న్యూఢిల్లీ: మరోవిడత 2జీ మొబైల్ స్పెక్ట్రం వేలానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 23 నుంచి 2జీ వేలం ప్రారంభమవుతుందని, ఇందుకు ఔత్సాహిక కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ టెలికం శాఖ(డాట్) నోటిఫికేషన్‌ను జారీచేసింది. కాగా, గతంలో పేర్కొన్న 60 రోజుల వేలం ప్రారంభ ప్రక్రియను ఇప్పుడు 42 రోజులకు కుదించడం గమనార్హం. దేశవ్యాప్తంగా అన్ని సర్వీసు ప్రాంతాల్లో 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లోనూ... మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఏకకాలంలో స్పెక్ట్రం వేలాన్ని చేపట్టనున్నట్లు డాట్ ప్రకటించింది.
ఈమేరకు ఉమ్మడి ప్రకటనను గురువారం పొద్దుపోయాక విడుదల చేసినట్లు తెలిపింది. కాగా, తాజా వేలం ద్వారా ఖజానాకు రూ.48,685 కోట్లు సమకూరవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తిగల టెలికం కంపెనీ(టెల్కో)లు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరితేదీగా జనవరి 4ను డాట్ నిర్ణయించింది. కాగా, ఈ నెల 20న బిడ్డింగ్ ముందస్తు సమావేశాన్ని నిర్వహిస్తామని, దరఖాస్తు ఆహ్వాన నోటిఫికేషన్(ఎన్‌ఐఏ)లో పేర్కొన్న నిబంధనలపై వివరణలను కోరేందుకు 28 వరకూ గడువిస్తున్నట్లు పేర్కొంది.
వాస్తవానికి స్పెక్ట్రం కనీస ధర(బేస్ ప్రైస్)పై కేబినెట్ ఆమోదముద్ర పడిననాటినుంచి వేలం ప్రారంభానికి అంతక్రితం 60 రోజుల వ్యవధిని డాట్ ప్రతిపాదించింది. అదేవిధంగా ఎన్‌ఐఏ జారీకి 15 రోజుల గడువు కోరింది. ఇప్పుడు ఈ రెండింటినీ భారీగా కుదించడం గమనార్హం. కేబినెట్ ఆమోదం ప్రకారం 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో దేశవ్యాప్తంగా ప్రతి మెగాహెట్జ్‌కి కనీస ధర రూ. 1,765 కోట్లు ఉంటుంది. ఇది ఈ ఏడాది మార్చ్‌లో నిర్వహించిన వేలం ధరతో పోలిస్తే సుమారు 26 శాతం తక్కువ. నిర్దేశిత 5 మెగాహెట్జ్‌కి రిజర్వ్ ధర రూ.8,825 కోట్లు. ఇక 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం బేస్ ధర ఢిల్లీలో ఒక్కో మెగాహెట్జ్‌కి రూ.360 కోట్లు, ముంబైలో రూ.328 కోట్లు, కోల్‌కతాలో రూ.125 కోట్లుగా కేబినెట్ నిర్ణయించింది. ఇవి గత వేలం ధరతో పోలిస్తే 53 శాతం తక్కువ కావడం గమనార్హం. వేలంలో తొలిసారిగా స్పెక్ట్రం షేరింగ్, విలీనాలు, కొనుగోళ్లు, ట్రేడింగ్‌కు అవకాశమిస్తూ డాట్ నోటిఫికేషన్ వెలువడింది.
వచ్చేనెల 23 నుంచి 2జీ వేలం
Published Sat, Dec 14 2013 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement