Consolidated revenue
-
వేదాంతా లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెప్టెంబర్)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 4,615 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 838 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,758 కోట్ల నుంచి రూ. 31,074 కోట్లకు జంప్ చేసింది. అధిక కమోడిటీ ధరలు, బలపడిన మార్జిన్లు, వివిధ విభాగాల అమ్మకాల్లో వృద్ధి కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదం చేశాయి. క్యూ2లో రూ. 7,232 కోట్లమేర నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు వేదాంతా సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 18.5 చొప్పున బోర్డు మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 304 వద్ద ముగిసింది. -
బీఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం దాదాపు 2 శాతం నీరసించి రూ. 18,595 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 18,907 కోట్ల ఆదాయం సాధించింది. మార్చికల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 59,140 కోట్ల నుంచి రూ. 51,687 కోట్లకు వెనకడుగు వేసింది. కంపెనీ నికర రుణ భారం రూ. 21,675 కోట్ల నుంచి రూ. 27,034 కోట్లకు పెరిగింది. -
విప్రో లాభం రూ.2,345 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.2,345 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం రూ.2,494 కోట్లతో పోలిస్తే 4 శాతం క్షీణించిందని పేర్కొంది. ఆదాయం మాత్రం రూ.15,600 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.15,711 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ.9.772 కోట్లకు, ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.61,023 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొందని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని విప్రో పేర్కొంది. వ్యాపార స్థితిగతుల స్పష్టత మెరుగుపడ్డాక ఆదాయ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి తుది డివిడెండ్‌ను ప్రకటించలేదు. జనవరిలో ప్రకటించిన రూ. 1 మధ్యంతర డివిడెండ్... తుది డివిడెండ్ కానున్నది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ కంపెనీ రూ. 1 డివిడెండ్‌ను ఇచ్చినట్లు లెక్క. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో విప్రో షేర్ 1.5 శాతం నష్టంతో రూ. 186 వద్ద ముగిసింది. వ్యయ నియంత్రణ చర్యలు.. కష్టకాలంలో వ్యయాలను నియంత్రణలో ఉంచుకునేందుకు ’అన్ని అవకాశాలు’ పరిశీలిస్తున్నట్లు విప్రో సీఎఫ్‌వో జతిన్ దలాల్ తెలిపారు. కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల గత 15 రోజుల్లోనే వ్యాపారం 0.7–0.8% దెబ్బతిన్నట్లు వివరించారు. కొందరు సిబ్బందికి సెలవులు లేదా ఫర్లోపై పంపడం(వేతనం లేని సెలవులు) వంటి అంశాలు పరిశీలించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని ఆర్డర్లు సాధిస్తాం.. ప్రస్తుత పరిస్థితులు కనీవిని ఎరుగనివి. ప్రాజెక్ట్‌లు అమలు చేయగల సత్తా, విస్తృతమైన ఐటీ సర్వీసుల కారణంగా మరిన్ని ఆర్డర్లు సాధించగల సత్తా మాకుంది. –అబిదాలీ నీముచ్వాలా, విప్రో సీఈఓ -
ఎయిర్టెల్ లాభం జూమ్
⇒ క్యూ4లో 30 శాతం వృద్ధి; రూ.1,255 కోట్లు ⇒ డేటా ఆదాయాల జోరు ఆసరా... న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్టెల్ గతేడాది చివరి త్రైమాసికం(2014-15, క్యూ4)లో రూ.1,255 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.962 కోట్లతో పోలిస్తే లాభం 30 శాతం ఎగబాకింది. ప్రధానంగా భారీ సంఖ్యలో కొత్త యూజర్లు... మొబైల్ డేటా ఆదాయాలు పుంజుకోవడంతో కంపెనీ లాభాల జోరుకు దోహదం చేసింది. ఇక ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ4లో 3.6 శాతం వృద్ధితో రూ.23,016 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.22,219 కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి...: గడచిన 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎయిర్టెల్ నికర లాభం 87 శాతం దూసుకెళ్లి రూ.5,183 కోట్లకు ఎగసింది. 2013-14లో లాభం రూ.2,773 కోట్లే. మొత్తం ఆదాయం 7.3 శాతం వృద్ధి చెంది రూ.85,746 కోట్ల నుంచి రూ.92,039 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయ వృద్ధి విషయంలో మెరుగైన పనితీరును సాధించామని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. డేటా జోష్... మొబైల్ కస్టమర్ల నుంచి డేటా వినియోగం గణనీయంగా పెరగడంతో కంపెనీ క్యూ4 డేటా ఆదాయం(కన్సాలిడేటెడ్) 59.1% ఎగబాకి రూ.3,085 కోట్లుగా నమోదైంది. ఇక ఒక్క భారత్‌లో చూస్తే ఈ ఆదాయం 70.4% దూసుకెళ్లి రూ.2,324 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ సగటు డేటా ఆదాయం(ఏఆర్పీయూ) మార్చి క్వార్టర్లో రూ.43 పెరిగా రూ.176గా నమోదైంది. మార్చి చివరి నాటికి ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ రుణ భారం 10.68 బిలియన్ డాలర్లకు(రూ.66,800 కోట్లు) చేరింది. కాగా, 2014-15లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదిక మొత్తం రూ.18,668 కోట్ల పెట్టుబడులను కంపెనీ వెచ్చించింది. ఆఫ్రికా కార్యకలాపాలపై క్యూ4లో నికర నష్టాలు 10.5 కోట్ల డాలర్ల నుంచి రూ.18.3 కోట్ల డాలర్లకు చేరాయి. రూ. ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.2.22 చొప్పున తేది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం ఎయిర్టెల్ షేరు ధర బీఎస్ఈలో 2.26 శాతం ఎగసి రూ.401 వద్ద ముగిసింది. ఒకానొకదశలో రూ.409 గరిష్టాన్ని కూడా తాకింది.