శనివారానికల్లా సెల్ సర్వీసుల పునరుద్ధరణ: ఎయిర్టెల్
తుఫాను దెబ్బతో విలవిల్లాడిన విశాఖ ప్రజలకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. బాధితులను ఆదుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు గట్టిగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఆ ప్రాంతంలో సెల్ఫోన్ సర్వీసులను పునరుద్ధరించడానికి తామంతా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు సునీల్ మిట్టల్ చెప్పారు.
శనివారం సాయంత్రానికల్లా అక్కడ ఎయిర్టెల్ సెల్ఫోన్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అయితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఇంకా బాగోలేదని ఆయన అన్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా ఉందని చెప్పారు.
అయితే.. డబ్బు మిగుల్చుకోడానికి టెలికం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, అందుకే సెల్ టవర్లకు డీజిల్ జనరేటర్లను ఉపయోగించట్లేదని చంద్రబాబు ఆరోపించారు. దాన్ని సునీల్ మిట్టల్ ఖండించారు. సెల్ టవర్లను అసలు టెలికం కంపెనీలు నడపడంలేదని, డీజిల్తో నడపాలా.. కరెంటుతో నడపాలా అనేది తమ చేతుల్లో లేదని అన్నారు. టెలికం సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని, టవర్లను మాత్రం నడిపించేది థర్డ్ పార్టీ వ్యక్తులని ఆయన చెప్పారు.