cut salaries
-
ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులకు పాక్ ప్రభుత్వం షాక్! భారీగా కోత?
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమి ట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వోద్యోగుల జీతభత్యాల్లో 10 శాతం కోత పెట్టాలని యోచిస్తోందట! మంత్రుల ఖర్చులను 15 శాతం తగ్గించాలని, స్వతంత్ర మంత్రులు, సహాయక మంత్రులు, సలహాదారులను 78 నుంచి 30కి కుదించాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏర్పాటుచేసిన జాతీయ వ్యయ నియంత్రణ కమిటీ యోచిస్తోంది. ఈ మేరకు ప్రధానికి తుది నివేదిక ఇవ్వనుందని జియో న్యూస్ కథనం పేర్కొంది. -
కోతలు తప్పవు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 10 బిలియన్ డాలర్ల విలువను అందుకున్న అతిపెద్ద హోటల్ చెయిన్ ఓయో... కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా 60 శాతం ఆదాయాన్ని కోల్పోయింది. నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించటంతో పాటు వేతనాల్లోనూ భారీగా కోతలు పెడుతున్నట్లు ‘ఓయో హోటల్స్ అండ్ హోమ్స్’ ఇండియా, దక్షిణాసియా సీఈవో రోహిత్ కపూర్ చెప్పారు. మరో నాలుగు నెలల పాటు ఇబ్బందులు తప్పవన్నారు. లాక్డౌన్ తీసేసినా.. గతంలో మాదిరి కస్టమర్లు అత్యవసరం కాని ప్రయాణాలు చేయరని, విలాసాలకు దూరంగా ఉంటారని, దీంతో హోటల్స్ ఆక్యుపెన్సీ తగ్గుతుందని చెప్పారాయన. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. కరోనా ప్రభావం ఓయోపై ఏ మేరకు ఉంది? ప్రపంచ వ్యాప్తంగా ఆతిథ్య రంగం పీకల్లోతు కష్టాల్లో పడింది. దీనికి ఓయో మినహాయింపేమీ కాదు. ఆక్యుపెన్సీ పడిపోయి ఆదాయం 50–60 శాతం క్షీణించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవటం మినహా చేసేదేమీ లేదు. జూన్ నాటికి నెలవారీ ఖర్చుల్ని రూ.300 కోట్ల నుంచి రూ.185 కోట్ల స్థాయికి తగ్గించనున్నాం. కరోనా తర్వాత చైనాలో ఆతిథ్య రంగం కోలుకున్న సంకేతాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇదే సానుకూలత ఉంటుందని ఆశిస్తున్నాం. ఉద్యోగుల తొలగింపులు, వేతనాల్లో కోతలు ఎలా ఉన్నాయి? రెగ్యులర్ ఆదాయం లేకుంటే ఏ కంపెనీ అయినా మొదట చేసేది నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవటమే. ప్రపంచ వ్యాప్తంగా ఓయోలో 17 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 8 వేల మంది ఇండియా, దక్షిణాసియాలో ఉన్నారు. పెద్ద స్థాయి ఉద్యోగులకు 25–50 శాతం, మిగతా ఉద్యోగులకు 25 శాతం జీతాల్లో కోత వేశాం. కొందరు ఉద్యోగులకు సెలవులిచ్చాం. వారికి జీతాల్లేకుండా వైద్య బీమా, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి అందిస్తాం. మరో నాలుగు నెలల పాటు ఇవి కొనసాగుతాయి. కరోనా కంటే ముందు ఇండియాలో 550 నగరాల్లో సేవలందించిన ఓయో.. ఇపుడు 400 నగరాలకు పరిమితమైంది. ఓయోతో ఒప్పందం చేసుకున్న హోటల్స్ పార్టనర్స్ సంగతేంటి? ఓయోలో అమెరికా, చైనా, మలేíసియా, ఇండోనేసియా, నేపాల్ వంటి 80 దేశాల్లో 43 వేల హోటల్స్, 10 లక్షల రూమ్స్ ఉన్నాయి. మన దేశంలో 18 వేల హోటల్స్, 2.70 లక్షల గదులున్నాయి. మా హోటల్స్ పార్ట్నర్స్కు ఓయో సంబంధ్ పేరిట ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తున్నాం. ఓయోను ఎంఎస్ఎంఈ కింద పరిగణించాలని కేంద్రాన్ని కోరారు... ఎందుకు? కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఆతిథ్య రంగానికి చిల్లిగవ్వ కూడా లేదు. లాక్డౌన్ ఎత్తేశాక.. హోటల్స్‌కు వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఉంటుంది కదా? అందుకే ఓయో పార్టనర్ హోటల్స్, స్టార్టప్స్‌లను కూడా ఎంఎస్ఎంఈ విభాగంలోకి తెస్తే వారికి పూచీకత్తు లేని రుణాలు, తక్కువ వడ్డీ రేట్లు వంటి ప్రయోజనాలు అందుతాయనేది నా ఉద్దేశం. లాక్డౌన్ తర్వాత ఓయో హోటల్స్ ఎలా ఉండొచ్చు? పరిశుభ్రత, భద్రత, భౌతిక దూరం అనేవి ఓయో హోటల్స్ నిబంధనల్లో అతిముఖ్యమైనవిగా మారతాయి. రాబడి, వ్యయాల ఆడిట్లో వీటికీ చోటుంటుంది. ఈ నెలాఖరు నాటికి వెయ్యి హోటళ్లను, లాక్డౌన్ ఎత్తేశాక దేశంలోని 18 వేల హోటల్స్‌ను శానిటైజ్ చేస్తాం. ఇక నుంచి ఓయో ప్లాట్‌ఫ్లామ్‌లో ధర, వసతులతో పాటూ శానిటైజ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు రూమ్ డైనింగ్కే ప్రాధాన్యమిస్తాం. ఉద్యోగులకు, కస్టమర్లందరికీ హెల్త్ స్క్రీనింగ్ చేశాకే లోపలికి అనుమతి ఉంటుంది. వృద్ధులు, వికలాంగ కస్టమర్లు మినహా ఎవరి లగేజీని వాళ్లే లోపలికి తెచ్చుకోవాలి. ఇన్వెస్టర్లతో మీ సంబంధాలెలా ఉన్నాయి? ఓయోలో జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు 42% వాటా ఉంది. గ్రీన్ఓక్స్ క్యాపిటల్, సెకోయా ఇండియా, లైట్ స్పీడ్ ఇండియా, హీరో ఎంటర్ప్రైజ్, ఎయిర్ బీఎన్బీ, చైనా లాడ్జింగ్ గ్రూప్‌లకూ వాటాలున్నాయి. బోర్డ్ సభ్యులందరితో కలిసి పనిచేస్తున్నాం. తాజాగా అమెరికాకు చెందిన కాఫీ హౌజ్ కంపెనీ స్టార్‌బక్స్ మాజీ సీఓఓ ట్రాయ్ ఆల్స్టీడ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ బెట్సీ ఆట్కిన్స్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా బోర్డ్లోకి వచ్చారు. ఓయోపై నమ్మకం, సంస్థ సామర్థ్యం పెరగటానికి వీరి సేవలు ఉపయోగపడతాయి. -
కరోనాపై పోరులో రాష్ట్రపతి సాయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి తనవంతు సాయం అందించడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ ముందుకొచ్చారు. తన వేతనంలో ఏడాది పాటు 30 శాతం కోత విధించుకోవాలని నిర్ణయించారు. ఖర్చులకు కళ్లెం వేయడానికి పలు దేశీయ యాత్రలు, ఇతర కార్యక్రమాలను రాష్ట్రపతి గణనీయంగా తగ్గించుకుంటారు. పరిమిత సంఖ్యలోనే అతిథులు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ తాజా నిర్ణయాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ బడ్జెట్ 20 శాతం తగ్గుతుందని అంచనా. రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర బడ్జెట్‌కు ప్రతిఏటా రూ.200 కోట్లకుపైగా కేటాయిస్తారు. ఈసారి ఇందులో రూ.40–45 కోట్లు మిగలనున్నాయి. రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎట్ హోమ్, స్టేట్ బాంక్వెట్స్ వంటి కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించనున్నారు. వడ్డించే ఆహార పదార్థాల సంఖ్యను కుదిస్తారు. అలంకరణకు తక్కువ పుష్పాలు వాడనున్నారు. సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలకు ఉపయోగించే లిమోసిన్ కారు(ధర రూ.10 కోట్లు) కొనుగోలుకు ఈసారి దూరంగా ఉండాలని రాష్ట్రపతి నిర్ణయించారు. విద్యుత్, ఇంధన వ్యయాన్ని తగ్గించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని కార్యాలయాలను పర్యావరణ హితంగా మారుస్తారు. కాగితం వాడకాన్ని భారీగా తగ్గిస్తారు. పీఏం–కేర్స్ ఫండ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి నెలలో తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ లాభం 39 శాతండౌన్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 39 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.10,362 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,348 కోట్లకు తగ్గిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. గత మూడేళ్లలో ఇదే అత్యల్ప త్రైమాసిక లాభం. సీక్వెన్షియల్‌గా చూస్తే, (గత క్యూ3లో నికర లాభం రూ.11,640 కోట్లు) 45 శాతం తగ్గిందని పేర్కొంది. ఇంధన, పెట్రో కెమికల్స్ వ్యాపారాలు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ముడి చమురు ధరలు తగ్గడం, డిమాండ్ పడిపోవడంతో రూ.4,267 కోట్ల అసాధారణ నష్టాలు నికర లాభంపై ప్రభావం చూపించాయని వెల్లడించింది. అయితే టెలికం విభాగం, రిలయన్స్ జియో ఫలితాలు బాగా ఉండటంతో లాభ క్షీణత తగ్గిందని తెలిపింది. కార్యకలాపాల ఆదాయం 2 శాతం క్షీణించి రూ.1,36,240 కోట్లకు చేరిందని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయం 11 శాతం తగ్గిందని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.6.50 డివిడెండ్‌ను ప్రకటించింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు.... ► స్థూల రిఫైనరీ మార్జిన్(జీఆర్ఎమ్) 8.9 డాలర్లుగా ఉంది. ► కరోనా వైరస్ కల్లోలం ఇంధన, పెట్రో రసాయనాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. ► చమురు–గ్యాస్ వ్యాపారంలో రూ.485 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► రిలయన్స్ రిటైల్ స్థూల లాభం 20% వృద్ధితో రూ.2,062 కోట్లకు పెరిగింది. అనుకున్న దానికంటే ముందుగానే రుణ రహిత కంపెనీ... వచ్చే ఏడాది మార్చి కల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత కంపెనీగా నిలపాలన్న ముకేశ్ లక్ష్యం ముందే సాధించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. మొత్తం రూ.1.04 లక్షల కోట్ల నిధుల సమీకరణ ప్రయత్నాలను ఈ ఏడాది జూన్‌కల్లా పూర్తి చేయాలని కంపెనీ బావిస్తోంది. రూ.53.125 కోట్ల రైట్స్ ఇష్యూతో పాటు జియోలో ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేయనున్న రూ.43,574 కోట్లు, ఇంధన రిటైల్ విభాగంలో 49% వాటాను బ్రిటిష్ పెట్రోలియమ్ రూ.7,000 కోట్లకు విక్రయించడం.... ఈ జాబితాలో ఉన్నాయి. ఫేస్‌బుక్‌లాగానే ఎన్నో కంపెనీలు, ఆర్థిక సంస్థలు రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. మార్చి క్వార్టర్ చివరినాటికి రిలయన్స్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.3,36,294 కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,75,259 కోట్లుగా ఉన్నాయి. నికర రుణ భారం రూ.1,61,035 కోట్లు. రిలయన్స్ జియో లాభం 177 శాతం అప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. గత క్యూ4లో ఈ కంపెనీ నికర లాభం 177 శాతం ఎగసి రూ.2,331కు పెరిగింది. వినియోగదారులు పెరగడం, టారిఫ్‌లు కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో నికర లాభం రూ. 840 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.14,835 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం 38.75 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ కంపెనీ ఇదే. వినియోగదారుల సంఖ్యలో 26 శాతం వృద్ధి సాధించింది. ఒక్క నెలకు ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్పీయూ) రూ.130.6గా ఉంది. ఇటీవలే కుదిరిన ఫేస్బుక్ డీల్ పరంగా రిలయన్స్ జియో విలువ రూ.4.62 లక్షల కోట్లని అంచనా. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 88% వృద్ధితో రూ.5,562 కోట్లకు, కార్యకలాపాల ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.54,316 కోట్లకు చేరాయి. ∙7,500 కోట్ల డాలర్ల విలువైన ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టగానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో 20% వాటాను సౌదీ ఆరామ్కో కంపెనీకి రిలయన్స్ విక్రయించనున్నది. వేతనాల్లో కోత కంపెనీ ఉద్యోగులకు, డైరెక్టర్లకు, ఉన్నతాధికారులకు వేతనాల్లో 10–50 శాతం కోత విధించనున్నామని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఎదురవుతున్న పరిస్థితులను అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి తన పారితోషికం మొత్తాన్ని(రూ.15 కోట్లు) వదులుకోవడానికి చైర్మన్ ముకేశ్ అంబానీ సిద్ధపడ్డారని పేర్కొంది. వార్షిక వేతనం రూ.15 లక్షలలోపు ఉన్న వారికి వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని, అంతకు మించిన వేతనాలు పొందే వారికి 10 % కోత ఉంటుందని పేర్కొంది. రైట్స్ ఇష్యూ @ 53,125 కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూను ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమ వద్దనున్న ప్రతి 15 షేర్లకు ఒక షేర్‌ను (1:15) రైట్స్ షేర్‌గా పొందవచ్చు. రైట్స్ ఇష్యూలో షేర్లు జారీ చేసే ధర రూ.1,257. గురువారం నాటి ముగింపు ధర (రూ.1,467)తో పోల్చితే ఇది 14 శాతం తక్కువ. రైట్స్ ఇష్యూ విలువ రూ.53,125 కోట్లు. భారత్‌లో ఇదే అతి పెద్ద రైట్స్ ఇష్యూ.మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. రైట్స్ ఇష్యూ ఇతర అంశాలపై అంచనాల కారణంగా బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3 శాతం లాభంతో రూ.1,467 వద్ద ముగిసింది. వినియోగ వ్యాపారాలు... రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలు నిర్వహణ, ఆర్థిక పరమైన అంశాల్లో జోరుగా వృద్ధిని సాధించాయి. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత మన దేశం, మా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ కూడా మరింత బలం పుంజుకుంటాయన్న ధీమా నాకు ఉంది. –ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
రెజ్లింగ్ కోచ్‌లకు అందని జీతాలు
న్యూఢిల్లీ: కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పనిచేసే విదేశీ కోచ్‌లకు కూడా మినహాయింపు దక్కలేదు. భారత రెజ్లింగ్ జట్టు కోచ్‌లు ఆండ్రూ కుక్, టెమో కజరష్విలీ ఏప్రిల్ నెల జీతాలే అందుకోలేదంటా. మార్చి నెలకు కూడా సగం జీతం మాత్రమే పొందినట్లు వారు తెలిపారు. తమ వేతనాల కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) జాతీయ శిబిరాన్ని మార్చి 17న రద్దు చేయడంతో మహిళల కోచ్ కుక్ అమెరికాకు, గ్రీకో రోమన్ కోచ్ కజరష్విలీ జార్జియాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నుంచి వేతనం పొందలేదన్నారు. అయితే కోచ్‌ల వేతనాలు చెల్లించాలంటూ ‘సాయ్’కు సూచించినట్లు డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు. -
ఐఎస్ ఉగ్రవాదుల జీతాలు కట్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో పనిచేసే ఫైటర్ల జీతాల్లో కోతపడనుంది. ఫైటర్ల జీతాలను సగానికి తగ్గించాలని ఐఎస్ ఉగ్రవాద సంస్థ నిర్ణయించింది. అనూహ్య పరిణామాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే కారణాలేంటన్నది బయటపెట్టలేదు. ఆర్థిక సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జెరూసలెం పోస్ట్ ఈ వివరాలను వెల్లడించింది. ఇటీవల ఇరాక్‌లోని మెసుల్ నగరంలో ఐఎస్ సంస్థ ఖజానాపై అమెరికా సారథ్యంలోని సేనలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో లక్షలాది డాలర్లు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో ఫైటర్ల జీతాలు తగ్గించడంతో పాటు పన్నుల ద్వారా స్థానిక పౌరుల నుంచి నిధులు వసూలు చేయాలని ఐఎస్ నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్‌తో పోలిస్తే ఐఎస్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్టు జెరూసలెం పోస్ట్ పేర్కొంది.