నెలకు 1.6 జీబీ మాత్రమే : లేదంటే మోతే! | Sunil Mittal hints at mobile services rate hike | Sakshi
Sakshi News home page

నెలకు 1.6 జీబీ మాత్రమే : లేదంటే మోతే!

Published Tue, Aug 25 2020 1:16 PM | Last Updated on Tue, Aug 25 2020 2:16 PM

Sunil Mittal hints at mobile services rate hike - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షి, ముంబై: రానున్న కాలంలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఈ సంకేతాలను సోమవారం వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరల పెరగనున్నాయంటూ  ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తక్కువ రేటుతో డేటా సేవలను అందించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తక్కువ ధరకు డేటా ఇవ్వడం వల్ల టెలికాం పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని మిట్టల్ అందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు 160 రూపాయలకే నెలకు 16జీబీ డేటా ఇవ్వడం బాధాకరం అన్నారు.  (చదవండి : క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్)

నెలకు1.6 జీబీ వినియోగానికి అలవాటు పడాలి లేదా ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాల్సిందేనని మిట్టల్ వ్యాఖ్యానించారు. అమెరికా యూరప్ లో లాగా 50-60 డాలర్లు కాకపోయినా, ఖచ్చితంగా నెలకు 160 రూపాయలకు 16జీబీ  వినియోగం మాత్రం ఒక విషాదమే అని తేల్చి చెప్పారు. ఆరు నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్‌పీయూ) 200 రూపాయలు దాటొచ్చని అంచనా వేశారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకం విడుదల సందర్భంగా మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు. డేటా కోసం అయితే 100 సరిపోతుంది కానీ టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమకు 300 ఏఆర్పీయూ కావాల్సిందేనని మిట్టల్  పేర్కొన్నారు.

మిట్టల్ సూచించిన లెక్కల ప్రకారం ఏఆర్‌పీయూ 60శాతం పెరిగితే మంచిది. కనీసం 27శాతం పెరగాలి. ప్రస్తుతం ఒక జీబీకి చెల్లిస్తున్న10 రూపాయలకు బదులుగా భవిష్యత్తులో100 రూపాయలు చెల్లించాలి. అలాగే నెలకు 45 రూపాయలు  చెల్లిస్తున్న వారు రెట్టింపు  కంటే ఎక్కువగా 100 రూపాయలు చెల్లించాలి.

కష్ట కాలంలో కూడా టెలికాం ఆపరేటర్లు దేశానికి సేవ చేశారని, అలాగే 5జీ, ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మిట్టల్ వెల్లడించారు. కేవలం 2-3 ఆపరేటర్లతో సంక్షోభంలో పడిన పరిశ్రమ  స్థిరంగా కొనసాగాలంటే రాబోయే 5-6 నెలల్లో ఖచ్చితంగా 200-250  మార్కును దాటాల్సిందేనని మిట్టల్ వెల్లడించారు. టెలికాం వ్యాపారం డిజిటల్ బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా డిసెంబర్ 2019లో టారిఫ్ పెంచిన అనంతరం జూన్ 30 నాటికి తొలి క్వార్టర్ లో ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.157కి పెరగడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement