టెలికంలో కొలువుల జోరు! | jobs in telecom department | Sakshi
Sakshi News home page

టెలికంలో కొలువుల జోరు!

Published Wed, May 7 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

టెలికంలో కొలువుల జోరు!

టెలికంలో కొలువుల జోరు!

  •  వచ్చే 12 నెలల్లో 7 వేలకు పైగాకొత్త ఉద్యోగాలు...
  •  రిలయన్స్ జియోప్రారంభ సన్నాహాలు
  •  ఇతర టెల్కోల విస్తరణ ఎఫెక్ట్
  •  సీఓఏఐ తాజా అంచనా...
  • న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో ఈ ఏడాది నియామకాల జోరందుకోనున్నాయి. రానున్న 12 నెలల్లో 7 వేలకు పైచిలుకు కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో రానున్నాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) అంటోంది. ఆర్థిక మందగమనం, టెలికం పరిశ్రమలో అనిశ్చితి కారణంగా గత కొంతకాలంగా కంపెనీలు వ్యయ నియంత్రణ ఇతరత్రా పొదుపు చర్యలపై దృష్టిసారిస్తూ వస్తున్నాయి. దీంతో ఈ రంగంలో ఉద్యోగాల విషయంలో స్తబ్దత నెలకొంది. అయితే, ఇప్పుడు కొంత సానుకూల పరిస్థితులు నెలకొంటుండటంతో టెల్కోలు కొత్త కొలువులిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయని సీఓఏఐ పేర్కొంది. వచ్చే ఏడాది వ్యవధిలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 10 శాతం పెరగవచ్చని లెక్కలేస్తోంది. అయితే, సీఓఏఐ అంచనాలు మరీ ఇంత తక్కువస్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇప్పటికే 3,500 మంది ఉద్యోగులను నియమించుకోవడమే. ఈ ఏడాది 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న రిలయన్స్ జియో ఇందుకోసం సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. గత ఏజీఎంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ... వచ్చే ఏడాది కాలంలో తమ టెలికం వెంచర్ రిలయన్స్ జియోలో 10 వేలకు పైగా కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించారు. ఇదే సాకారమైతే... సీఓఏఐ అంచనాలు ఒక్క రిలయన్స్ జియోతోనే పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీనికిమించి కొత్త కొలువులు లభిస్తాయని భావిస్తున్నారు.
     
     గడ్డుకాలం తొలగినట్టే...
     భారీ రుణభారం, నియంత్రణ పరమైన ఒత్తిళ్లతో 2013-14లో దేశంలోని 9 టెలికం ఆపరేటర్లు కూడా కొత్త ఉద్యోగాల విషయంలో ఆచితూచి అడుగేశాయి. 2013 మార్చి నాటికి ఈ మొత్తం టెల్కోల్లో సిబ్బంది సంఖ్య దాదాపు 70 వేల మందికాగా.. 2014 మార్చి నాటికి ఇందులో సుమారు 3,500 కోత పడింది. అంటే 5 శాతం సిబ్బంది తగ్గినట్లు లెక్క. అయితే, టెల్కోలు, టెలికం పరికరాల సరఫరా సంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థలు, హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీలు, రిటైలర్లు ఇలా మొత్తం టెలికం పరిశ్రమలో గతేడాది 20 వేలకు పైగానే ఉద్యోగాల కోత పడినట్లు సీఓఏఐ చెబుతోంది. టెలికం పరిశ్రమల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న 20 లక్షల మందిలో ఇది 2 శాతం. అయితే, ఇక ఈ రంగానికి గడ్డుకాలం ముగిసినట్లేనని నిపుణులు అంటున్నారు. పోత్సాహక ఆఫర్లకు కోత విధించడం, ఇతరత్రా చర్యల ద్వారా తమ ఆదాయాలను పెంచుకోవడంతోపాటు టారిఫ్‌ల పెంపునకూ సిద్ధమవుతుండటంతో మార్జిన్లు పెరగనున్నాయని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా 2జీ వేలం కూడా ముగియడంతో విస్తరణబాట పట్టనున్నాయి. డేటా సేవల మార్కెట్ కూడా పుంజుకుంటోంది. దీంతో కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు పడుతున్నాయని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ మాథ్యూస్ అన్నారు.
     
    ఇతర కంపెనీల విషయానికొస్తే...

    వొడాఫోన్ కూడా దేశంలో తమ విస్తరణ ప్రణాళికలకు మరింత పదునుపెడుతోంది. కొత్తగా 3 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.18,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 1,800 కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నామని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఇక దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్, యూనినార్ సైతం తాజాగా నియామకాల బాటపట్టనున్నాయి. టెలికం మౌలిక సదుపాయాల(టవర్లు, వెండార్లు) ప్రొవైడర్లు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను 5-6 శాతం మేర పెంచుకోనున్నాయని  మాథ్యూస్ పేర్కొన్నారు.
     
    నిపుణులు ఏమంటున్నారు...

    హెచ్‌ఆర్ విశ్లేషకులు, నిపుణులు మాత్రం టెలికం పరిశ్రమపై చాలా ఆశావహంగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో 15-20 శాతం అధిక కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ గ్లోబల్ హంట్‌కు చెందిన ఎండీ సునీల్ గోయెల్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఈ రంగంలో కొత్త కొలువులేవీ పెద్దగా జతకాలేదు. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొత్త కొలువులు అధికంగా రానున్నాయని.. కంపెనీలకు వ్యయభారం తక్కువగా ఉండటమే దీనికి కారణమి గెయెల్ చెప్పారు. తమ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 14,000 కొత్త ఉద్యోగాలు టెలికం రంగంలో రావచ్చని ఆయన పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement