
వాషింగ్టన్: కరోనా వైరస్ అమెరికాను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న సమయంలో చైనాపై అగ్రరాజ్యం మరోసారి కన్నెర్ర చేసింది. అమెరికా మార్కెట్లో మొబైల్ సేవలు అందిస్తున్న ‘చైనా టెలికం (అమెరికా)’ను నిషేధిస్తామంటూ హెచ్చరించింది. భద్రత, న్యాయపరమైన ముప్పు ఉందంటూ అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. చైనాలో రెండో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన ‘చైనా టెలికం’ సబ్సిడరీయే చైనా టెలికం (అమెరికా). అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి అమెరికాకు టెలికమ్యూనికేషన్ సర్వీసులకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలంటూ అమెరికా న్యాయ, రక్షణ, అంతర్గత భద్రత (హోం), వాణిజ్య శాఖలు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)ను కోరాయి. కీలక శాఖల డిమాండ్‌ను ఎఫ్‌సీసీ ఆమోదిస్తే కోట్లాది అమెరికన్ల ఫోన్ సేవలకు విఘాతం ఏర్పడనుందన్నది విశ్లేషకుల అంచనా.
వ్యతిరేకించిన చైనా
అమెరికా చర్యలను చైనా వ్యతిరేకించింది. ‘‘అమెరికా మార్కెట్ విధానాలకు కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. వాణిజ్య విషయాలను రాజకీయం చేయడం, జాతీయ భద్రతను ఊతపదంగా వాడడాన్ని ఆపేయాలి. అలాగే, అనుచితంగా చైనా కంపెనీలను అణచివేసే విధానాలను కూడా నిలిపివేయాలి’’ అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావోలిజియాన్ ప్రకటన విడుదల చేశారు.