విప్రో లాభం రూ.2,345 కోట్లు | Wipro net profit rises to Rs 9772 crore in FY20 | Sakshi
Sakshi News home page

విప్రో లాభం రూ.2,345 కోట్లు

Published Thu, Apr 16 2020 5:06 AM | Last Updated on Thu, Apr 16 2020 5:11 AM

Wipro net profit rises to Rs 9772 crore in FY20 - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.2,345 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం రూ.2,494 కోట్లతో పోలిస్తే 4 శాతం క్షీణించిందని పేర్కొంది. ఆదాయం మాత్రం రూ.15,600 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.15,711 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ.9.772 కోట్లకు, ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.61,023 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది.  

కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొందని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని విప్రో పేర్కొంది. వ్యాపార స్థితిగతుల స్పష్టత  మెరుగుపడ్డాక ఆదాయ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది.  ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి తుది డివిడెండ్‌ను ప్రకటించలేదు. జనవరిలో ప్రకటించిన రూ. 1 మధ్యంతర డివిడెండ్‌... తుది డివిడెండ్‌ కానున్నది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ కంపెనీ రూ. 1 డివిడెండ్‌ను ఇచ్చినట్లు లెక్క. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో విప్రో షేర్‌ 1.5 శాతం నష్టంతో రూ. 186 వద్ద ముగిసింది.

వ్యయ నియంత్రణ చర్యలు..  
కష్టకాలంలో వ్యయాలను నియంత్రణలో ఉంచుకునేందుకు ’అన్ని అవకాశాలు’ పరిశీలిస్తున్నట్లు విప్రో సీఎఫ్‌వో జతిన్‌ దలాల్‌ తెలిపారు. కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల  గత 15 రోజుల్లోనే వ్యాపారం 0.7–0.8% దెబ్బతిన్నట్లు వివరించారు. కొందరు సిబ్బందికి సెలవులు లేదా ఫర్లోపై పంపడం(వేతనం లేని సెలవులు) వంటి అంశాలు పరిశీలించవచ్చని పేర్కొన్నారు.

మరిన్ని ఆర్డర్లు సాధిస్తాం..
ప్రస్తుత పరిస్థితులు కనీవిని ఎరుగనివి. ప్రాజెక్ట్‌లు అమలు చేయగల సత్తా, విస్తృతమైన ఐటీ సర్వీసుల కారణంగా మరిన్ని ఆర్డర్లు సాధించగల సత్తా మాకుంది.
–అబిదాలీ నీముచ్‌వాలా, విప్రో సీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement