VOLTE
-
ఆంధ్రప్రదేశ్లో జీపీఎస్ ట్రాకర్స్ తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీపీఎస్, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్... ఆంధ్రప్రదేశ్లో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మంగళగిరి సమీపంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ రూ.50 కోట్ల దాకా వెచ్చించనుంది. రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తామని, 2020 జూలై నాటికి తయారీ ప్రారంభమవుతుందని వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి చెప్పారు. సేల్స్ డైరెక్టర్ పి.ఆర్.రాజారామ్తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంటులో ఏఐఎస్ 140 ప్రమాణాలు గల జీపీఎస్ పరికరాలను రూపొందిస్తామని, ఈ కేంద్రం ద్వారా 400–500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. హైదరాబాద్ ప్లాంటు సామర్థ్యం రోజుకు 1,000 యూనిట్లని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పరికరాలకు భారీ డిమాండ్..: నవంబర్ 26 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ల వాడకం తప్పనిసరి చేశారు. 25,000 వాహనాల దాకా ఇసుక రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు కోణార్క్ తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏఐఎస్ 140 ధ్రువీకరణ పొందిన ఏకైక కంపెనీ మాదే. ఏపీలో ఉన్న డిమాండ్ కంపెనీకి కలిసొస్తుంది. భారత్తో పాటు పలు దేశాల్లో ఇప్పటికి 2 లక్షల పైగా పరికరాల్ని విక్రయించాం. ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ట్రాకర్ల వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించాలని లకి‡్ష్యంచాం. ఏప్రిల్–సెప్టెంబర్లో 70,000 యూనిట్లు విక్రయించాం. ఏపీ ప్లాంటు కోసం వచ్చే ఏడాది మే నాటికి రూ.35 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని కోణార్క్ వివరించారు. -
జనవరి నుంచి వొడాఫోన్ వీవోఎల్టీఈ సర్వీసులు!
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ ‘వొడాఫోన్ ఇండియా’ జనవరిలో వీవోఎల్టీఈ 4జీ సర్వీసులను ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ‘వాయిస్ ఓవర్ ఎల్టీఈ (వీవోఎల్టీఈ) సేవల ప్రారంభమనేది కీలకమైన చర్య. దీని ద్వారా డేటా నెట్వర్క్ బలోపేతమౌతుంది. కస్టమర్లు మెరుగైన సర్వీసులు పొందొచ్చు. హెచ్డీ క్వాలిటీ కాలింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది’ అని వొడాఫోన్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ సూద్ తెలిపారు. వీవోఎల్టీఈ సర్వీసులను తొలిసారిగా ముంబై, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, కోల్కతా ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారాయన. తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలియజేశారు. -
జియోతో సై అంటోన్న ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ ‘ఎయిర్టెల్’ తన ప్రత్యర్థి ‘రిలయన్స్ జియో’కి పోటీనివ్వడానికి సన్నద్ధమౌతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018, మార్చి నాటికి) చివరి నాటికి వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవొల్యూషన్ (వీవోఎల్టీఈ) సర్వీసును దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. వీవోఎల్టీఈ సాయంతో 4జీ టెక్నాలజీతో ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ‘మేం 5–6 నగరాల్లో వీవోఎల్టీఈ ట్రయల్స్ నిర్వహించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు దేశవ్యాప్తంగా వీవోఎల్టీఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తాం’ అని భారతీ ఎయిర్టెల్ (ఇండియా, దక్షిణాసియా) ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. కాగా దేశంలో కేవలం రిలయన్స్ జియో మాత్రమే వీవోఎల్టీఈ టెక్నాలజీ సాయంతో 4జీ నెట్వర్క్లో వాయిస్ కాల్స్ను ఆఫర్ చేస్తోంది. మిగిలిన టెల్కోలన్నీ వాటి 2జీ, 3జీ నెట్వర్క్స్ సాయంతోనే 4జీ కస్టమర్లకు వాయిస్ కాల్స్ను అందిస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భారత్లో 3జీ నెట్వర్క్ చాలా వేగంగా అంతరిస్తుందని విట్టల్ అభిప్రాయపడ్డారు. జియో 4జీ ఫీచర్ ఫోన్ ఆవిష్కరణపై స్పందిస్తూ.. తాము ఆ దారిలో ప్రయాణించబోమని పేర్కొన్నారు. జియో ఫీచర్ ఫోన్ వల్ల 4జీ సర్వీసులకు కొత్త విభాగం ఏర్పాటవుతుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరంగా చూస్తే ఈ ఫీచర్ ఫోన్ ధర ఎక్కువగా ఉందన్నారు. ‘మాకు యూజర్ నుంచి వచ్చే సగటు రాబడి తగ్గింది. ఆదాయం క్షీణించింది. యూజర్ బేస్ పెంపు, ప్రత్యర్థి కంపెనీ లను ఎదుర్కోవడానికి పోటీ ధరల విధానాన్ని అవలంభిస్తున్నాం. దీన్నే కొనసాగిస్తాం’ అన్నారు.