రోహిత్ కపూర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 10 బిలియన్ డాలర్ల విలువను అందుకున్న అతిపెద్ద హోటల్ చెయిన్ ఓయో... కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా 60 శాతం ఆదాయాన్ని కోల్పోయింది. నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించటంతో పాటు వేతనాల్లోనూ భారీగా కోతలు పెడుతున్నట్లు ‘ఓయో హోటల్స్ అండ్ హోమ్స్’ ఇండియా, దక్షిణాసియా సీఈవో రోహిత్ కపూర్ చెప్పారు. మరో నాలుగు నెలల పాటు ఇబ్బందులు తప్పవన్నారు. లాక్‌డౌన్ తీసేసినా.. గతంలో మాదిరి కస్టమర్లు అత్యవసరం కాని ప్రయాణాలు చేయరని, విలాసాలకు దూరంగా ఉంటారని, దీంతో హోటల్స్ ఆక్యుపెన్సీ తగ్గుతుందని చెప్పారాయన. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు.
కరోనా ప్రభావం ఓయోపై ఏ మేరకు ఉంది?
ప్రపంచ వ్యాప్తంగా ఆతిథ్య రంగం పీకల్లోతు కష్టాల్లో పడింది. దీనికి ఓయో మినహాయింపేమీ కాదు. ఆక్యుపెన్సీ పడిపోయి ఆదాయం 50–60 శాతం క్షీణించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవటం మినహా చేసేదేమీ లేదు. జూన్ నాటికి నెలవారీ ఖర్చుల్ని రూ.300 కోట్ల నుంచి రూ.185 కోట్ల స్థాయికి తగ్గించనున్నాం. కరోనా తర్వాత చైనాలో ఆతిథ్య రంగం కోలుకున్న సంకేతాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇదే సానుకూలత ఉంటుందని ఆశిస్తున్నాం.
ఉద్యోగుల తొలగింపులు, వేతనాల్లో కోతలు ఎలా ఉన్నాయి?
రెగ్యులర్ ఆదాయం లేకుంటే ఏ కంపెనీ అయినా మొదట చేసేది నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవటమే. ప్రపంచ వ్యాప్తంగా ఓయోలో 17 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 8 వేల మంది ఇండియా, దక్షిణాసియాలో ఉన్నారు. పెద్ద స్థాయి ఉద్యోగులకు 25–50 శాతం, మిగతా ఉద్యోగులకు 25 శాతం జీతాల్లో కోత వేశాం. కొందరు ఉద్యోగులకు సెలవులిచ్చాం. వారికి జీతాల్లేకుండా వైద్య బీమా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటివి అందిస్తాం. మరో నాలుగు నెలల పాటు ఇవి కొనసాగుతాయి. కరోనా కంటే ముందు ఇండియాలో 550 నగరాల్లో సేవలందించిన ఓయో.. ఇపుడు 400 నగరాలకు పరిమితమైంది.
ఓయోతో ఒప్పందం చేసుకున్న హోటల్స్ పార్టనర్స్ సంగతేంటి?
ఓయోలో అమెరికా, చైనా, మలేíసియా, ఇండోనేసియా, నేపాల్ వంటి 80 దేశాల్లో 43 వేల హోటల్స్, 10 లక్షల రూమ్స్ ఉన్నాయి. మన దేశంలో 18 వేల హోటల్స్, 2.70 లక్షల గదులున్నాయి. మా హోటల్స్ పార్ట్‌నర్స్‌కు ఓయో సంబంధ్ పేరిట ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తున్నాం.
ఓయోను ఎంఎస్‌ఎంఈ కింద పరిగణించాలని కేంద్రాన్ని కోరారు... ఎందుకు?
కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఆతిథ్య రంగానికి చిల్లిగవ్వ కూడా లేదు. లాక్‌డౌన్ ఎత్తేశాక.. హోటల్స్‌కు వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఉంటుంది కదా? అందుకే ఓయో పార్టనర్ హోటల్స్, స్టార్టప్స్‌లను కూడా ఎంఎస్‌ఎంఈ విభాగంలోకి తెస్తే వారికి పూచీకత్తు లేని రుణాలు, తక్కువ వడ్డీ రేట్లు వంటి ప్రయోజనాలు అందుతాయనేది నా ఉద్దేశం.
లాక్‌డౌన్ తర్వాత ఓయో హోటల్స్ ఎలా ఉండొచ్చు?
పరిశుభ్రత, భద్రత, భౌతిక దూరం అనేవి ఓయో హోటల్స్ నిబంధనల్లో అతిముఖ్యమైనవిగా మారతాయి. రాబడి, వ్యయాల ఆడిట్‌లో వీటికీ చోటుంటుంది. ఈ నెలాఖరు నాటికి వెయ్యి హోటళ్లను, లాక్‌డౌన్ ఎత్తేశాక దేశంలోని 18 వేల హోటల్స్‌ను శానిటైజ్ చేస్తాం. ఇక నుంచి ఓయో ప్లాట్‌ఫ్లామ్‌లో ధర, వసతులతో పాటూ శానిటైజ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు రూమ్ డైనింగ్‌కే ప్రాధాన్యమిస్తాం. ఉద్యోగులకు, కస్టమర్లందరికీ హెల్త్ స్క్రీనింగ్ చేశాకే లోపలికి అనుమతి ఉంటుంది. వృద్ధులు, వికలాంగ కస్టమర్లు మినహా ఎవరి లగేజీని వాళ్లే లోపలికి తెచ్చుకోవాలి.
ఇన్వెస్టర్లతో మీ సంబంధాలెలా ఉన్నాయి?
ఓయోలో జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు 42% వాటా ఉంది. గ్రీన్‌ఓక్స్ క్యాపిటల్, సెకోయా ఇండియా, లైట్ స్పీడ్ ఇండియా, హీరో ఎంటర్‌ప్రైజ్, ఎయిర్ బీఎన్‌బీ, చైనా లాడ్జింగ్ గ్రూప్‌లకూ వాటాలున్నాయి. బోర్డ్ సభ్యులందరితో కలిసి పనిచేస్తున్నాం. తాజాగా అమెరికాకు చెందిన కాఫీ హౌజ్ కంపెనీ స్టార్‌బక్స్ మాజీ సీఓఓ ట్రాయ్ ఆల్‌స్టీడ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ బెట్సీ ఆట్కిన్స్‌లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా బోర్డ్‌లోకి వచ్చారు. ఓయోపై నమ్మకం, సంస్థ సామర్థ్యం పెరగటానికి వీరి సేవలు ఉపయోగపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment