శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు అక్కడి అధికారులు శనివారం నిర్ణయం తీసుకున్నారు. ప్రీపెయిడ్ మొబైల్ సేవల్లో భాగంగా వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ మీడియాకు వెల్లడించారు.శనివారం నుంచే ఇది అమల్లోకి రానుందని ఆయన తెలిపారు. జమ్మూలోని పది జిల్లాలు, కశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను తిరిగి ప్రారంభించాలని ఆయన కోరారు. కాగా మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో సిమ్‌కార్డులను ఆధారాలతో దృవీకరించుకోవాలని టెలికాం అధికారులకు కన్సాల్ సూచించారు.
అయితే కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న సైట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని, సోషల్ మీడియాపై మాత్రం నిషేధం అలాగే కొనసాగుతుందని కన్సాల్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శాంతి భద్రతలు పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జమ్మూ కశ్మీర్‌లో అన్ని ప్రీపెయిడ్ మొబైల్ సేవలను నిలిపివేస్తూ టెలికాం శాఖ ఆంక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment