న్యూఢిల్లీ: టెలికం రంగంలో మాదిరే న్యూ ఎనర్జీలోనూ (హైడ్రోజన్ తదితర కొత్త తరహా పర్యావరణానుకూల ఇంధనాలు) రిలయన్స్ ఇండస్ట్రీస్ బలమైన స్థానం దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు 5–7 ఏళ్ల కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని అన్ని వ్యాపారాలను మించి వృద్ధిని సాధించే విభాగంగా ఇది అవతరించనుందని చైర్మన్ ముకేశ్ అంబానీ అంచనా వేస్తున్నారు. కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ వృద్ధి ప్రణాళికలను పంచుకున్నారు.
న్యూఎనర్జీపై రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆసక్తి చూపిస్తుండడం తెలిసిందే. ‘‘వచ్చే 12 నెలల్లో పర్యావరణానుకూల ఇంధన రంగం (గ్రీన్ ఎనర్జీ) వ్యాల్యూచైన్‌లో కంపెనీ పెట్టుబడులు మొదలవుతాయి. తదుపరి కొన్నేళ్లలో వాటిని పెంచుతాం. వచ్చే 5–7 ఏళ్లలో ఈ నూతన వృద్ధి ఇంజన్ ప్రస్తుతమున్న అన్ని ఇంజన్లను మించి వృద్ధి చూపించనుంది’’అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
నాలుగు గిగా ఫ్యాక్టరీల పేరుతో మొత్తం గ్రీన్ ఎనర్జీలోని అన్ని విభాగాల్లోనూ చొచ్చుకుపోయే ప్రణాళికలలో రిలయన్స్ ఉంది. తద్వారా అందుబాటు ధరలకే ఇంధనాలను తీసుకురావాలని, భారత్‌ను గ్రీన్ ఎనర్జీ తయారీలో ప్రముఖ దేశంగా మార్చే లక్ష్యంతో ఉంది. సోలార్ విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం ఇలా అన్ని విభాగాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సంప్రదాయ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కంపెనీగా ఉన్న రిలయన్స్‌ను.. రిటైల్, టెలికం వ్యాపారాలతో న్యూఏజ్ కంపెనీగా అంబానీ మార్చడం తెలిసిందే. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీని ఆయన తదుపరి వ్యాపార అస్త్రంగా ఎంచుకున్నారు.
అందుబాటు ధరలకే
‘‘ప్రపంచంలో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ ధరలు భారత్‌లోనే తక్కువ. ఈ దశాబ్దంలోనే ప్రపంచంలోనే అత్యంత చౌక గ్రీన్ ఎనర్జీ దేశంగా అవతరిస్తాం. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపులో సాయంగా నిలుస్తాం’’అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నాలుగు గిగా ఫ్యాక్టరీలను ప్రకటించడమే కాకుండా, రూ.5,500 కోట్లతో పలు కంపెనీలను కొనుగోలు చేసింది.
5జీ సేవలకు రెడీ: రిలయన్స్ జియో అతి త్వరలోనే 1,000 పట్టణాల్లో 5జీ సేవలు ఆరంభించనుంది. ఈ పట్టణాల్లో 5జీ ప్రణాళికలను పూర్తి చేసినట్టు, క్షేత్రస్థాయిలో రిలయన్స్ సొంత టెలికం పరికరాలతో పరీక్షించినట్టు అంబానీ ప్రకటించా రు. ఇటీవలే ముగిసిన 5జీ వేలంలో రూ.88 వేల కోట్లతో స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడం తెలిసిందే.
రెండో ఏడాది జీతం నిల్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీగా ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాది ఎటువంటి వేతనం తీసుకోలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన 2020–21 సంవత్సరానికి వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే, గడిచిన ఆర్థిక సంవత్సరానికీ (2021–22) కూడా అదే విధానాన్ని కొనసాగించినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. ఇక 2019–20 సంవత్సరానికి అంబానీ రూ.15 కోట్ల వేతనం తీసుకున్నారు. అంతేకాదు 2008–09 నుంచి ఆయన అదే స్థాయిలో
వేతనాన్ని తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment