ముకేశ్‌ అంబానీ రిటైల్‌ జోరు.. | Mukesh Ambani may use his 5100 Jio Point stores to kick off a retail bussiness | Sakshi
Sakshi News home page

ముకేశ్‌ అంబానీ రిటైల్‌ జోరు..

Published Fri, Dec 14 2018 4:14 AM | Last Updated on Fri, Dec 14 2018 4:14 AM

Mukesh Ambani may use his 5100 Jio Point stores to kick off a retail bussiness - Sakshi

(సాక్షి, బిజినెస్‌ విభాగం)
జ్యుయలరీ నుంచి మొదలుపెడితే దుస్తులు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, పాదరక్షలు, నిత్యావసర సరుకులు... ఇలా అన్నింటికీ వేరువేరు ఆఫ్‌లైన్‌ స్టోర్లు నిర్వహిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌... ఈ బలాన్ని ఆన్‌లైన్‌కు ఉపయోగించుకోవటానికి స న్నాహాలు చేస్తోంది. వీటన్నిటినీ ఆన్‌లైన్‌లోకి తేవటానికి తన మరో ప్రధాన ఆయుధమైన రిలయన్స్‌ జియోను ఎంచుకుంటోంది. ఇంటింటికీ జియో ద్వారా ఇంటర్నెట్‌ అందిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌... దాని ద్వారానే ఆన్‌లైన్‌ వ్యాపారం వృద్ధి చెం దుతుందని భావిస్తోంది.

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ–కామర్స్‌ అనుభవాన్ని అం దించేందుకు తనకు మూలమూలనా ఉన్న జియో పాయింట్‌ స్టోర్స్‌ను వినియోగించుకోనుంది. చౌక చార్జీలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముకేశ్‌ అంబానీ తాజాగా రిటైల్‌ రంగంలోనూ అదే తరహాలో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలో ప్రారంభించే రిలయన్స్‌ రిటైల్‌ ఈ–కామర్స్‌ వెంచర్‌ కోసం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న జియో పాయింట్‌ స్టోర్స్‌ను ఉపయోగించుకోబోతున్నారు.

ప్రస్తుతం 5,000 పైచిలుకు నగరాల్లో 5,100 పైగా చిన్న స్థాయి జియో పాయింట్‌ స్టోర్స్‌ ఉన్నాయి.  ప్రణాళికల ప్రకారం ఇంటర్నెట్‌ అంతగా అందుబాటులో లేని ప్రాంతాల వారికి, ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయని వారికి చేరువయ్యేందుకు వీటిలో ఈ–కామర్స్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్లిచ్చేందుకు వీటిలో ఉండే స్టోర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ సహాయం అందిస్తారు. పప్పులు, పంచదార, సబ్బులు వంటి నిత్యావసరాలు మొదలుకుని సౌందర్య సంరక్షణం, దుస్తులు, పాదరక్షల దాకా అన్నింటినీ వీటి ద్వారా ఆర్డరివ్వొచ్చు.

రిలయన్స్‌ రిటైల్‌ ఈ ఆర్డర్లను ప్రాసెస్‌ చేస్తుంది. ఇప్పటికే ఈ స్టోర్స్‌కు సిమ్‌కార్డులు, మొబైల్‌ హ్యాండ్‌సెట్స్, యాక్సెసరీస్‌ మొదలైనవి సరఫరా చేస్తున్న జియో పంపిణీ వ్యవస్థ... ఇకపై ఈ–కామర్స్‌ ఆర్డర్స్‌ను కొనుగోలుదారుల ఇంటి వద్దకే చేరుస్తుంది. ‘ఇన్‌స్టాలేషన్‌ అవసరం లేని, షెల్ఫ్‌ లైఫ్‌ ఉండే చాలా మటుకు ఉత్పత్తులను ఈ నెట్‌వర్క్‌ ద్వారా విక్రయించేందుకు అవకాశం ఉంది.  కస్టమర్‌ ఆయా ఉత్పత్తులను జియో పాయింట్‌ వద్దే తీసుకోవచ్చు కూడా. కావాలనుకుంటే స్టోర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వాటిని ఇంటికి కూడా డెలివరీ చేస్తారు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్‌ రిటైల్‌ ఇప్పటికే జియో పాయింట్‌ స్టోర్స్‌ నుంచి టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లకు సంబంధించి ఈ తరహా ఆర్డర్లు తీసుకుంటోంది. మొత్తం కన్సూ్యమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అమ్మకాల్లో వీటి వాటా 10 శాతం దాకా ఉంటోంది. ఇప్పుడు ఇదే విధానాన్ని నిత్యావసరాలు మొదలైన వాటికి కూడా వర్తింపచేయాలని భావిస్తోంది.

ఏప్రిల్‌ నుంచి ఈ–కామర్స్‌ వెంచర్‌..  
కంపెనీ వర్గాల కథనం ప్రకారం.. రిలయన్స్‌ రిటైల్‌ ఈ–కామర్స్‌ వెంచర్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 95% జనాభాకు చేరువవ్వాలని రిలయన్స్‌ రిటైల్‌ లకి‡్ష్యస్తోంది. ఈ–కామర్స్, జియో పాయింట్‌ స్టోర్స్‌ ద్వారానే ఇది సాధ్యం అవుతుందని కూడా భావిస్తోంది. దాదాపు 10,000 పైగా జనాభా ఉన్న పట్టణాల్లో రిటైల్‌ పాయింట్స్‌ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పెద్ద నగరాలు, చిన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 50,000 పైచిలుకు జియో పాయింట్‌ స్టోర్స్‌ను కొత్తగా ప్రారంభించాలని రిలయన్స్‌ భావిస్తోంది. కస్టమర్‌ సేల్స్, సర్వీస్‌ టచ్‌ పాయింట్స్‌గానే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉత్పత్తుల పంపిణీకి కూడా వీటిని ఉపయోగించుకోనుంది. ఈ ప్రణాళికల్లో భాగంగా ప్రతి మూడునెలల్లో కొత్తగా 500 జియో పాయింట్స్‌ను ప్రారంభిస్తోంది.

అన్ని ఫార్మాట్లలోనూ దిగ్గజాలతో పోటీ!
ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు దీటుగా రిలయన్స్‌ రిటైల్‌ ఈ–కామర్స్‌ వెంచర్‌ ఉండబోతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థలు కూడా గ్రామీణ ప్రాంతాల వారికి చేరువయ్యేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు అమెజాన్‌ ప్రత్యేకంగా ప్రాజెక్ట్‌ ఉడాన్‌ విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద చిన్న పట్టణాల్లో 12,000 పైచిలుకు చిన్న రిటైల్‌ సంస్థలు, స్థానిక ఎంట్రప్రెన్యూర్స్‌తో చేతులు కలిపింది. ఈ షాపుల ద్వారా ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో ఆర్డర్లు పెట్టొచ్చు. ఉత్పత్తుల డెలివరీ తీసుకోవచ్చు. దీంతో పాటు దిగ్గజ సంస్థలకు దీటుగా వీడియో, మ్యూజిక్, మ్యాగజైన్స్, న్యూస్‌ వంటి రంగాల్లోనూ రిలయన్స్‌ భారీగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.

12 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌..
కన్సల్టెన్సీ సంస్థ ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌ అంచనాల ప్రకారం భారత ఈ–కామర్స్‌ విభాగంలో గ్రామీణ ప్రాంత మార్కెట్‌ వచ్చే నాలుగేళ్లలో 10–12 బిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. 2017 నుంచి 2021 మధ్య కాలంలో దేశీయంగా ఈ–కామర్స్‌ విక్రయాలు 32 శాతం మేర వార్షిక వృద్ధి నమోదు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోను పెరుగుతున్న ఆదాయాలు, వినియోగం, వ్యవసాయేతర ఆదాయ మార్గాలు, సానుకూల వ్యవసాయ పరిస్థితులు, ఇంటర్నెట్‌ వినియోగం మెరుగుపడుతుండటం, చిన్న కుటుంబాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement