న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 6 శాతం పెరిగింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా వ్యాపార అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2020–21) ఆదాయ, మార్జిన్ల అంచనాలను వెల్లడించడం లేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడ్డాక ఈ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. కాగా గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ఈ కంపెనీ అందుకోలేకపోయింది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.9.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మరిన్ని వివరాలు...
► అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,078 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ4లో రూ.4,335 కోట్లకు పెరిగింది. అయితే గత క్యూ3 నికర లాభంతో పోల్చితే 3 శాతం క్షీణత నమోదైంది. ఇతర ఆదాయం 26 శాతం తగ్గడం, అంతకు ముందటి క్వార్టర్‌లో పన్ను రాయితీలు లభించడంతో నికర లాభం ఈ క్యూ4లో ఈ స్థాయికే పరిమితమైంది.
► ఆదాయం రూ.21,539 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.23,267 కోట్లకు చేరింది.
► డాలర్ల పరంగా చూస్తే, గత క్యూ4లో (సీక్వెన్షియల్‌గా)నికర లాభం 6 శాతం తగ్గి 59 కోట్ల డాలర్లకు, ఆదాయం 1.4 శాతం తగ్గి 320 కోట్ల డాలర్లకు తగ్గింది.
► గత క్యూ4లో 165 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో మొత్తం డీల్స్ విలువ పూర్తి ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల డాలర్లకు చేరాయి.
► ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 8% వృద్ధితో రూ.16,639 కోట్లకు, ఆదాయం 9.8 శాతం పెరిగి రూ.90,791 కోట్లకు చేరాయి. ఆదాయం 10–10.5% రేంజ్‌లో పెరగగలదన్న అంచనాలను కంపెనీ అందుకోలేకపోయింది.
► ఈ ఏడాది మార్చి చివరికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.27,276 కోట్లుగా ఉన్నాయి. ఎలాంటి రుణ భారం లేదు.
► ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,42,371కు చేరింది. గత క్యూ4లో ఉద్యోగుల వలస(అట్రిషన్ రేటు) 21 శాతంగా ఉంది.
► ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని ఇన్ఫోసిస్ తెలిపింది. వారు కోలుకోవడానికి తగిన తోడ్పాటునందిస్తామని పేర్కొంది. జాబ్ ఆఫర్లు ఇచ్చిన వారందరికీ కొలువులు ఇస్తామని భరోసా ఇచ్చింది. అయితే, వేతనాల పెంపు, అలాగే ప్రమోషన్లు కూడా ఉండవని తెలిపింది.
► మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్ షేర్ 3.7 శాతం లాభంతో రూ.653 వద్ద ముగిసింది. కాగా అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టైన ఇన్ఫోసిస్ ఏడీఆర్ మాత్రం 1 శాతం లాభంతో 8.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సమస్యల నుంచి గట్టెక్కుతాం...
గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10 శాతం వృద్ధి, 21.3 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించాం. సమీప భవిష్యత్తులో మా వ్యాపారంపై ప్రభావం ఉంటుంది. రికవరీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. నాణ్యమైన సేవలందించగలగడం, పుష్కలంగా నిధుల దన్నుతో సమస్యలను అధిగమించగలం.
–సలిల్ పరేఖ్, సీఈఓ, ఎమ్‌డీ, ఇన్ఫోసిస్
ఫలితాలు సంతృప్తికరం...
వివిధ విభాగాల్లో, దేశాల్లో మంచి వృద్ధిని సాధించాం. భారీ డీల్స్ పెరిగాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం సంతృప్తికరమైన ఫలితాలిచ్చింది.
–ప్రవీణ్ రావ్, సీఓఓ, ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ లాభం 4,335 కోట్లు
Published Tue, Apr 21 2020 4:33 AM | Last Updated on Tue, Apr 21 2020 4:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment