Abidali Neemuchwala
-
విప్రో లాభం రూ.2,345 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.2,345 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం రూ.2,494 కోట్లతో పోలిస్తే 4 శాతం క్షీణించిందని పేర్కొంది. ఆదాయం మాత్రం రూ.15,600 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.15,711 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ.9.772 కోట్లకు, ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.61,023 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొందని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని విప్రో పేర్కొంది. వ్యాపార స్థితిగతుల స్పష్టత మెరుగుపడ్డాక ఆదాయ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి తుది డివిడెండ్‌ను ప్రకటించలేదు. జనవరిలో ప్రకటించిన రూ. 1 మధ్యంతర డివిడెండ్... తుది డివిడెండ్ కానున్నది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ కంపెనీ రూ. 1 డివిడెండ్‌ను ఇచ్చినట్లు లెక్క. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో విప్రో షేర్ 1.5 శాతం నష్టంతో రూ. 186 వద్ద ముగిసింది. వ్యయ నియంత్రణ చర్యలు.. కష్టకాలంలో వ్యయాలను నియంత్రణలో ఉంచుకునేందుకు ’అన్ని అవకాశాలు’ పరిశీలిస్తున్నట్లు విప్రో సీఎఫ్‌వో జతిన్ దలాల్ తెలిపారు. కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల గత 15 రోజుల్లోనే వ్యాపారం 0.7–0.8% దెబ్బతిన్నట్లు వివరించారు. కొందరు సిబ్బందికి సెలవులు లేదా ఫర్లోపై పంపడం(వేతనం లేని సెలవులు) వంటి అంశాలు పరిశీలించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని ఆర్డర్లు సాధిస్తాం.. ప్రస్తుత పరిస్థితులు కనీవిని ఎరుగనివి. ప్రాజెక్ట్‌లు అమలు చేయగల సత్తా, విస్తృతమైన ఐటీ సర్వీసుల కారణంగా మరిన్ని ఆర్డర్లు సాధించగల సత్తా మాకుంది. –అబిదాలీ నీముచ్వాలా, విప్రో సీఈఓ -
విప్రోకు అబిదాలి నీమూచ్‌వాలా గుడ్‌బై
సాక్షి, బెంగళూరు: దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో సంస్థ సీఈవో, ఎండీ అబిదాలి జెడ్ నీమూచ్‌వాలా తన పదవులకు రాజీనామా చేశారు. కుటుంబ వ్యవహారాలు, ఇతర కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్రో సంస్థ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే నూతన సీఈవో నియామకం జరిగే వరకూ అబిదాలి సీఈవోగా కొనసాగనున్నారు. ‘75 సంవత్సరాల గొప్ప వారసత్వం కలిగిన విప్రో సంస్థకు సేవ చేయడం గౌరవంగా భావిస్తానని అబిదాలి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. (విప్రో లాభం రూ.2,456 కోట్లు) కాగా మాజీ టీసీఎస్ సీనియర్ ఉద్యోగి అయిన నీముచ్వాలా 2015 ఏప్రిల్1న విప్రో సీవోవోగా ఆ తర్వాత ఏడాది సీఈవోగా నియమితులయ్యారు. ఇక అబిదాలి రాజీనామాపై విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్పందిస్తూ ‘అబిద్’ విప్రోకు చేసిన కృషికి కృతజ్ఞతలు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
విప్రో లాభం 35% జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం 35% ఎగిసింది. రూ. 2,553 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ లాభం రూ.1,889 కోట్లు. మరోవైపు, సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ.15,203 కోట్ల నుంచి రూ.15,875 కోట్లకు పెరిగింది. మూడో క్వార్టర్లో 2,106 మిలియన్ డాలర్ల అంచనా.. సీక్వెన్షియల్ ప్రాతిపదికన డిసెంబర్ త్రైమాసికానికి ఐటీ సేవల విభాగం ఆదాయ వృద్ధి 0.8–2.8 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు విప్రో గైడెన్స్ ప్రకటించింది. ఈ విభాగం నుంచి 2,065–2,106 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగలదని భావిస్తున్నట్లు వివరించింది. రెండో త్రైమాసికంలో ఐటీ సేవల విభాగం ఆదాయం 2,049 మిలియన్ డాలర్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన ఇది 2.5 శాతం వృద్ధి చెందినట్లు సంస్థ పేర్కొంది. ఐటీ సేవల విభాగం నిర్వహణ మార్జిన్ 18.1 శాతం పెరిగింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32.31 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రక్రియను పూర్తి చేసినట్లు విప్రో తెలిపింది. ఇందుకోసం రూ. 10,500 కోట్లు వెచ్చించినట్లు వివరించింది. మరోవైపు, 5జీ టెలికం సేవలు అందించడానికి సంబంధించి ఆపరేటర్లు, ఇతరత్రా కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌ను రూపొందించేందుకు విప్రోతో చేతులు కలిపినట్లు టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. ఆపరేటర్లు తమ పెట్టుబడులపై గరిష్ట ప్రయోజనాలు పొందేలా తోడ్పడేందుకు 5జీ వినియోగాలపై తమ బెంగళూరు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ‘వృద్ధి సాధనకు ప్రాధాన్యమివ్వడం కొనసాగుతుంది. భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులు కొనసాగుతాయి. షేర్ల బైబ్యాక్ సెప్టెంబర్‌లో పూర్తయ్యింది. ఇన్వెస్టర్ల నుంచి దీనికి మంచి స్పందన వచ్చింది‘ అని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. ►సీక్వెన్షియల్‌గా చూస్తే డిజిటల్ విభాగం ఆదాయం ఏడు శాతం, వార్షికంగా 29 శాతం మేర వృద్ధి చెందింది. మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 39.6 శాతంగా ఉంది. ►క్యూ2లో కొత్తగా 57 సంస్థలు క్లయింట్లుగా జతయ్యాయి. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 1,027కి చేరింది. ►ఐటీ సేవల విభాగంలో సీక్వెన్షియల్‌గా 6,603 మంది టెకీలు చేరారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 1,81,453కి చేరింది. విప్రో షేరు మంగళవారం బీఎస్ఈలో స్వల్పంగా పెరిగి రూ. 243.70 వద్ద క్లోజయ్యింది. ఆదాయాలు, మార్జిన్లపరంగా రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగాం. వార్షిక ప్రాతిపదికన మొత్తం 7 విభాగాల్లో 6 విభాగాలు వృద్ధి నమోదు చేయగలిగాయి. కొన్ని రంగాల్లో అనిశ్చితి ప్రభావాలు కొనసాగుతున్నప్పటికీ ఐటీ సేవలకు డిమాండ్‌లో పెద్దగా మార్పు లేదు. కెనడా, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలతో పాటు కీలకమైన అమెరికా, బ్రిటన్ మార్కెట్లలో కూడా డీల్స్ దక్కించుకోగలుగుతున్నాం. అంతర్జాతీయంగా అందిస్తున్న సేవలు భారతీయ కస్టమర్లకు అందించే వ్యూహాల్లో భాగంగా భారత్‌లో ఒక క్లయింఊట్తో భారీ డీల్ కుదుర్చుకున్నాం. క్యూ1 తో పోలిస్తే క్యూ2లో ఆర్డర్ బుక్ మరింత మెరుగుపడింది. భారత్, మధ్యప్రాచ్య దేశాల్లో కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోంది. ఐసీఐసీఐ వంటి కొన్ని డీల్స్ ఇలాంటి వ్యూహాల్లో భాగమే. – అబిదాలి నీముచ్వాలా, విప్రో సీఈఓ -
విప్రో సీఈవో జీతం పెరిగిందట
న్యూఢిల్లీ : బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో సీఈవో అబిద్ అలీ నీముచ్ వాలా వార్షిక వేతనం పెరిగిందట. ఆయన ఈ ఏడాది అక్షరాల రూ.12.04 కోట్ల వేతనం పొందుతున్నారట. ఈ వేతనం అంతకముందు మాజీ సీఈవో టీకే కురియన్ కంటే ఎక్కువట. నీముచ్ వాలా బేసిక్ జీతం, అలవెన్స్ కింద రూ.5,75,85,354, కమిషన్ అండ్ వేరియబుల్ చెల్లింపుల కింద రూ.2,35,42,334లు ఇతర చెల్లింపుల కింద రూ. 3,85,51,290లు దీర్ఘకాలిక పరిహారం కింద రూ.14,22,140లను ఈ ఏడాది అందుకుంటున్నారని రెగ్యులేటరీకి విప్రో నివేదించింది. ఈ ఏడాది ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ప్యాకేజీ సైతం రూ.48.73 కోట్లకు ఎగిసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా టీసీఎస్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ జీతం సైతం రూ.25.6 కోట్లకు పెరిగి, అదనంగా స్పెషల్ బోనస్ రూ.10 కోట్లను అందుకుంటున్నారు. 2015లో గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నీముచ్ వాలా విప్రోలో చేరారు. 2016 మార్చి ఆర్థికసంవత్సరం ముగిసిన సందర్భంగా నీముచ్ వాలా 200,000 స్టాక్ అప్షన్లను పొందారు. ప్రస్తుతం విప్రో షేరు ధర రూ.545.90గా ఉంది. ఈ స్టాక్ విలువ దాదాపు రూ.10.9 కోట్లు. విప్రో మాజీ సీఈవో, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టీకే కురియన్ ప్రస్తుతం రూ.21 కోట్ల వేతనం పొందుతున్నారు. -
విప్రో సీఈవోగా అబిద్ అలీ
న్యూఢిల్లీ: దిగ్గజ టెక్నాలజీ కంపెనీ విప్రో సీఈవోగా అబిద్ అలీ నీముచ్వాలా నియమితులయ్యారు. ఇంతవరకు కంపెనీ సీఈవోగా వ్యవహరించిన టీకే కురియన్ విప్రో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు. వీరిద్దరూ వచ్చే నెల నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఐదే ళ్ల నుంచి విప్రో సంస్థ నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్ కంపెనీగా రూపాంతరం చెందుతూ వస్తోందని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తెలిపారు. కస్టమర్లతో బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ, కొత్త టెక్నాలజీ గమ్యాల రూపకల్పన ద్వారా కంపెనీ వృద్ధిలో బాటలో పయనించడానికి కురియన్ కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. డిజిటల్, ఆటోమేషన్ వంటి నూతన టెక్నాలజీని వినియోగదారులకు అందించడంలో కొత్త నియామక చర్య కంపెనీకి దోహదపడుతుందని విశ్వసించారు. టీసీఎస్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత గతేడాది ఏప్రిల్ నుంచి నీముచ్వాలా విప్రోలో తన కెరీర్‌ను గ్రూప్ ప్రెసిడెంట్, సీవోవో స్థాయి నుంచి ప్రారంభించారు. ఈయన గ్లోబల్ ఇన్ఫ్రా సర్వీసెస్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెసింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ వంటి సర్వీసెస్ లైన్స్ హెడ్‌గా ఉన్నారు. ‘టెక్నాలజీ మీదున్న పట్టు, వ్యాపార దార్శనీయకత, సరైన ఎంపికా సామర్థ్యం, కస్టమర్లు/ఉద్యోగులను ఐక్యం చేసే నేర్పు వంటి ప్రత్యేకతలు నీముచ్వాలాలో ఉన్నాయని, ఆయనే కంపెనీ నాయకుడి బాధ్యతలకు సరైన వ్యక్తి’ అని కురియన్ తెలిపారు.