ముంబై: గతేడాది నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ట స్థాయికాగా, 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదైంది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు నిరాశపరిచినప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు మార్కెట్లను నిలబెట్టే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ ఎంపీసీ గురువారం ప్రకటనలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు.
మరోవైపు కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోడీ ప్రభుత్వంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈయన క్యాబినెట్‌లో కొత్తగా ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్ 2019–20 సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5న ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ప్రధాన ఎజెండా ఉద్యోగ కల్పన, ప్రభుత్వ వ్యయం పెంపు, మౌలిక సదుపాయాల కల్పన.. తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహాన్నివ్వడంతోపాటు పన్నుల తగ్గింపుకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వనుం దనే అంచనాలు ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. మొత్తంగా మార్కెట్‌కు ఈవారం కదలికలు అత్యంత కీలకంగా మారనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ అన్నారు. ఇక రంజాన్ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు అయినందున ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.
ముడిచమురు ధరల ప్రభావం..
గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోయాయి. మెక్సికోపై టారిఫ్‌లను అనూహ్యంగా పెంచుతూ అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఒకదశలో క్రూడ్ ధరలు 6% మేర పతనమయ్యాయి. వారాంతాన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 5.57% తగ్గి 61.69 డాలర్లకు పడిపోగా.. నైమెక్స్ క్రూడ్ 5.69% పతనమై 53.37 డాలర్ల వద్ద ముగిసింది. ఈ పతనం ఇలానే కొనసాగి.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ వేడెక్కకుండా ఉంటే, దేశీ మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందనే ఆశావాదంతో ఉన్నట్లు బీఎన్‌పీ పారిబా అడ్వైజరీ విభాగం హెడ్ హేమంగ్ జానీ అన్నారు.
స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి
నికాయ్ ఇండియా తయారీ రంగ ఇండెక్స్ మేనెల గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. సేవల డేటా బుధవారం వెల్లడికానుంది. ఇక గత వారాంతాన వెల్లడైన ఆటో రంగ అమ్మకాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఈ అంశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి.
విదేశీ నిధుల వెల్లువ
భారత్ కాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాల్గవ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. మే నెలలో మొదటి 3 వారాలు అమ్మకాలకు పాల్పడినప్పటికీ.. బీజేపీ ఘనవిజయంతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. నికరంగా మే 2–31 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ.7,920 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.1,111 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. మొత్తంగా మే నెలలో రూ.9,031 కోట్లను వీరు పెట్టుబడిపెట్టారు.
ఆర్‌బీఐ సమీక్ష, ఆర్థికాంశాలే దిక్సూచి..!
Published Mon, Jun 3 2019 5:39 AM | Last Updated on Mon, Jun 3 2019 5:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment