ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్.. ‘జియో’
రూ.1.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశాం
2017 నాటికి 90% పైగా కవరేజ్
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ
ముంబై: వినియోగదారులకు దాదాపు 80 రెట్ల అధిక వేగంతో ఇంటర్నెట్‌ను అందించడమే లక్ష్యంగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన రిలయన్స్ జియో.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అభివర్ణించారు. ప్రపంచంలోని ఏ ఇతర డిజిటల్ స్టార్టప్‌లలో కూడా ఇంత మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్స్ లేవని తెలిపారు. 2017 నాటికి దేశంలో 90%పైగా హై-స్పీడ్ ఇంటర్నెట్ కవరేజ్‌ను విస్తరించడమే జియో లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ 2016 కార్యక్రమంలో మాట్లాడారు. జియో సేవలు తొలి రోజు నుంచే 70% కవరేజ్‌తో ప్రారంభమౌతాయని తెలిపారు. సర్వీసులు అందుబాటు ధరల్లో ఉంటాయని పేర్కొన్నారు. సేవల నాణ్యత విషయంతో రాజీపడేది లేదన్నారు. ప్రస్తుత ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే 40-80 రెట్లు అధిక వేగంతో సేవలను అందిస్తామని చెప్పారు. అయితే ఆయన జియో పూర్తి వాణిజ్య స్థాయి కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభమౌతాయో ప్రకటించలేదు.
టాప్-10లోకి వెళ్తాం: జియో వల్ల మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడుతుందని ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 150వ స్థానంలో ఉన్న మనం రానున్న కాలంలో టాప్-10లోకి వెళ్తామని ధీమా వ్యక్తంచేశారు. ప్రపంచం కొత్త యుగం(డిజిటల్)లోకి అడుగుపెడుతుంటే భారత్‌ను వెనుకంజలో ఉంచబోమని చెప్పారు. దేశ ప్రజల జీవన విధానాల్లో మార్పు తీసుకురావడం కోసమే టెలికంలోకి మళ్లీ అడుగు పెడుతున్నామని తెలిపారు.
100 బిలియన్ డాలర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ!
దేశీ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ వృద్ధి బాటలో పయనిస్తోందని ముకేశ్ అంబానీ తెలిపారు. 2004లో 2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ పరిశ్రమ 2015 నాటికి 18 బిలియన్ డాలర్లకి పెరిగిందని పేర్కొన్నారు. వచ్చే శతాబ్ద కాలంలో ఇది 100 బిలియన్ డాలర్లకి చే రుకోవచ్చని అంచనా వేశారు. ‘ప్రస్తుత శతాబ్దాన్ని డిజిటైజేషన్ నిర్వచిస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోటీపడగలిగే డిజిటల్ అస్త్రాన్ని కలిగి ఉండకపోతే.. మనం మనుగడ సాగించలేం. ఒంటరిగా, వెనుక ంజలో ఉంటాం’ అని ముకేశ్ చెప్పారు.