
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి కేంద్రం షాకిచ్చింది. ఓఎన్‌జీసీకి చెందిన క్షేత్రం నుంచి గ్యాస్ అక్రమంగా ఉత్పత్తి చేసినందుకు, గడువులోగా బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటు చేయనందుకు గాను రెండు డిమాండ్ నోటీసులు ఇచ్చింది. మొదటి దానికి సంబంధించి రూ.24,500 కోట్ల నష్టపరిహారం కట్టాలని ఆదేశించింది. ఇక రెండో అంశానికి సంబంధించి సుమారు 3.1 కోట్ల పెనాల్టీ విధించింది.
కృష్ణా గోదావరి బేసిన్‌లో రిలయన్స్–బీపీ, ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ గ్యాస్ క్షేత్రాలు పక్కపక్కనే ఉన్నాయి. ఓఎన్‌జీసీ క్షేత్రం నుంచి తమ క్షేత్రంలోకి వచ్చిన గ్యాస్‌ను రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెలికితీసి, విక్రయించుకుని, లబ్ధి పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రిలయన్స్, బీపీ నష్టపరిహారం కట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. కానీ, ఈ వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో కంపెనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 14న వాటిని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తమతో పాటు నికో (గతంలో భాగస్వామి)కి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ డిమాండ్ నోటీసులు పంపినట్లు ఎక్ఛ్సేంజీలకు రిలయన్స్ తెలిపింది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్‌లిమిటెడ్
మరోవైపు, 10 గిగావాట్ హవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి తొలి మైలురాయి పనులను పూర్తి చేయడంలో జాప్యానికిగాను అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ లిమిటెడ్‌కి భారీ పరిశ్రమల శాఖ పెనాల్టీ విధించినట్లు రిలయన్స్ తెలిపింది. ఈ గడువును పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని ఆర్‌ఎన్‌ఈబీఎస్‌ఎల్ కోరినట్లు వివరించింది. జనవరి 1 నుంచి మార్చి 3 వరకు లెక్కేస్తే జరిమానా రూ. 3.1 కోట్లు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment