న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3% క్షీణించి 40 ఏళ్ల కనిష్టానికి జారిపోయింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు త్రైమాసికం (క్యూ4)లో ఎకానమీ కొంత పురోగతి సాధించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో వరుసగా రెండవ క్వార్టర్‌లోనూ వృద్ధి బాటన నడిచింది. మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.6 శాతంగా నమోదయ్యింది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలోనూ భారత్ ఎకానమీ 0.5% వృద్ధిని నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే.
కరోనా కట్టడికి దేశ వ్యాప్త కఠిన లాక్‌డౌన్ నేపథ్యంలో 2020–21 తొలి జూన్ త్రైమాసికంలో ఎకానమీ 24.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. తదుపరి జూలై– సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.4 శాతానికి పరిమితమైంది. ఇక మొత్తం 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది. నిజానికి 7.5 శాతం నుంచి 8 శాతం వరకూ క్షీణ అంచనాలు నమోదయ్యాయి. మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం ఆర్థిక సంవత్సరం తాజా గణాంకాలను ఆవిష్కరించింది.
విలువలు ఇలా...
2011–21 ఆర్థిక సంవత్సరం స్థిర ధరల ప్రకారం (బేస్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన గణాంకాలు) 2019 ఏప్రిల్–2020 మార్చి మధ్య భారత స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.145.69 లక్షల కోట్లు. కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య రూ.135.13 లక్షల కోట్లకు ఎకానమీ విలువ పడిపోయింది. వెరసి 7.3 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక మార్చి త్రైమాసికంలో విలువలు పరిశీలిస్తే, 38.33 లక్షల కోట్ల నుంచి రూ.38.96 లక్షల కోట్లకు ఎగసింది. అంటే 1.6 శాతం వృద్ధి అన్నమాట. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 4 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. 2019–20 మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 3 శాతం. కాగా, ఉత్పత్తి దశ వరకూ సంబంధించి గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి 2020–21 మార్చి త్రైమాసికంలో 3.7 శాతంగా నమోదయితే, ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం క్షీణత నమోదుచేసుకుంది.
కీలక రంగాల తీరు ఇలా...
► వ్యవసాయం: మూడవ త్రైమాసికంలో 4.5 శాతం వృద్ధి సాధిస్తే, నాల్గవ త్రైమాసికంలో ఇది 3.1 శాతానికి పరిమితమైంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతం పురోగమించింది. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15 శాతం.
► మైనింగ్: డిసెంబర్, మార్చి వరుస త్రైమాసికాల్లో క్షీణత 4.4 శాతం నుంచి 5.7 శాతానికి పెరిగింది. వార్షికంగా చూస్తే క్షీణ రేటు 8.5 శాతం.
► తయారీ: డిసెంబర్ త్రైమాసికంలో 1.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, ఇది నాల్గవ త్రైమాసికంలో 6.9 శాతానికి పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం క్షీణించింది.
► నిర్మాణం: డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.5%, 14.5 శాతాలుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 8.6% క్షీణించింది.
► ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు: డిసెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.9 శాతం అయితే, క్షీణత నాల్గవ త్రైమాసికంలో 2.3 శాతానికి పరిమితమైంది. 2020–21లో క్షీణ రేటు 18.2 శాతం.
► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి 6.7 శాతం అయితే, మార్చి త్రైమాసికంలో ఈ రేటు 5.4 శాతం. ఆర్థిక సంవత్సరంలో 1.5 శాతం క్షీణత.
► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 9.1 శాతం.
► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 2.3 శాతం.
మరిన్ని అంశాలు..
► 1979–80 ఆర్థిక సంవత్సరం తర్వాత అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పూర్తి ఆర్థిక సంవత్సరంలో క్షీణ రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. అప్పట్లో క్షీణత 5.2 శాతం.
► 1950–51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. వర్షాలు సరిగ్గా లేక వ్యవసాయ రంగం దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు ఆరవసారి క్షీణత నమోదయ్యింది.
► భారత్ ఎకానమీ మళ్లీ రూ.145 లక్షల కోట్ల స్థాయిని చేరుకోవాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10 నుంచి 11 శాతం పురోగమించాలి. నిజానికి ఈ స్థాయిలో వృద్ధి ఉంటుందని తొలుత భావించినప్పటికీ, దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఈ అంచనాలకు దెబ్బకొట్టింది. వృద్ధి రెండంకెల లోపే ఉంటుందని రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థల తాజా అంచనాలు. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ స్వయంగా ఈ తరహా సందేహాలు వ్యక్తం చేయడం గమనించాల్సిన మరో ముఖ్యాంశం.
► ఎకానమీలో 55 శాతం వాటా ఉన్న వినియోగ డిమాండ్, నిరుద్యోగం ఇప్పుడు దేశం ముందు ఉన్న తీవ్ర సవాళ్లని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడక నడుస్తుండడం మరో ప్రతికూల అంశం.
► ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వెలువడినవి తొలి అంచనాలు మాత్రమే. మరింత సమగ్రంగా తదుపరి రెండు విడతల్లో సవరణలు, తుది ఫలితాలు వెలువడతాయి.
► 2020–21 తలసరి ఆదాయం రూ.1,28,829గా నమోదయ్యింది. దాదాపు 2018–19 నాటి రూ.1,25,883 స్థాయికి పడిపోయింది.
ద్రవ్యలోటు రూ.18,21,461 కోట్లు
2020–21 జీడీపీలో 9.3 శాతం
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు 2020–21 ఆర్థిక సంవత్సరం రూ.18,21,461 కోట్లుగా నమోదయ్యింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే ఇది 9.3 శాతం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఆర్థిక శాఖ సవరిత అంచనాలు 9.5% కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. మరిన్ని అంశాలను పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతం ఉండాలని (రూ.7.96 లక్షల కోట్లు) 2020 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. అయితే కరోనా కష్టాల నేపథ్యంలో ఆదాయాలు భారీగా పడిపోయాయి. దీనితో ద్రవ్యలోటు అంచనాలను 9.5%కి (రూ.18,48,655 కోట్లు) పెంచుతున్నట్లు 2021–22 బడ్జెట్ పేర్కొం ది. సవరిత అంచనాలకన్నా 20 బేసిస్ పాయింట్లు తక్కువగా 9.3%గా ద్రవ్యలోటు తాజాగా నమోదయ్యింది.
ఆదాయ– వ్యయాలు ఇలా...
ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆదాయాలు రూ.16,89,720 కోట్లు. ఇందులో రూ.14,24,035 కోట్లు పన్నులు, రూ.2,08,059 కోట్ల పన్ను రహిత ఆదాయాలుకాగా, రూ. 57,626 కోట్లు రుణ రికవరీ, పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించి వసూలయిన నాన్–డెట్ క్యాపిటల్ ఆదాయాలు. ఇక ప్రభుత్వ వ్యయాల మొత్తం రూ. 35,11,181 కోట్లు. ఇందులో రూ.30,86,360 కోట్లు రెవెన్యూ అకౌంట్ నుంచి వ్యయమవగా, రూ.4,24,821 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి ఖర్చయ్యాయి. వెరసి రూ.18,21,461 కోట్ల ద్రవ్యలోటు నమోదయ్యిందన్నమాట.
2021 ఏప్రిల్‌లో ఇలా..: కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి నెల– ఏప్రిల్ ద్రవ్యలోటు పరిస్థితిని మరో ప్రకటనలో సీజీఏ వివరించింది. బడ్జెట్ అంచనాల్లో ఇది ఏప్రిల్‌లో 5.2 శాతానికి చేరింది. విలువలో రూ.78,699 కోట్లు. 2021–22లో 6.8% లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. విలువలో రూ.15,06,812 కోట్లు. 2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతంకావడం గమనార్హం. అప్పటికి ఇదే ఏడేళ్ల గరిష్టం.
ఎకానమీలో అనిశ్చితి
కరోనా మహమ్మారి సవాళ్లు తొలగకపోవడంతో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండకపోయినప్పటికీ, వృద్ధి రేటు రెండంకెల్లో నమోదుకావడం కష్టం
– కేవీ సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment