విప్రో సీఈవోగా అబిద్ అలీ
న్యూఢిల్లీ: దిగ్గజ టెక్నాలజీ కంపెనీ విప్రో సీఈవోగా అబిద్ అలీ నీముచ్‌వాలా నియమితులయ్యారు. ఇంతవరకు కంపెనీ సీఈవోగా వ్యవహరించిన టీకే కురియన్ విప్రో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు. వీరిద్దరూ వచ్చే నెల నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఐదే ళ్ల నుంచి విప్రో సంస్థ నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్ కంపెనీగా రూపాంతరం చెందుతూ వస్తోందని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తెలిపారు. కస్టమర్లతో బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ, కొత్త టెక్నాలజీ గమ్యాల రూపకల్పన ద్వారా కంపెనీ వృద్ధిలో బాటలో పయనించడానికి కురియన్ కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
డిజిటల్, ఆటోమేషన్ వంటి నూతన టెక్నాలజీని వినియోగదారులకు అందించడంలో కొత్త నియామక చర్య కంపెనీకి దోహదపడుతుందని విశ్వసించారు. టీసీఎస్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత గతేడాది ఏప్రిల్ నుంచి నీముచ్‌వాలా విప్రోలో తన కెరీర్‌ను గ్రూప్ ప్రెసిడెంట్, సీవోవో స్థాయి నుంచి ప్రారంభించారు.
ఈయన గ్లోబల్ ఇన్‌ఫ్రా సర్వీసెస్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెసింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ వంటి సర్వీసెస్ లైన్స్ హెడ్‌గా ఉన్నారు. ‘టెక్నాలజీ మీదున్న పట్టు, వ్యాపార దార్శనీయకత, సరైన ఎంపికా సామర్థ్యం, కస్టమర్లు/ఉద్యోగులను ఐక్యం చేసే నేర్పు వంటి ప్రత్యేకతలు నీముచ్‌వాలాలో ఉన్నాయని, ఆయనే కంపెనీ నాయకుడి బాధ్యతలకు సరైన వ్యక్తి’ అని కురియన్ తెలిపారు.