జియో దెబ్బ: ప్రత్యర్థులు మరింత కుదేలు
జియో దెబ్బ: ప్రత్యర్థులు మరింత కుదేలు
Published Mon, Feb 20 2017 11:24 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM
జియో దెబ్బకు మేజర్ టెలికాం రంగ దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక్కసారిగా మూడో క్వార్టర్లో భారీగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో క్వార్టర్లోనూ ఈ దిగ్గజాలకు పరిస్థితి ఇదే మాదిరే ఉంటుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్లు కొనసాగించినంత వరకు టెలికాం దిగ్గజాలు మార్జిన్లకు భారీగానే గండికొడుతూ ఉంటుందని పేర్కొన్నారు.
ఎప్పుడైతే జియో తన ఉచిత ఆఫర్లను విత్ డ్రా చేసుకుని, డేటా సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తుందో అప్పటినుంచి టెలికాం దిగ్గజాల పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని టెలికాం ఇండస్ట్రి ప్రాక్టిస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా అర్పితా పాల్ అగర్వాల్ చెప్పారు. 2016 సెప్టెంబర్ నుంచి వెల్ కమ్ ఆఫర్ కింద జియో ఉచిత ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. అనంతరం డిసెంబర్లో జియో తమ ఉచిత డేటా ఆఫర్లను 2017 మార్చి వరకు పొడిగిస్తున్నామని పేర్కొంది. దీంతో టెలికాం దిగ్గజాలు రెవెన్యూలు భారీగా కోల్పోతున్నాయి.
భారతీ ఎయిర్ టెల్ 55 శాతం, ఐడియా సెల్యులార్ రూ.478.9కోట్లను, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ.531 కోట్ల నష్టాలను నమోదుచేశాయి. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో దోపిడీ ధరల విధానం వల్లనే తాము రెవెన్యూలను భారీగా కోల్పోతున్నామని టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ల దూకుడే టెలికాం కంపెనీలకు భారీగా దెబ్బకొడుతుందనే దానికి ఎలాంటి సందేహం లేదని టెలికాం కన్సల్టెన్సీకి చెందిన ఓ సంస్థ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ చెప్పారు. ధరల విధానంపై భారత మార్కెట్ ఆధారపడి ఉంటుందని, అలాంటి ఆఫర్లు మార్కెట్ లో విధ్వంసం సృష్టించేలా ఉన్నాయని గార్టనర్ టెలికాం బిజినెస్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్టు రిషి తేజ్ పాల్ చెప్పారు.
Advertisement
Advertisement