దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన కంపెనీల నుంచి ఎలాంటి జీతం తీసుకోలేదు. కరోనా మహమ్మారి సమయం నుంచి ఆయన వేతనం తీసుకోవడం ఆపేశారు. ఆయనేకాదు తన బోర్డులోకి వచ్చిన తన వారసులు కూడా వేతనాలు తీసుకోకపోవడం గమనార్హం.
కరోనాకి ముందు వేతనం అందుకున్న ముఖేష్ అంబానీ.. ఉన్నత నిర్వాహక స్థానాల్లో ఉన్నవారు వేతనాల విషయంలో ఆదర్శంగా ఉండాలని, అందుకు తానే వ్యక్తిగత ఉదాహరణగా నిలిచేందుకు 2009 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకు తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. 2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా వ్యాపారాలు ప్రభావితమైనప్పుడు అంబానీ తన జీతాన్ని పూర్తీగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2024 ఆర్థికేడాదిలో ముఖేష్ అంబానీ జీతం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అలవెన్సులు, పెర్క్విసిట్‌లతో పాటు రిటైరల్ ప్రయోజనాలను కూడా పొందలేదు. 1977 నుంచి రిలయన్స్ బోర్డులో ఉన్న ముఖేష్ అంబానీ, 2002 జూలైలో తన తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత కంపెనీ ఛైర్మన్ అయ్యారు.
ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్‌లు గత ఏడాది అక్టోబర్‌లో ఎటువంటి జీతం లేకుండా బోర్డులో నియమితులయ్యారు. కానీ ఒక్కొక్కరు సిట్టింగ్ ఫీజుగా రూ.4 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు పొందారు. బోర్డులో 2023 ఆగస్టు 28 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సిట్టింగ్ ఫీజు రూపంలో రూ.2 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు అందుకున్నారు.
ముఖేష్ అంబానీ కంపెనీ నుంచి ఎలాంటి వేతనం తీసుకోనప్పటికీ వ్యాపార పర్యటనల సమయంలో అయ్యే ఖర్చులన్నిటినీ కంపెనీ నుంచి చెల్లిస్తారు. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి కూడా కంపెనీనే ఖర్చులు భరిస్తుంది. 109 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment