fourth quarter results
-
స్పీడ్ తగ్గిన హెచ్‌యూఎల్
న్యూఢిల్లీ: నాలుగో త్రైమాసికంలో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం స్వల్పంగా తగ్గి (1.53%) రూ. 2,561 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఆదాయం రూ. 15,375 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ. 15,441 కోట్ల కు పెరిగింది. వ్యయా లు రూ. 11,962 కోట్ల నుంచి రూ. 12,100 కోట్లకు చేరా యి.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ. 61,092 కోట్ల నుంచి రూ. 62,707 కోట్లకు చేరింది. లాభం రూ. 10,143 కోట్లుగా నమోదైంది. బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డు.. రూ.1 ముఖ విలువ చేసే షేరు ఒక్కింటికి రూ. 24 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. తాత్కాలిక డివిడెండ్ రూ. 18 కూడా కలిపితే పూర్తి సంవత్సరానికి మొత్తం మీద ఒక్కో షేరుకి రూ. 42 డివిడెండ్ ఇచి్చనట్లవుతుందని సంస్థ తెలిపింది. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 2,259.15 వద్ద క్లోజయ్యింది. -
యాక్సిస్ లాభం రూ. 7,129 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 7,129 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2022–23 క్యూ4లో బ్యాంకు రూ. 5,728 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ఇక తాజాగా ఆదాయం రూ. 28,758 కోట్ల నుంచి రూ. 35,990 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 11 శాతం పెరిగి రూ. 13,089 కోట్లుగా నమోదైంది.మరోవైపు, 2023–24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు నికర లాభం 160 శాతం పెరిగి రూ. 24,861 కోట్లకు చేరింది. వ్యాపార పరిమాణం 12% వృద్ధి చెంది రూ. 14,77,209 కోట్లకు ఎగిసింది. గత ఆర్థిక సంవత్సరానికి రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 1 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని బ్యాంకు బోర్డు నిర్ణయించింది. సిటీ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలను అనుసంధానం చేసే ప్రక్రియ వచ్చే ఆరు నెలల్లో పూర్తి కావచ్చని బ్యాంకు సీఈవో అమితాబ్ చౌదరి తెలిపారు. భారత్‌లో సిటీబ్యాంక్ కన్జూమర్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం బ్యాంకు షేరు బీఎస్ఈలో 0.69% పెరిగి రూ. 1,063.70 వద్ద క్లోజయ్యింది.మరిన్ని విశేషాలు..► స్థూల మొండి బాకీలు 2.02% నుంచి 1.43 శాతానికి తగ్గాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరంలో 475, నాలుగో క్వార్టర్లో 125 శాఖలను తెరవడంతో దేశీ యంగా మొత్తం బ్రాంచీల నెట్వర్క్ 5,377కి చేరింది.► మార్చి క్వార్టర్లో 12.4 లక్షల క్రెడిట్ కార్డులను కొత్తగా జారీ చేయడం ద్వారా గత తొమ్మిది క్వార్టర్లలో దేశీయంగా అత్యధిక సంఖ్యలో క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంకుల్లో ఒకటిగా బ్యాంక్ నిలి్చంది. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై– సెపె్టంబర్(క్యూ2)లో రూ. 3,783 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 1,004 కోట్ల నికర నష్టం ప్రకటించింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) పనితీరు లాభాలకు దోహదపడింది. వెరసి వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. ఆదాయం రూ. 79,611 కోట్ల నుంచి రూ. 1,05,128 కోట్లకు దూసుకెళ్లింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన సైతం రూ. 1,270 కోట్ల నికర లాభం సాధించగా.. గతేడాది క్యూ2 లో రూ. 293 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇకపై మరింత దూకుడు: తాజా సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 30 శాతం జంప్ చేసి 6.9 బిలియన్ పౌండ్లకు చేరింది. హోల్‌సేల్ అమ్మకాలు, కొత్త ప్రొడక్టులు, వ్యయ నియంత్రణలు, డిమాండుకు అనుగుణమైన పెట్టుబడులు ఇందుకు సహకరించాయి. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో హోల్‌సేల్ అమ్మకాలు క్రమంగా జోరందుకోనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. నిర్వహణ(ఇబిట్) మార్జిన్లు గత 6 శాతం అంచనాలకంటే అధికంగా 8 శాతాన్ని తాకవచ్చని భావిస్తోంది. ఈ ఏడాది 2 బిలియన్ పౌండ్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను సాధించగలదని ఆశిస్తోంది. వెరసి మార్చికల్లా నికర రుణ భారం బిలియన్ పౌండ్లకంటే దిగువకు చేరవచ్చని అభిప్రాయపడింది. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు 1.5% బలపడి రూ. 637 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 959 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 959 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన లాభం రూ. 87.5 కోట్లతో పోలిస్తే ఇది 996 శాతం అధికం. లో బేస్ ప్రభావం ఇందుకు కారణం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 25 శాతం పెరిగి రూ. 5,437 కోట్ల నుంచి రూ. 6,297 కోట్లకు చేరింది. ఆదాయాలు, లాభాల వృద్ధిపరంగా ఇది తమకు రికార్డు సంవత్సరమని కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా,యూరప్, భారత మార్కెట్లు పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడిందని బుధవారం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంపెనీ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అన్ని వ్యాపార విభాగాలు పుంజుకోవడం తదితర అంశాలు ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 5,000 కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చెప్పారు. తాజా ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఉత్పత్తులు, ఉత్పాదకతను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ బోర్డు షేరు ఒక్కింటికి రూ. 40 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు .. ► గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు క్యూ4లో 18 శాతం పెరిగి రూ. 5,426 కోట్లకు చేరాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 2,532 కోట్లుగా నమోదైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో నాలుగో త్రైమాసికంలో ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 25 ఔషధాలను ఆవిష్కరించింది. ► భారత్‌లో అమ్మకాలు 32 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలతో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు ఆదాయం సమకూరింది. ► యూరప్ మార్కెట్ ఆదాయాలు 12% పెరిగి రూ. 496 కోట్లకు, వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 7% క్షీణించి రూ. 1,114 కోట్లుగా నమోదైంది. ► ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం మూడు శాతం పెరిగి రూ. 756 కోట్ల నుంచి రూ. 778 కోట్లకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 21,439 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.24,588 కోట్లకు చేరింది. లాభం రూ. 2,357 కోట్ల నుంచి 91% ఎగిసి రూ.4,507 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కార్య కలాపాలపై రూ.1,940 కోట్లు వెచ్చించింది. ఈసారి మొత్తం అమ్మకాల్లో 8–9% వెచ్చించనుంది. -
ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్...! హైదరాబాద్ జోరు మాత్రం తగ్గేదేలే..!
సాక్షి, హైదరాబాద్: కొత్త గృహాల ప్రారంభంలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. 2021 నాల్గో త్రైమాసికం (అక్టోబర్ – డిసెంబర్)లో లాంచింగ్స్ లో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని జేఎల్ఎల్ రెసిడెన్షియల్ మార్కెట్ రిపోర్ట్ వెల్లడించింది. అంతకుక్రితం త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో లాంచింగ్స్‌లో 26.1 శాతం వృద్ధి నమోదు కాగా.. పుణేలో 17.6 శాతం, బెంగళూరులో 16.4 శాతం, ముంబైలో 16.1% పెరుగుదల కనిపించిందని వివరించింది. నగరంలో గృహాల అమ్మకాలు కరోనా ముందస్తు స్థాయికి చేరుకున్నాయి. 2019లో 15,805 ఇళ్లు విక్రయం కాగా 2020లో 9,926, 2021లో 15,787 యూనిట్లు అమ్ముడుపోయాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ పెరగడం, రియల్టీ మార్కెట్ సెం టిమెంట్ బలపడటం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడు తుండటంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారం భం వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలోని ఏడు ప్రధా న నగరాలలో 2021 నాల్గో త్రైమాసికంలో 45,383 అపార్ట్మెంట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ3తో పో లిస్తే ఇది 38% ఎక్కువ. ఇందులో 19 % యూనిట్లు పుణేలో ప్రారంభం కాగా.. బెంగళూరు, హైదరాబాద్ ఒక్కోటి 17% వాటాను కలిగి ఉన్నాయి. -
తాజ్‌జీవీకే హోటల్స్‌కు నష్టం
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న తాజ్‌జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.4.5 కోట్ల నష్టం మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.5.15 కోట్ల నికరలాభం పొందింది. టర్నోవర్ రూ.76 కోట్ల నుంచి రూ.46 కోట్లకు వచ్చి చేరింది. 2020–21లో రూ.97 కోట్ల టర్నోవర్‌పై రూ.39 కోట్ల నష్టం వాటిల్లింది. -
Yes Bank: యస్ బ్యాంక్ నష్టం 3,790 కోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఏకంగా రూ. 3,790 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. ఆదాయం క్షీణించడం, మొండిబాకీలకు ప్రొవిజనింగ్ భారీగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో లాభం రూ. 2,665 కోట్లు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను యస్ బ్యాంక్ నికర నష్టాలు రూ. 16,432 కోట్ల నుంచి రూ. 3,488 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పునర్వ్యవస్థీకరించే అవకాశమున్న రుణాల కోసం కూడా ముందుగా ప్రొవిజనింగ్ చేసినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో మొండిబాకీలకు ప్రొవిజనింగ్ రూ. 5,239 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 4,872 కోట్లుగా ఉంది. మరో రూ.5,000 కోట్ల రికవరీ లక్ష్యం..: అసెట్ క్వాలిటీపరమైన సమస్యలు ఇక ముగిసినట్లేనని, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కనీసం రూ. 5,000 కోట్లు రికవరీ చేయాలని నిర్దేశించుకున్నట్లు కుమార్ వివరించారు. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోను 15% పెంచుకోవాలని, రిటైల్ రుణాలను 20% పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం యస్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో రిటైల్, చిన్న రుణాల వాటా 51% దాకా ఉంది. క్రమంగా మళ్లీ కార్పొరేట్ రుణాలను ఇవ్వనున్నట్లు, ఈ విభాగంలో 10% వృద్ధి అంచనా వేస్తున్నట్లు కుమార్ తెలిపారు. మార్చి క్వార్టర్లో రూ. 3,500 కోట్ల కొత్త రుణాలిచ్చినట్లు పేర్కొన్నారు. అటు స్థూల నిరర్థక ఆస్తుల పరిమాణం 16.80% నుంచి 15.41%కి తగ్గాయి. జూన్ క్వార్టర్లో రూ. 2,500 కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నట్లు.. వీటిలో సింహభాగం కార్పొరేట్ విభాగానివే ఉండొచ్చని కుమార్ తెలిపారు. -
ఐఓసీ నష్టాలు రూ. 5,185 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీకి గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.6,099 కోట్ల నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.5,185 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఐఓసీ తెలిపింది. మార్చి క్వార్టర్లో చమురు ధరలు బాగా పతనం కావడంతో భారీగా ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. దీనికి రిఫైనరీ మార్జిన్లు తగ్గడం కూడా తోడవడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని వివరించారు. మరిన్ని వివరాలు..... ► 2018–19 క్యూ4లో రూ.1,787 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, గతేడాది క్యూ4లో రూ.14,692 కోట్ల మేర ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. ► క్యూ4లో స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎమ్) మైనస్ 9.64 డాలర్లకు పడిపోయింది. ► లాక్డౌన్ కారణంగా 70 శాతం మేర ఇంధన డిమాండ్ తగ్గింది. జూలై మొదటి వారం కల్లా ఈ తగ్గిన 70 శాతం డిమాండ్‌లో 90 శాతం పుంజుకునే అవకాశాలున్నాయి. ► 2018–19లో రూ.16,894 కోట్లుగా ఉన్న నికర లాభం 2019–20లో రూ.1,313 కోట్లకు తగ్గింది. ► 2018–19లో రూ.3,227 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.12,531 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్ 3% నష్టంతో రూ.87 వద్ద ముగిసింది. -
బీపీసీఎల్ నష్టం రూ.1,361 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలు వచ్చాయి. రిఫైనింగ్ మార్జిన్లు బలహీనంగా ఉండటం, ఇన్వెంటరీ నష్టాలు భారీగా ఉండటం, లాక్డౌన్ కారణంగా అమ్మకాలు తగ్గడం...ఈ కారణాల వల్ల గత క్యూ4లో ఈ కంపెనీకి రూ.1,361 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ రూ.1,261 కోట్ల నికర లాభం సాధించింది. కాగా, ఆదాయం 8 శాతం తగ్గి రూ.68,991 కోట్లకు చేరిందని బీపీసీఎల్ వెల్లడించింది. n అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,703 కోట్ల నిర్వహణ లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.619 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి. n గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రూ.1,081 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. n చమురు ఉత్పత్తి సీక్వెన్షియల్‌గా 0.23 శాతం తగ్గి 8.39 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ 2 శాతం లాభంతో రూ.357 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ లాభం 4,342 కోట్లు 10 శాతం డౌన్
న్యూఢిల్లీ: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.4,811 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.4,342 కోట్లకు తగ్గింది. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.21 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ వైస్ చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ తెలిపారు. కరోనా కోసం కేటాయింపులు, ఇంకా ఇతర కారణాల రీత్యా గతం, ఇప్పటి ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు... ► స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.2,862 కోట్ల నుంచి 22 శాతం క్షీణించి రూ.2,233 కోట్లకు చేరింది. ► నికర వడ్డీ ఆదాయం రూ.3,161 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.3,780 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగింది. ► డివిడెండ్ ఆదాయం రూ.537 కోట్ల నుంచి రూ.2 కోట్లకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లాభాలు రూ.321 కోట్ల నుంచి రూ.2 కోట్లకు తగ్గాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, స్టాండ్అలోన్ నికర లాభం దాదాపు రెట్టింపైంది. 2018–19లో రూ.9,632 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.17,770 కోట్లకు ఎగసింది. ► నగదు నిల్వలు రూ.6,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెరిగాయి. కరోనా కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుండటంతో ఈ కంపెనీ లిక్విడిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే నగదు నిల్వలు భారీగా పెంచుకుంది. ► కేటాయింపులు రూ.935 కోట్ల నుంచి రూ.5,913 కోట్లకు ఎగిశాయి. ► ఈఏడాది మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు రూ.8,908 కోట్లు(1.99 శాతం)గా ఉన్నాయి. దీంట్లో వ్యక్తిగత రుణాలు 0.95 శాతంగా, వ్యక్తిగతేతర రుణాలు 4.71 శాతంగా ఉన్నాయి. ► ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రుణాలు 11% వృద్ధితో రూ.4.50 లక్షల కోట్లకు పెరిగాయి. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 764 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నికర లాభం 76 శాతం పెరిగి రూ. 764.2 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 434.4 కోట్లు. తాజాగా గ్లోబల్ జనరిక్స్ వ్యాపార విభాగం గణనీయంగా వృద్ధి చెందడం, పన్నులపరమైన భారం కొంత తగ్గడం తదితర అంశాలు లాభాల వృద్ధికి దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలిపారు. క్యూ4లో ఆదాయం 10 శాతం వృద్ధితో సుమారు రూ. 4,017 కోట్ల నుంచి దాదాపు రూ. 4,432 కోట్లకు పెరిగింది. కోవిడ్–19 వ్యాధి చికిత్సకు ఉపయోగపడే ఔషధాలను తయారు చేసేందుకు ఇతర సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ జీవీ ప్రసాద్ వెల్లడించారు. అత్యధిక అమ్మకాలు.. నాలుగో త్రైమాసికంలో అత్యధిక స్థాయిలో విక్రయాలు నమోదు చేసినట్లు చక్రవర్తి తెలిపారు. వార్షికంగా ఆదాయాలు 13 శాతం, లాభాలు నాలుగు శాతం పెరిగాయని పేర్కొన్నారు. వార్షిక లాభాల వృద్ధికి పన్ను అంశంతో పాటు కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ) క్రెడిట్ కూడా తోడ్పడిందని వివరించారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం మెరుగ్గా సాగిందని సౌమేన్ చక్రవర్తి తెలిపారు. క్యూ4లో ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు 6 శాతం పెరిగి రూ. 719.5 కోట్లకు చేరాయి. అంతర్జాతీయంగా జనరిక్స్ విభాగం ఆదాయం 20% పెరిగి రూ. 3,640 కోట్లకు చేరింది. ఇందులో ఉత్తర అమెరికా మార్కెట్ 21% పెరిగి రూ. 1,496 కోట్ల నుంచి రూ.1,807 కోట్లకు ఎగసింది. యూరప్ దేశాల్లో ఆదాయాలు 80% వృద్ధితో రూ. 345 కోట్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయాలు 5% పెరిగాయి. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా సరుకు రవాణా సంబంధ సమస్యలతో అమ్మకాలపై పాక్షికంగా ప్రభావం పడింది. 2019–20 ఏడాదికి గాను రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 25 తుది డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. -
మారుతీ లాభం 28 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 28 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.1,831 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,322 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ తెలిపింది. అమ్మకాలు తగ్గడం, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, తరుగుదల వ్యయాలు కూడా అధికం కావడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.21,473 కోట్ల నుంచి 15 శాతం క్షీణించి రూ.18,208 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 60 డివిడెండ్‌ను ప్రకటించింది. ► గత క్యూ4లో మొత్తం కార్ల అమ్మకాలు 16 శాతం తగ్గి 3.85 లక్షలకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.7,651 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం క్షీణించి రూ.5,678 కోట్లకు తగ్గింది. ► నికర అమ్మకాలు రూ.86,069 కోట్ల నుంచి రూ.75,661 కోట్లకు తగ్గాయి. ► ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మారుతీ షేర్ 1.8 శాతం లాభంతో రూ.5,035కు పెరిగింది. ఉద్యోగాలు, వేతనాల్లో కోత లేదు: గత ఏడాది నుంచి వాహన పరిశ్రమ సుదీర్ఘ సంక్షోభాన్ని ఎదుర్కొంటొందని, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో, వేతనాల్లో ఎలాంటి కోత విధించలేదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ వ్యాఖ్యానించారు. -
రిలయన్స్ లాభం 39 శాతండౌన్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 39 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.10,362 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,348 కోట్లకు తగ్గిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. గత మూడేళ్లలో ఇదే అత్యల్ప త్రైమాసిక లాభం. సీక్వెన్షియల్‌గా చూస్తే, (గత క్యూ3లో నికర లాభం రూ.11,640 కోట్లు) 45 శాతం తగ్గిందని పేర్కొంది. ఇంధన, పెట్రో కెమికల్స్ వ్యాపారాలు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ముడి చమురు ధరలు తగ్గడం, డిమాండ్ పడిపోవడంతో రూ.4,267 కోట్ల అసాధారణ నష్టాలు నికర లాభంపై ప్రభావం చూపించాయని వెల్లడించింది. అయితే టెలికం విభాగం, రిలయన్స్ జియో ఫలితాలు బాగా ఉండటంతో లాభ క్షీణత తగ్గిందని తెలిపింది. కార్యకలాపాల ఆదాయం 2 శాతం క్షీణించి రూ.1,36,240 కోట్లకు చేరిందని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయం 11 శాతం తగ్గిందని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.6.50 డివిడెండ్‌ను ప్రకటించింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు.... ► స్థూల రిఫైనరీ మార్జిన్(జీఆర్ఎమ్) 8.9 డాలర్లుగా ఉంది. ► కరోనా వైరస్ కల్లోలం ఇంధన, పెట్రో రసాయనాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. ► చమురు–గ్యాస్ వ్యాపారంలో రూ.485 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► రిలయన్స్ రిటైల్ స్థూల లాభం 20% వృద్ధితో రూ.2,062 కోట్లకు పెరిగింది. అనుకున్న దానికంటే ముందుగానే రుణ రహిత కంపెనీ... వచ్చే ఏడాది మార్చి కల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత కంపెనీగా నిలపాలన్న ముకేశ్ లక్ష్యం ముందే సాధించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. మొత్తం రూ.1.04 లక్షల కోట్ల నిధుల సమీకరణ ప్రయత్నాలను ఈ ఏడాది జూన్‌కల్లా పూర్తి చేయాలని కంపెనీ బావిస్తోంది. రూ.53.125 కోట్ల రైట్స్ ఇష్యూతో పాటు జియోలో ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేయనున్న రూ.43,574 కోట్లు, ఇంధన రిటైల్ విభాగంలో 49% వాటాను బ్రిటిష్ పెట్రోలియమ్ రూ.7,000 కోట్లకు విక్రయించడం.... ఈ జాబితాలో ఉన్నాయి. ఫేస్‌బుక్‌లాగానే ఎన్నో కంపెనీలు, ఆర్థిక సంస్థలు రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. మార్చి క్వార్టర్ చివరినాటికి రిలయన్స్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.3,36,294 కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,75,259 కోట్లుగా ఉన్నాయి. నికర రుణ భారం రూ.1,61,035 కోట్లు. రిలయన్స్ జియో లాభం 177 శాతం అప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. గత క్యూ4లో ఈ కంపెనీ నికర లాభం 177 శాతం ఎగసి రూ.2,331కు పెరిగింది. వినియోగదారులు పెరగడం, టారిఫ్‌లు కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో నికర లాభం రూ. 840 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.14,835 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం 38.75 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ కంపెనీ ఇదే. వినియోగదారుల సంఖ్యలో 26 శాతం వృద్ధి సాధించింది. ఒక్క నెలకు ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్పీయూ) రూ.130.6గా ఉంది. ఇటీవలే కుదిరిన ఫేస్బుక్ డీల్ పరంగా రిలయన్స్ జియో విలువ రూ.4.62 లక్షల కోట్లని అంచనా. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 88% వృద్ధితో రూ.5,562 కోట్లకు, కార్యకలాపాల ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.54,316 కోట్లకు చేరాయి. ∙7,500 కోట్ల డాలర్ల విలువైన ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టగానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో 20% వాటాను సౌదీ ఆరామ్కో కంపెనీకి రిలయన్స్ విక్రయించనున్నది. వేతనాల్లో కోత కంపెనీ ఉద్యోగులకు, డైరెక్టర్లకు, ఉన్నతాధికారులకు వేతనాల్లో 10–50 శాతం కోత విధించనున్నామని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఎదురవుతున్న పరిస్థితులను అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి తన పారితోషికం మొత్తాన్ని(రూ.15 కోట్లు) వదులుకోవడానికి చైర్మన్ ముకేశ్ అంబానీ సిద్ధపడ్డారని పేర్కొంది. వార్షిక వేతనం రూ.15 లక్షలలోపు ఉన్న వారికి వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని, అంతకు మించిన వేతనాలు పొందే వారికి 10 % కోత ఉంటుందని పేర్కొంది. రైట్స్ ఇష్యూ @ 53,125 కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూను ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమ వద్దనున్న ప్రతి 15 షేర్లకు ఒక షేర్‌ను (1:15) రైట్స్ షేర్‌గా పొందవచ్చు. రైట్స్ ఇష్యూలో షేర్లు జారీ చేసే ధర రూ.1,257. గురువారం నాటి ముగింపు ధర (రూ.1,467)తో పోల్చితే ఇది 14 శాతం తక్కువ. రైట్స్ ఇష్యూ విలువ రూ.53,125 కోట్లు. భారత్‌లో ఇదే అతి పెద్ద రైట్స్ ఇష్యూ.మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. రైట్స్ ఇష్యూ ఇతర అంశాలపై అంచనాల కారణంగా బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3 శాతం లాభంతో రూ.1,467 వద్ద ముగిసింది. వినియోగ వ్యాపారాలు... రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలు నిర్వహణ, ఆర్థిక పరమైన అంశాల్లో జోరుగా వృద్ధిని సాధించాయి. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత మన దేశం, మా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ కూడా మరింత బలం పుంజుకుంటాయన్న ధీమా నాకు ఉంది. –ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
మైండ్ ట్రీ డివిడెండ్ రూ.10
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.206 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.198 కోట్ల నికర లాభం వచ్చిందని, 4 శాతం వృద్ధి సాధించామని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.1,839 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.2,051 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ దేబాశిష్ చటర్జీ పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.10 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం ఫ్లాట్‌గా 2.8 కోట్ల డాలర్లకు చేరగా, ఆదాయం మాత్రం 6 శాతం వృద్ధితో 28 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. నిర్వహణ లాభ మార్జిన్ ఒకటిన్నర శాతం పెరిగిందని, 40 కోట్ల డాలర్ల విలువైన డీల్స్ సాధించామని వివరించారు. పూర్తి సంవత్సరానికి లాభం తగ్గింది: పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 16% తగ్గి రూ.631 కోట్లకు చేరగా, ఆదాయం మాత్రం 11% ఎగసి రూ.7,764 కోట్లకు పెరిగిందని చటర్జీ తెలిపారు. మార్చి నాటికి యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 307కు చేరిందని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 21,991గా ఉందని, అట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) 17.4%గా ఉందని వివరించారు. -
ఇన్ఫోసిస్ లాభం 4,335 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 6 శాతం పెరిగింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా వ్యాపార అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2020–21) ఆదాయ, మార్జిన్ల అంచనాలను వెల్లడించడం లేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడ్డాక ఈ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. కాగా గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ఈ కంపెనీ అందుకోలేకపోయింది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.9.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,078 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ4లో రూ.4,335 కోట్లకు పెరిగింది. అయితే గత క్యూ3 నికర లాభంతో పోల్చితే 3 శాతం క్షీణత నమోదైంది. ఇతర ఆదాయం 26 శాతం తగ్గడం, అంతకు ముందటి క్వార్టర్లో పన్ను రాయితీలు లభించడంతో నికర లాభం ఈ క్యూ4లో ఈ స్థాయికే పరిమితమైంది. ► ఆదాయం రూ.21,539 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.23,267 కోట్లకు చేరింది. ► డాలర్ల పరంగా చూస్తే, గత క్యూ4లో (సీక్వెన్షియల్‌గా)నికర లాభం 6 శాతం తగ్గి 59 కోట్ల డాలర్లకు, ఆదాయం 1.4 శాతం తగ్గి 320 కోట్ల డాలర్లకు తగ్గింది. ► గత క్యూ4లో 165 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో మొత్తం డీల్స్ విలువ పూర్తి ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల డాలర్లకు చేరాయి. ► ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 8% వృద్ధితో రూ.16,639 కోట్లకు, ఆదాయం 9.8 శాతం పెరిగి రూ.90,791 కోట్లకు చేరాయి. ఆదాయం 10–10.5% రేంజ్లో పెరగగలదన్న అంచనాలను కంపెనీ అందుకోలేకపోయింది. ► ఈ ఏడాది మార్చి చివరికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.27,276 కోట్లుగా ఉన్నాయి. ఎలాంటి రుణ భారం లేదు. ► ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,42,371కు చేరింది. గత క్యూ4లో ఉద్యోగుల వలస(అట్రిషన్ రేటు) 21 శాతంగా ఉంది. ► ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని ఇన్ఫోసిస్ తెలిపింది. వారు కోలుకోవడానికి తగిన తోడ్పాటునందిస్తామని పేర్కొంది. జాబ్ ఆఫర్లు ఇచ్చిన వారందరికీ కొలువులు ఇస్తామని భరోసా ఇచ్చింది. అయితే, వేతనాల పెంపు, అలాగే ప్రమోషన్లు కూడా ఉండవని తెలిపింది. ► మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ 3.7 శాతం లాభంతో రూ.653 వద్ద ముగిసింది. కాగా అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టైన ఇన్ఫోసిస్ ఏడీఆర్ మాత్రం 1 శాతం లాభంతో 8.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సమస్యల నుంచి గట్టెక్కుతాం... గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10 శాతం వృద్ధి, 21.3 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించాం. సమీప భవిష్యత్తులో మా వ్యాపారంపై ప్రభావం ఉంటుంది. రికవరీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. నాణ్యమైన సేవలందించగలగడం, పుష్కలంగా నిధుల దన్నుతో సమస్యలను అధిగమించగలం. –సలిల్ పరేఖ్, సీఈఓ, ఎమ్డీ, ఇన్ఫోసిస్ ఫలితాలు సంతృప్తికరం... వివిధ విభాగాల్లో, దేశాల్లో మంచి వృద్ధిని సాధించాం. భారీ డీల్స్ పెరిగాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం సంతృప్తికరమైన ఫలితాలిచ్చింది. –ప్రవీణ్ రావ్, సీఓఓ, ఇన్ఫోసిస్ -
టీసీఎస్ లాభం 8,049 కోట్లు
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.8,049 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం (రూ.8,126 కోట్లు)తో పోల్చి తే 1 శాతం మేర తగ్గిందని టీసీఎస్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.38,010 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.39,946 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో రూ.32,340 కోట్లకు, ఆదాయం 7 శాతం ఎగసి రూ.1,56,949 కోట్లకు పెరిగాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 తుది డివిడెండ్‌ను(600 శాతం) ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► ఇతర ఆదాయం తక్కువగా రావడం, అధిక వడ్డీ వ్యయాలు, లాక్డౌన్ విధింపు(దేశీయంగా, అంతర్జాతీయంగా) లాభదాయకతపై ప్రభావం చూపాయి. ► డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం తగ్గి 544 కోట్ల డాలర్లకు తగ్గింది. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం పెరిగింది. ఆదాయం అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 13 శాతం, గత క్యూ3లో 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► గత క్యూ4లో ఎబిట్ అర శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.10,025 కోట్లకు పెరిగింది. మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 25.1 శాతానికి చేరింది. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019–20) ఎబిట్ 3 శాతం వృద్ధితో రూ.38,580 కోట్లకు పెరగ్గా, మార్జిన్ మాత్రం 1 శాతం మేర తగ్గి 24.58 శాతానికి చేరింది. ► గత క్యూ4లో మొత్తం 1,789 మందికి ఉద్యోగాలిచ్చింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 24,179 మందికి కొలువులిచ్చింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,48,464కు పెరిగింది. ఉద్యోగుల వలస (అట్రిషన్ రేటు) 12.1 శాతంగా ఉంది. ► గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.37,702 కోట్ల మేర డివిడెండ్లు చెల్లించింది. ఈ మార్చి క్వార్టర్లో ఒక్కో షేర్‌కు రూ. 12 మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.6 తుది డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే, ఈ మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.18కు పెరుగుతుంది. మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 1 శాతం నష్టంతో రూ. 1,715 వద్ద ముగిసింది. ఉద్యోగాల కోత ఉండదు.. కరోనా ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో కోత విధించే యోచనేదీ లేదని టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జీతాల పెంపు మాత్రం ఉండదని తెలిపారు. మరోవైపు, ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కాటేసింది.... మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి. కానీ ఆ సానుకూలతలన్నింటినీ కరోనా మహమ్మారి ధ్వంసం చేసింది. గుడ్డిలో మెల్లలా కొన్ని భారీ డీల్స్‌ను సాధించగలిగాం. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆర్డర్లను ఈ క్వార్టర్‌లోనే సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ, ఎమ్డీ సంతృప్తికరంగానే సేవలు... కార్యకలాపాల నిర్వహణలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ, క్లయింట్లకు సంతృప్తికరమైన స్థాయిల్లోనే ఐటీ సేవలందిస్తున్నాం. అత్యవసర సేవలే కాక, అన్ని విభాగాల సేవలను అందిస్తున్నాం. –ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం, టీసీఎస్ సీఓఓ, ఈడీ -
విప్రో లాభం రూ.2,345 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.2,345 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం రూ.2,494 కోట్లతో పోలిస్తే 4 శాతం క్షీణించిందని పేర్కొంది. ఆదాయం మాత్రం రూ.15,600 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.15,711 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ.9.772 కోట్లకు, ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.61,023 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొందని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని విప్రో పేర్కొంది. వ్యాపార స్థితిగతుల స్పష్టత మెరుగుపడ్డాక ఆదాయ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి తుది డివిడెండ్‌ను ప్రకటించలేదు. జనవరిలో ప్రకటించిన రూ. 1 మధ్యంతర డివిడెండ్... తుది డివిడెండ్ కానున్నది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ కంపెనీ రూ. 1 డివిడెండ్‌ను ఇచ్చినట్లు లెక్క. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో విప్రో షేర్ 1.5 శాతం నష్టంతో రూ. 186 వద్ద ముగిసింది. వ్యయ నియంత్రణ చర్యలు.. కష్టకాలంలో వ్యయాలను నియంత్రణలో ఉంచుకునేందుకు ’అన్ని అవకాశాలు’ పరిశీలిస్తున్నట్లు విప్రో సీఎఫ్‌వో జతిన్ దలాల్ తెలిపారు. కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల గత 15 రోజుల్లోనే వ్యాపారం 0.7–0.8% దెబ్బతిన్నట్లు వివరించారు. కొందరు సిబ్బందికి సెలవులు లేదా ఫర్లోపై పంపడం(వేతనం లేని సెలవులు) వంటి అంశాలు పరిశీలించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని ఆర్డర్లు సాధిస్తాం.. ప్రస్తుత పరిస్థితులు కనీవిని ఎరుగనివి. ప్రాజెక్ట్‌లు అమలు చేయగల సత్తా, విస్తృతమైన ఐటీ సర్వీసుల కారణంగా మరిన్ని ఆర్డర్లు సాధించగల సత్తా మాకుంది. –అబిదాలీ నీముచ్వాలా, విప్రో సీఈఓ -
ఆర్బీఐ సమీక్ష, ఆర్థికాంశాలే దిక్సూచి..!
ముంబై: గతేడాది నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ట స్థాయికాగా, 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదైంది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు నిరాశపరిచినప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు మార్కెట్లను నిలబెట్టే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఎంపీసీ గురువారం ప్రకటనలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. మరోవైపు కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోడీ ప్రభుత్వంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈయన క్యాబినెట్లో కొత్తగా ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్ 2019–20 సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5న ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ప్రధాన ఎజెండా ఉద్యోగ కల్పన, ప్రభుత్వ వ్యయం పెంపు, మౌలిక సదుపాయాల కల్పన.. తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహాన్నివ్వడంతోపాటు పన్నుల తగ్గింపుకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వనుం దనే అంచనాలు ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. మొత్తంగా మార్కెట్‌కు ఈవారం కదలికలు అత్యంత కీలకంగా మారనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ అన్నారు. ఇక రంజాన్ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు అయినందున ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోయాయి. మెక్సికోపై టారిఫ్‌లను అనూహ్యంగా పెంచుతూ అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఒకదశలో క్రూడ్ ధరలు 6% మేర పతనమయ్యాయి. వారాంతాన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 5.57% తగ్గి 61.69 డాలర్లకు పడిపోగా.. నైమెక్స్ క్రూడ్ 5.69% పతనమై 53.37 డాలర్ల వద్ద ముగిసింది. ఈ పతనం ఇలానే కొనసాగి.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ వేడెక్కకుండా ఉంటే, దేశీ మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందనే ఆశావాదంతో ఉన్నట్లు బీఎన్పీ పారిబా అడ్వైజరీ విభాగం హెడ్ హేమంగ్ జానీ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి నికాయ్ ఇండియా తయారీ రంగ ఇండెక్స్ మేనెల గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. సేవల డేటా బుధవారం వెల్లడికానుంది. ఇక గత వారాంతాన వెల్లడైన ఆటో రంగ అమ్మకాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఈ అంశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ నిధుల వెల్లువ భారత్ కాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాల్గవ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. మే నెలలో మొదటి 3 వారాలు అమ్మకాలకు పాల్పడినప్పటికీ.. బీజేపీ ఘనవిజయంతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. నికరంగా మే 2–31 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ.7,920 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.1,111 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. మొత్తంగా మే నెలలో రూ.9,031 కోట్లను వీరు పెట్టుబడిపెట్టారు. -
అంచనాలను దాటేసిన ఇన్ఫీ
సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలను మించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి) 25 శాతం వృద్ధిని చూపించింది. 2,992 కోట్ల నికర లాభం సాధించింది. నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేట్ రెవెన్యూ కూడా 23 శాతం పెరిగింది. ఇది ఏడాది క్రితం రూ. 10,454 కోట్లు ఉండగా ఇప్పుడు రూ. 12,875 కోట్లు అయ్యింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (ఐఎఫ్ఆర్ఎస్) ప్రకారం చూస్తే, ఇన్ఫోసిస్ నికర ఆదాయం 9.7 శాతం పెరిగింది. స్థూల ఆదాయం 7.9 శాతం పెరిగింది. రెలిగేర్ లాంటి ఆర్థిక సంస్థలు ఇన్ఫోసిస్ ఆదాయానికి సంబంధించిన గైడెన్స్ మహా అయితే 7-9% మాత్రమే ఉంటుందని అంచనా వేయగా, అది గత సంవత్సరం కంటే దాటి 13 శాతంగా నమోదైంది. దీంతో ఈసారి ఇన్ఫోసిస్ పని అయిపోయినట్లేనంటూ కొందరు పండితులు చేసిన వ్యాఖ్యలు తప్పని తేలిపోయాయి. నారాయణమూర్తి మళ్లీ పగ్గాలు చేపట్టడంతో ఆట్రిషన్ ఎలా ఉన్నా ఫలితాలు మాత్రం బాగానే ఉండటం గమనార్హం.