న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2019 ఏప్రిల్ –2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా నెమ్మదించింది. ఈ కాలంలో కేవలం 4.2 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఏడు రోజులూ (2020 మార్చి చివరి వారం) కరోనా భయాలతో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఈ కాలంలో (మార్చి 25 నుంచి 31వ తేదీ వరకూ) ఆర్థిక వ్యవస్థకు రూ.1.4 లక్షల కోట్ల నష్టం జరిగిందన్నది ఒక అంచనా. ఇక ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో వృద్ధి రేటు కేవలం 3.1 శాతం. భారత్ జీడీపీ 2019–2020 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) ఏడేళ్ల కనిష్టం 4.1 శాతానికి (4.7 శాతం నుంచి దిగువవైపు సవరణ) పడిపోయింది. తాజాగా మరింత కిందకు జారింది. మొదటి త్రైమాసికం, రెండవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 4.4 శాతం వృద్ధి రేట్లు (5.6 శాతం, 5.1 శాతం నుంచి తగ్గింపు) నమోదయ్యాయి. 2018–19లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను క్లుప్తంగా విశ్లేషిస్తే...
► 2008–09లో కేవలం 3.1 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. అటు తర్వాత ఆర్థిక వృద్ధి ఇంత తక్కువ స్థాయి (4.2 శాతం) ఇదే తొలిసారి. ఆర్‌బీఐ 5 శాతం అంచనాకన్నా తక్కువకు ఇది పడిపోవడం గమనార్హం.
► నాల్గవ త్రైమాసికంలో వచ్చిన 3.1 శాతం గడచిన 44 త్రైమాసికాల్లో ఎన్నడూ రాలేదు. అంటే ఈ స్థాయి వృద్ధిరేటు 11 సంవత్సరాల కనిష్టమన్నమాట. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతం. ఇక భారత్ పోల్చుకునే చైనా ఆర్థిక వ్యవస్థ జనవరి–మార్చి 2020 త్రైమాసికంలో –6.8 శాతం క్షీణతలో ఉంది. కోవిడ్–19 దీనికి నేపథ్యం.
► నిపుణుల అంచనాల ప్రకారం కరోనా నేపథ్యంలో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మాంద్యం పరిస్థితిలోకి జారి‡పోనుంది. 1958, 1966, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మూడుసార్లు దేశం మాంద్యాన్ని ఎదుర్కొంది. ఈ మూడు సందర్భాల్లోనూ వర్షపాతం సరిగా లేక, అప్పట్లో ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం దెబ్బతినడమే కారణం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో అసలు వృద్ధిలేకపోగా, మైనస్ (క్షీణత) గనుక నమోదయితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు.
క్యూ4లో రంగాల వారీ ‘జీవీఏ’ వృద్ధి...
జనవరి–మార్చి మధ్య కాలంలో గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) ఆధారిత వృద్ధి రేటు కేవలం 3 శాతంగా ఉండడం గమనించదగిన మరో అంశం. అక్టోబర్–డిసెంబర్ మధ్య ఈ రేటు 3.5 శాతం ఉంటే, 2018–19లో నాల్గవ త్రైమాసికంలో ఈ విభాగంలో వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల 4వ త్రైమాసికాలను చూస్తే... తయారీ రంగం జీవీఏ 2.1 శాతం వృద్ధి నుంచి – 1.4 శాతం క్షీణతలోకి పడిపోయింది. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.7 శాతం నుంచి 0.03 శాతానికి తగ్గింది. నిర్మాణ రంగం జీవీఏ 6 శాతం వృద్ధి నుంచి –2.2 శాతం క్షీణతలోకి జారింది.
అయితే జీడీపీలో 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో వృద్ధి మాత్రం 1.6 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. ఈ రంగంలో ప్రభుత్వ వ్యయాలు దీనికి ఒక కారణం. మైనింగ్ రంగం కూడా –4.8 శాతం క్షీణత నుంచి 5.2 శాతం వృద్ధికి మారింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు అలాగే బ్రాడ్‌కాస్టింగ్ సేవల్లో 6.9 శాతం వృద్ధిరేటు 2.6 శాతానికి పడిపోయింది. ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సర్వీసుల వృద్ధి రేటు 8.7 శాతం నుంచి 2.4 శాతానికి దిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతర సేవల వృద్ధిరేటు కూడా 11.6% నుంచి 10.1 శాతానికి తగ్గింది.
విలువలు ఇలా...
2011–12 ధరల స్థితి ప్రకారం... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ (రియల్ జీడీపీ) వేసిన లెక్కల ప్రకారం... 2018–19 ఆర్థిక సంవత్సరం క్యూ4 జీడీపీ విలువ రూ.36.90 లక్షల కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.38.04 లక్షల కోట్లకు పెరిగింది. అంటే క్యూ4లో జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంమన్నమాట. ఇక ఇదే విధంగా 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ.139.81 లక్షల కోట్లయితే, ఈ విలువ 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.145.66 లక్షల కోట్లకు చేరింది. అంటే ఇక్కడ వృద్ధిరేటు 4.2 శాతం అని అర్థం.
తలసరి ఆదాయంలో 6.1 శాతం వృద్ధి
జీడీపీ లెక్కప్రకారం, తలసరి ఆదాయం 2018–19లో రూ.1,26,521 అయితే, ఇది 2019–20లో రూ.1,34,226కు చేరింది. వృద్ధి 6.1 శాతం.
కట్టు తప్పిన ద్రవ్యలోటు...
తాజా జీడీపీ గణాంకాల నేపథ్యంలో మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.6 శాతంగా నమోదయ్యింది. నిజానికి ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు 3.8 శాతం దాటకూడదని సవరిత అంచనాలు నిర్దేశిస్తున్నాయి. సవరించకముందు ఇది ఇంకా తక్కువగా 3.3 శాతంగానే ఉంది. రెవెన్యూ అంచనాల మేర లేకపోవడం మొత్తం ద్రవ్యలోటుపై చివరకు తీవ్ర ప్రభావమే చూపిందని చెప్పవచ్చు. రెవెన్యూలోటు కేవలం 2.4 శాతమే (జీడీపీ విలువలో) ఉండాలని భావిస్తే, ఇది తాజా లెక్కల ప్రకారం 3.27 శాతానికి చేరింది.
జీడీపీ... జీవీఏ అంటే...
గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ): ఉత్పత్తిదారులు లేదా సరఫరాల వైపు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం, లేదా త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత ఎలా ఉందన్న అంశాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి ఈ విధానం దోహదపడుతుంది.
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ): వినియోగదారులు లేదా డిమాండ్ వైపు నుంచి ఆర్థిక వ్యవస్థ పనితీరును చూపిస్తుంది. దేశంలో వార్షికంగా లేదా త్రైమాసిక పరంగా జరిగే (పూర్తి స్థాయిలో) మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి విలువ ఇది. జీడీపీని ఫ్యాకర్ కాస్ట్‌లో అలాగే మార్కెట్ ప్రైస్‌లో చూస్తారు. జీడీపీ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నమాటే. మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ ప్రభుత్వ పన్నులు, సబ్సిడీలు కూడా గమనంలోకి వస్తాయి. జీడీపీలో కూడా నామినల్ – రియల్ అని 2 రకాలు. ద్రవ్యోల్బణం లెక్కలతో పనిలేకుండా, ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని లెక్కిం చే ది నామినల్ జీడీపీ. అయితే, ఒక బేస్ సంవత్సరం గా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కించేదే రియల్ జీడీపీ. మనం అనుసరించేది దీన్నే.
Comments
Please login to add a commentAdd a comment