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు బంద్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కొన్ని గంటల పాటు ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను ఆపివేశారు. శుక్రవారం ఇస్లామాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. పాక్‌లో ఇస్లామిక్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మతాధికారి మౌలానా అబ్దుల్ అజీజ్ పిలుపునివ్వడంతో భద్రత కారణాల రీత్యా ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను బంద్ చేశారు. ఇస్లామాబాద్‌లో రెడ్ మసీదుకు రెండు కిలో మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. గత నెల రోజుల్లోనే ఇస్లామాబాద్‌లో ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను రద్దు చేయడమిది మూడోసారి. -
భారత్‌లో మొబైల్ సర్వీసుల విశ్వరూపం
న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ సర్వీసుల రంగం భారీగా విస్తరించనుంది. 2020 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా 8.2%కి (దాదాపు రూ. 14 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ టెలికం ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ జీఎస్ఎంఏ అధ్యయనం ఒకటి పేర్కొంది. ‘‘ది మొబైల్ ఎకానమీ: ఇండియా 2015’ పేరుతో ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. 2014 జీడీపీలో ఈ రంగం వాటా 6.1% ఉందని, పరిమాణంలో ఇది రూ.7.7 లక్షల కోట్లని నివేదిక విడుదల సందర్భంగా జీఎస్ఎంఏ ఆసియా హెడ్ అలేస్దర్ గ్రాట్ పేర్కొన్నారు. 2014లో ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. 2020 నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుతుందని వివరించారు. పన్నులు, స్పెక్ట్రమ్ ఆక్షన్ చెల్లింపుల రూపంలో 2014లో ప్రభుత్వానికి ఈ రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తెలిపింది. ఈ మొత్తం దాదాపు రూ. 1.1 లక్షల కోట్లుగా తెలిపింది. కాగా భారత్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటినట్లు ట్రాయ్ వెల్లడించగా.. వాస్తవ యూజర్ల సంఖ్య దాదాపు 45.3 కోట్లుగా జీఎస్ఎంఏ నివేదిక పేర్కొంటోంది. ఈ ఏడాది ఈ సంఖ్య 50 కోట్లు దాటుతుందని తెలిపింది. 2014 దేశజనాభాలో మొబైల్ వినియోగ రేటును ట్రాయ్ 74%గా పేర్కొంటే నివేదిక మాత్రం 36%గా అంచనావేసింది. a -
21 బిలియన్ డాలర్లకు మొబైల్ సర్వీసెస్ మార్కెట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో మొబైల్ సర్వీసెస్ మార్కెట్ 21.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని గార్ట్నర్ పేర్కొంది. ట్యాబ్లెట్స్, నోట్‌బుక్స్ వంటి డేటా-సెంట్రిక్ పరికరాల్లో సెల్యులార్ సేవల వినియోగం పెరగటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మొబైల్ సర్వీసెస్ మార్కెట్ వృద్ధి 4 శాతంగా ఉంటుందని అంచనా. డేటా సేవల వినియోగం పెరుగుదలతో మొబైల్ సేవల ఖర్చు 15 శాతం వృద్ధితో 6.5 మిలియన్ డాలర్లకు చేరనుంది. భారత్‌లో గతేడాది 83 కోట్లుగా ఉన్న మొబైల్ కనెక్షన్ల సంఖ్య ఈ ఏడాది 5 శాతం వృద్ధితో 88 కోట్లకు చేరుతుందని అంచనా. స్మార్ట్ఫోన్ల వినియోగంలో వృద్ధి వంటి అంశాలూ డేటా సేవల ఖర్చు పెరుగుదలకు దోహదపడనున్నాయి. -
రేపు అక్కడి ఫోన్లేవీ పనిచేయవు!
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో మొబైల్ ఫోన్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇస్లామాబాద్‌లో సెల్ఫోన్లేవీ పనిచేయవని అక్కడి హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని జియో న్యూస్ ప్రకటించింది. రాజధాని నగరంలో జరిగే స్వాతంత్ర్య దిన సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని.. ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం కూడా రిహార్సల్స్ కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మొబైల్ సర్వీసులను సస్పెండ్ చేశారు. -
‘సులభ మొబైల్’తో రైతులకు 56 వేల కోట్లు
న్యూఢిల్లీ: సులభతరమైన మొబైల్ ఆధారిత సేవల పరిచయం చేయడం ద్వారా రానున్న ఐదేళ్లలో భారతదేశంలోని ఏడు కోట్ల మంది చిన్న తరహా రైతుల ఆదాయాన్ని రూ. 56 వేల కోట్లకు పైగా పెంచవచ్చని ఒక సర్వే తెలిపింది. వ్యవసాయ సమాచారం, చెల్లింపులు, రుణాలు, ఫీల్డ్ ఆడిట్ లాంటి సాధారణ మొబైల్ సేవలు దాదాపు 2/3 వంతు రైతుల ఆదాయాన్ని ఏడాదికి సగటున రూ. 8,000 వరకు పెంచేందుకు దోహదం చేస్తాయని తన నివేదికలో పేర్కొంది. ఈ సేవల ద్వారా భారతదేశంలో ఉన్న ఏడు కోట్ల చిన్న తరహా రైతుల వ్యవసాయ ఆదాయాన్ని 2020 కల్లా రూ. 56 వేల కోట్లకు పెంచి మార్కెట్లను వృద్ధిలోకి తీసుకురావచ్చని ‘కనెక్టెడ్ ఫార్మింగ్ ఇండియా’ తన నివేదికలో తెలిపింది. వోడాఫోన్ ఫౌండేషన్ సహకారంతో పరిశోధన చేసిన సంస్థ నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశంలో చాలా రైతు కుటుంబాలు రూ. 250 కంటే తక్కువ ఆదాయంతో ఆహారం, విద్య సదుపాయాల కోసం పోరాడుతున్నాయని తేలింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాధారణ మొబైల్ సేవల ద్వారా 2/3 వంతు రైతుల ఆదాయాన్ని పెంచి, వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి వీలవుతుందని వోడాఫోన్ మీడియా ఎండీ, సీఈవో సునీల్ సూద్ వివరించారు. -
శనివారానికల్లా సెల్ సర్వీసుల పునరుద్ధరణ: ఎయిర్టెల్
తుఫాను దెబ్బతో విలవిల్లాడిన విశాఖ ప్రజలకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. బాధితులను ఆదుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు గట్టిగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఆ ప్రాంతంలో సెల్‌ఫోన్ సర్వీసులను పునరుద్ధరించడానికి తామంతా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు సునీల్ మిట్టల్ చెప్పారు. శనివారం సాయంత్రానికల్లా అక్కడ ఎయిర్టెల్ సెల్ఫోన్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అయితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఇంకా బాగోలేదని ఆయన అన్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా ఉందని చెప్పారు. అయితే.. డబ్బు మిగుల్చుకోడానికి టెలికం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, అందుకే సెల్ టవర్లకు డీజిల్ జనరేటర్లను ఉపయోగించట్లేదని చంద్రబాబు ఆరోపించారు. దాన్ని సునీల్ మిట్టల్ ఖండించారు. సెల్ టవర్లను అసలు టెలికం కంపెనీలు నడపడంలేదని, డీజిల్‌తో నడపాలా.. కరెంటుతో నడపాలా అనేది తమ చేతుల్లో లేదని అన్నారు. టెలికం సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని, టవర్లను మాత్రం నడిపించేది థర్డ్ పార్టీ వ్యక్తులని ఆయన చెప్పారు. -
అమెరికన్ టవర్స్‌తో రిలయన్స్ జియో జట్టు
న్యూఢిల్లీ: మొబైల్ సేవలను ప్రారంభించేందుకు రిలయన్స్ జియో జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికన్ టవర్ కార్పొరేషన్ తో(ఏటీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏటీసీకి దేశవ్యాప్తంగా ఉన్న 11,000 టవర్లను మొబైల్ సేవల కోసం వినియోగించుకోనుంది. తాజా ఒప్పందంతో రిలయన్స్ జియో చేతిలో మొత్తం 1,80,000 టవర్లు ఉన్నట్లు అవుతుంది. వీటి కోసం భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, వ్యోమ్ నెట్‌వర్క్‌లతో ఇప్పటికే జియో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్‌తో ఒప్పందం ద్వారా 82,000 టవర్లు, ఆర్‌కామ్ డీల్‌తో 45,000 టవర్లు, వ్యోమ్తో ఒప్పందం ద్వారా 42,000 టవర్లు జియో వినియోగించుకోనుంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో.. సెప్టెంబర్ త్రైమాసికంలో 4జీ సేవలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. -
పోలింగ్‌కు 48 గంటల ముందు రాజకీయ ఎస్ఎంఎస్లు బంద్ ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేవిధంగా రాజకీయ నాయకులు పంపే సామూహిక ఎస్ఎంఎస్లను ఎన్నికల తేదీకి 48 గంటల ముందు నుంచి నిలిపివేయాలని మొబైల్ సర్వీస్ కంపెనీలకు ఎలక్షన్ కమిషన్ శుక్రవారం ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా ఓటర్లను వివిధ పార్టీలు ఎస్ఎంఎస్ల ద్వారా ప్రలోభపెట్టకుండా ఈసీ దృష్టి సారించనుంది. ఒకవేళ ఏ పార్టీలేదా పార్టీ అభ్యర్థి సామూహిక ఎస్ఎంఎస్ల కోసం సంప్రదిస్తే వారి వివరాలను తమకు అందించాలని మొబైల్ ఆపరేటర్లకు ఈసీ ఆదేశించింది. ఈ విషయమై శుక్రవారం అన్ని మొబైల్ ఆపరేటర్లతో ఈసీ సమావేశం నిర్వహిం చింది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ మాట్లాడుతూ పోలింగ్‌కు ముందు 48 గంటలలోపు రాజకీయపార్టీలు ఓటర్లకు సామూహిక ఎస్ఎంఎస్లను పంపాలని కోరితే నిరాకరించాలని మొబైల్ సర్వీస్ ఆపరేటర్లకు సూచించామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల ఉందని ప్రత్యేక ముఖ్య ఎన్నికల అధికారి షుర్‌బిర్ సింగ్ తెలిపారు. అలాగే సరైన పరిశీలన లేకుండా ఎవరికీ సిమ్‌కార్డులను జారీ చేయొద్దని మొబైల్ సర్వీస్ ప్రతినిధులను కోరామన్నారు. ఎన్నికల ముందు సిమ్‌కార్డుల కొనుగోళ్లు గణనీయంగా పెరి గినట్లు తమ దృష్టికి వచ్చిందని, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో సిమ్‌కార్డులు తీసుకునేవారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలుంటాయని ఆయన విశ్లేషించారు. దీన్ని నివారించేందుకు ముందే యాక్టివేట్ చేసిన సిమ్‌కార్డుల అమ్మకాలను నిలిపివేయాలని చెప్పారు. సిమ్‌కార్డులతో ఎటువంటి సమస్య ఎదురైనా డీలరుపైనే కాకుండా సదరు కంపెనీపైనా కూడా చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు హెచ్చరించారు