ఒక్కరోజులోనే స్పెక్ట్రమ్ వేలానికి ఇన్నికోట్లా!!
ఒక్కరోజులోనే స్పెక్ట్రమ్ వేలానికి ఇన్నికోట్లా!!
Published Mon, Oct 3 2016 12:47 PM | Last Updated on Fri, Nov 9 2018 6:16 PM
దేశంలోనే అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలానికి అనూహ్య స్పందన వస్తోంది. శనివారం ప్రారంభమైన ఈ వేలం ప్రక్రియలో ఒక్కరోజులోనే రూ.53,531 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి.ప్రధాన టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, జియో, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్, టాటా టెలీలు ఈ వేలంలో పాల్గొంటున్నాయి. ఏడు బ్యాండ్లలో మొత్తం 2,354.55 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ వేలానికి వచ్చింది. రూ.5.66 లక్షల కోట్లను రిజర్వ్ ధరగా కేంద్ర సర్కారు ఖరారు చేసింది.ఐదు రౌండ్లలో మొత్తం రూ.53,531 కోట్ల బిడ్స్ దాఖలైనట్టు అధికారులు వర్గాలు తెలిపాయి. 700మెగాహెడ్జ్, 900 మెగాహెడ్జ్ ప్రీక్వెన్సీలపై కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
1800 మెగాహెడ్జ్ బ్యాండులపై ఆపరేటర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు ఐదు రౌండ్ల ముగింపు అనంతరం టెలికాం డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా 2జీ/4జీ సర్వీసులను ఆపరేటర్లు వినియోగదారులకు అందించే అవకాశముంటుంది. 2100మెగాహెడ్జ్ (3జీ/4జీ)బ్యాండ్స్, 2500మెగాహెడ్జ్(4జీ) బ్యాండ్, 2300మెగాహెడ్జ్(4జీ), 800మెగాహెడ్జ్(2జీ/4జీ) బ్యాండ్స్పై కూడా ఆపరేటర్లు బిడ్స్ దాఖలు చేస్తున్నట్టు టెలికాం డిపార్ట్మెంట్ పేర్కొంది. ఎక్కువ వేలం 1800మెగాహెడ్జ్ బ్యాండులో జరుగుతుందని తెలిపింది. ఢిల్లీ, ముంబాయి, కోల్కత్తా, గుజరాత్, యూపీ(ఈస్ట్/వెస్ట్)లోని మొత్తం 22 టెలికాం సర్కిళ్లలో 19 వాటిలో ఈ బ్యాండ్కు ఎక్కువగా బిడ్డింగ్ దాఖలైనట్టు తెలిపింది.3జీ సర్వీసుల కోసం 2100మెగాహెడ్జ్ బ్యాండుకు 9 టెలికాం సర్కిళ్లలో డిమాండ్ ఉన్నట్టు వెల్లడించింది.2300మెగాహెడ్జ్, 2500మెగాహెడ్జ్ బ్యాండులకు కూడా వివిధ సర్కిళ్లలో డిమాండ్ వస్తున్నట్టు చెప్పింది.
Advertisement
Advertisement