జియోతో సై అంటోన్న ఎయిర్‌టెల్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ ‘ఎయిర్‌టెల్’ తన ప్రత్యర్థి ‘రిలయన్స్ జియో’కి పోటీనివ్వడానికి సన్నద్ధమౌతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018, మార్చి నాటికి) చివరి నాటికి వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవొల్యూషన్ (వీవోఎల్‌టీఈ) సర్వీసును దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. వీవోఎల్‌టీఈ సాయంతో 4జీ టెక్నాలజీతో ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ‘మేం 5–6 నగరాల్లో వీవోఎల్‌టీఈ ట్రయల్స్ నిర్వహించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు దేశవ్యాప్తంగా వీవోఎల్‌టీఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తాం’ అని భారతీ ఎయిర్‌టెల్ (ఇండియా, దక్షిణాసియా) ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. కాగా దేశంలో కేవలం రిలయన్స్ జియో మాత్రమే వీవోఎల్‌టీఈ టెక్నాలజీ సాయంతో 4జీ నెట్‌వర్క్‌లో వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. మిగిలిన టెల్కోలన్నీ వాటి 2జీ, 3జీ నెట్‌వర్క్స్ సాయంతోనే 4జీ కస్టమర్లకు వాయిస్ కాల్స్‌ను అందిస్తున్నాయి.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భారత్‌లో 3జీ నెట్‌వర్క్ చాలా వేగంగా అంతరిస్తుందని విట్టల్ అభిప్రాయపడ్డారు. జియో 4జీ ఫీచర్ ఫోన్ ఆవిష్కరణపై స్పందిస్తూ.. తాము ఆ దారిలో ప్రయాణించబోమని పేర్కొన్నారు. జియో ఫీచర్ ఫోన్ వల్ల 4జీ సర్వీసులకు కొత్త విభాగం ఏర్పాటవుతుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరంగా చూస్తే ఈ ఫీచర్ ఫోన్ ధర ఎక్కువగా ఉందన్నారు. ‘మాకు యూజర్ నుంచి వచ్చే సగటు రాబడి తగ్గింది. ఆదాయం క్షీణించింది. యూజర్ బేస్ పెంపు, ప్రత్యర్థి కంపెనీ లను ఎదుర్కోవడానికి పోటీ ధరల విధానాన్ని అవలంభిస్తున్నాం. దీన్నే కొనసాగిస్తాం’ అన్నారు.