న్యూఢిల్లీ: దేశీయంగా మీడియాలో అత్యధికంగా కనిపించే (విజిబిలిటీ) కార్పొరేట్ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిల్చింది. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వార్తల్లో కార్పొరేట్ల విజిబిలిటీని విశ్లేషించే విజికీ న్యూస్ స్కోర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం 2023కి గాను రిలయన్స్ 96.46 స్కోరుతో నంబర్ వన్ స్థానంలో ఉంది. గతేడాది ఇది 92.56గా, 2021లో 84.9గా నమోదైంది. నివేదికలోని మిగతా సంస్థల స్కోరుకు, రిలయన్స్ స్కోరుకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఎస్‌బీఐకి 85.81, హెచ్‌డీఎఫ్‌సీకి 84.06, ఐసీఐసీఐ బ్యాంక్‌కి 81.9, భారతి ఎయిర్‌టెల్‌కు 80.64 స్కోరు లభించింది. 4,00,000 పైచిలుకు ప్రచురణ సంస్థల్లో వార్తలు, హెడ్‌లైన్స్, సదరు పబ్లికేషన్ విస్తృతి, రీడర్‌షిప్ మొదలైన వాటి ఆధారంగా ఈ స్కోరు ఇచ్చారు.
ఇందుకోసం కృత్రిమ మేథ, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, మీడియా ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించారు. విజికీ పరిశోధన ప్రకారం పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్)పరంగా కూడా రిలయన్స్ పటిష్టంగా ఉంది. నాలుగేళ్ల క్రితం విజికీ న్యూస్ స్కోర్ ప్రారంభమైనప్పటి నుంచి రిలయన్సే అగ్రస్థానంలో ఉంటోంది. కంపెనీ స్కోరు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment