Sunil Bharti Mittal, Comments On Jio | ‘జియో’ దెబ్బకు తట్టా, బుట్టా సర్దుకున్నా - Sakshi
Sakshi News home page

‘జియో’ దెబ్బకు తట్టా, బుట్టా సర్దుకున్నా

Published Sat, Apr 17 2021 1:14 AM | Last Updated on Sun, Apr 18 2021 4:11 AM

Airtel Founder Sunil Bharati Mittal Comments On Jio Network  - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ సంక్షోభాలను తట్టుకుని నిలబడడమే కాదు, వృద్ది చెందుతుందని ఆ సంస్థ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌ అన్నారు. మూడు, నాలుగు పెద్ద సంక్షోభాలను తట్టుకుని ఇప్పుడు పటిష్టమైన స్థితికి కంపెనీ చేరుకుందన్నారు. అమెజాన్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టెలికం పరిశ్రమపై జియో ముద్ర, దేశ భవిష్యత్తుపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘ఇటీవల ఒక సంక్షోభం 2016లో జియో ఆవిష్కరణ రూపంలో వచ్చింది. భారతీయ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన పోటీదారు. ఏడాది పాటు ఉచిత సేవలు, తదుపరి ఏడాది పాటు రాయితీ సేవలు, మార్కెట్‌ను కొల్లగొట్టే టారిఫ్‌లు, సబ్సిడీ ఫోన్లు.. వీటన్నింటి ఫలితంగా 12 ఆపరేటర్లలో 9 మంది తట్టా, బుట్టా సర్దుకుని వెళ్లిపోవడం, దివాలా తీయడం (ఆర్‌కామ్‌), మాతో, ఇతర ఆపరేటర్లతో విలీనం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడు ముగ్గురు ప్రైవేటు ఆపరేటర్లే మిగిలారు. వీరిలో ఒక ఆపరేటర్‌ భారీగా ఎదగడం ప్రశ్నార్థకమని మిట్టల్‌ వ్యాఖ్యానించారు.

వ్యాపారాలకు గొప్ప అవకాశం..
‘‘వ్యాపారాలకు భారత్‌ ఒక గొప్ప వేదిక. ఉత్పత్తులు, సేవలను దండిగా ఉపయోగించే ఎంతో మంది వినియోగదారులు ఉన్న మార్కెట్‌ ఇది. జీడీపీ, వినియోగ రంగానికి యువ జనాభా ప్రోత్సాహాన్నిస్తోంది. భారత్‌ పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల సాయంతో అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఊబర్, ఓలా సేవలను వినియోగిస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి డెలివరీ సేవలు సహా అన్నీ కూడా డిజిటల్‌ వేదికపై వేగంగా మళ్లుతున్నాయి’’ అని మిట్టల్‌ వివరించారు. చాలా మంది చైనా నుంచి తమ వ్యాపారాలను భారత్‌కు మార్చాలనుకుంటున్నారని.. దీంతో మరింత తయారీ భారత్‌కు రానున్నట్టు చెప్పారు. వచ్చే 5–10 ఏళ్లలో భారత్‌ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరింత తయారీ, డిజిటల్, స్వీయ సమృద్ధ భారత్‌ను చూస్తామన్నారు.

టెల్కోలకు స్పెక్ట్రం కేటాయింపు పూర్తి
కాగా, ఇటీవల నిర్వహించిన వేలంలో స్పెక్ట్రంను కొనుగోలు చేసిన టెల్కోలకు కేటాయింపుల ప్రక్రియ పూర్తయినట్లు టెలికం శాఖ (డాట్‌) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ అసైన్‌మెంట్‌ లెటర్లను బిడ్డర్లకు శుక్రవారం జారీ చేసినట్లు తెలిపింది. స్పెక్ట్రంను వెంటనే కేటాయించిన నేపథ్యంలో రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ సంస్థలు తక్షణం సుమారు రూ. 2,307 కోట్లు చెల్లించినట్లు డాట్‌ తెలిపింది.

ఇందులో ఎయిర్‌టెల్‌ రూ.157 కోట్లు, జియో రూ.2,160 కోట్లు చెల్లించాయి. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు/సెప్టెంబర్‌లో టెల్కోలు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. మార్చిలో నిర్వహించిన వేలంలో టెలికం సంస్థలు మొత్తం రూ.77,821 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. వేలం నిబంధనల ప్రకారం ఇందులో సుమారు రూ. 21,918 కోట్లను మార్చి 18న ముందస్తుగా కట్టాయి. జియో రూ.57,100 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేయగా, ఎయిర్‌టెల్‌ రూ.18,700 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను దక్కించుకుంది. ఇక వొడాఫోన్‌ ఐడియా రూ. 1,993 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను వేలంలో కొనుగోలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement