న్యూఢిల్లీ: టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా స్పెక్ట్రమ్ సంబంధ బకాయిలన్నిటీని చెల్లించింది. టెలికం శాఖ(డాట్)కు రూ. 30,791 కోట్లు జమ చేసింది. తద్వారా 2021 మార్చివరకూ వడ్డీసహా స్పెక్ట్రమ్ సంబంధ బకాయిలను పూర్తిగా తీర్చివేసినట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. వీటిలో 2014, 2015, 2016లలో వేలం ద్వారా చేజిక్కించుకున్న స్పెక్ట్రమ్‌తోపాటు.. 2021లో ఎయిర్‌టెల్ ద్వారా సొంతం చేసుకున్న రేడియో తరంగాల బకాయిలు సైతం ఉన్నట్లు వివరించింది. వెరసి వేలం, ట్రేడింగ్‌ల ద్వారా మొత్తం 585.3 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను పొందినట్లు వెల్లడించింది.
ప్యాకేజీకి నో...
స్పెక్ట్రమ్ బకాయిలను పూర్తిగా చెల్లించడం ద్వారా ఏడాదికి రూ. 1,200 కోట్లమేర వడ్డీ వ్యయాలను ఆదా చేసుకోనున్నట్లు రిలయన్స్ జియో తెలియజేసింది. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం అంచనాలను మదింపు చేసింది. దీంతో ప్రభుత్వం టెలికం రంగానికి గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని వినియోగించుకోబోమని చెప్పినట్లయ్యింది. ఇటీవల వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్, టాటా టెలీ(మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి వాటాలను కేటాయించిన విషయం విదితమే. తద్వారా వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుండగా, టాటా టెలీ సర్వీసెస్, టాటా టెలీ(మహారాష్ట్ర) 9.5 శాతం చొప్పున వాటాలు కేటాయించనున్నాయి. ఈ నేపథ్యంలో జియో చెల్లింపులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.
జియో స్పెక్ట్రమ్ బకాయిలు క్లియర్
Published Thu, Jan 20 2022 1:53 AM | Last Updated on Thu, Jan 20 2022 1:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment