ఎయిర్‌టెల్ లాభం జూమ్
⇒ క్యూ4లో 30 శాతం వృద్ధి; రూ.1,255 కోట్లు
⇒ డేటా ఆదాయాల జోరు ఆసరా...
న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్ గతేడాది చివరి త్రైమాసికం(2014-15, క్యూ4)లో రూ.1,255 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.962 కోట్లతో పోలిస్తే లాభం 30 శాతం ఎగబాకింది. ప్రధానంగా భారీ సంఖ్యలో కొత్త యూజర్లు... మొబైల్ డేటా ఆదాయాలు పుంజుకోవడంతో కంపెనీ లాభాల జోరుకు దోహదం చేసింది.
ఇక ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ4లో 3.6 శాతం వృద్ధితో రూ.23,016 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.22,219 కోట్లుగా ఉంది.
పూర్తి ఏడాదికి...: గడచిన 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌టెల్ నికర లాభం 87 శాతం దూసుకెళ్లి రూ.5,183 కోట్లకు ఎగసింది. 2013-14లో లాభం రూ.2,773 కోట్లే. మొత్తం ఆదాయం 7.3 శాతం వృద్ధి చెంది రూ.85,746 కోట్ల నుంచి రూ.92,039 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయ వృద్ధి విషయంలో మెరుగైన పనితీరును సాధించామని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.
డేటా జోష్...
మొబైల్ కస్టమర్ల నుంచి డేటా వినియోగం గణనీయంగా పెరగడంతో కంపెనీ క్యూ4 డేటా ఆదాయం(కన్సాలిడేటెడ్) 59.1% ఎగబాకి రూ.3,085 కోట్లుగా నమోదైంది. ఇక ఒక్క భారత్‌లో చూస్తే ఈ ఆదాయం 70.4% దూసుకెళ్లి రూ.2,324 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ సగటు డేటా ఆదాయం(ఏఆర్‌పీయూ) మార్చి క్వార్టర్‌లో రూ.43 పెరిగా రూ.176గా నమోదైంది. మార్చి చివరి నాటికి ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ రుణ భారం 10.68 బిలియన్ డాలర్లకు(రూ.66,800 కోట్లు) చేరింది.
కాగా, 2014-15లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదిక మొత్తం రూ.18,668 కోట్ల పెట్టుబడులను కంపెనీ వెచ్చించింది. ఆఫ్రికా కార్యకలాపాలపై క్యూ4లో నికర నష్టాలు 10.5 కోట్ల డాలర్ల నుంచి రూ.18.3 కోట్ల డాలర్లకు చేరాయి. రూ. ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.2.22 చొప్పున తేది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.
ఫలితాల నేపథ్యంలో మంగళవారం ఎయిర్‌టెల్ షేరు ధర బీఎస్‌ఈలో 2.26 శాతం ఎగసి రూ.401 వద్ద ముగిసింది. ఒకానొకదశలో రూ.409 గరిష్టాన్ని కూడా తాకింది.