న్యూఢిల్లీ: దేశీ టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి చివరినాటికి 120.50 కోట్లకు చేరింది. జనవరిలో ఈ సంఖ్య 120.37 కోట్లుగా ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జోరు కారణంగానే వినియోగదారుల సంఖ్య ఈమేరకు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిపి ఫిబ్రవరిలో 86.39 లక్షల కస్టమర్లను జోడించగా.. మిగిలిన టెలికం కంపెనీలు 69.93 లక్షల వైర్‌లెస్ కస్టమర్లను కోల్పోయాయి. అత్యధికంగా వినియోగదారులను కోల్పోయిన కంపె నీల జాబితాలో.. వొడాఫోన్ ఐడియా తొలి స్థానంలో ఉన్నట్లు తేలింది.
ఒక్క జియోనే ఫిబ్రవరిలో 77.93 లక్షల వినియోగదారులను జోడించి.. అనతికాలంలోనే ఏకంగా 30 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డును సొంతం చేసుకుంది. ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ 9 లక్షల మందిని జోడించి కస్టమర్ల బేస్‌ను 11.62 కోట్లకు చేర్చింది. ఈ అంశంపై బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘మా సేవల పట్ల కస్టమర్లకు ఉన్న విశ్వాసం వల్లనే బేస్ పెరిగింది. సంస్థ 3జీ నెట్‌వర్క్ మరింత మెరుగుపడింది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు వొడాఫోన్ ఐడియా 57.87 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఫిబ్రవరి చివరినాటికి ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 40.93 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment