ఆ రిలేషన్‌షిప్‌ ఓ మంచి అనుభవాన్ని ఇచ్చింది | Sakshi Interview About Tollywood Actress Shruti Haasan Amid Lockdown | Sakshi
Sakshi News home page

ఆ రిలేషన్‌షిప్‌ ఓ మంచి అనుభవాన్ని ఇచ్చింది

Published Sun, May 17 2020 12:14 AM | Last Updated on Sun, May 17 2020 8:27 AM

Sakshi Interview About Tollywood Actress Shruti Haasan Amid Lockdown

నువ్వు నవ్వితే నేనూ నవ్వుతా నువ్వు ప్రేమగా చూస్తే నేనూ చూస్తా నువ్వు కన్నెర జేస్తే నేనూ జేస్తా... ఎందుకంటే నేను అద్దంలాంటిదాన్ని, ‘నీ రియాక్షన్‌ ఎలా ఉంటే.. నా రిఫ్లెక్షన్‌ అలా ఉంటుంది’ అంటున్నారు శ్రుతీహాసన్‌. కరోనా వల్ల ఇంట్లో లాకప్‌ కావడం, ఆ మధ్య లవ్‌లో బ్రేకప్‌ కావడం... ఇలా ఎన్నో విషయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు శ్రుతీహాసన్‌.

► ఎప్పుడూ షూటింగ్స్‌ అనో, మ్యూజికల్‌ టూర్స్‌ అనో.. ఇలా ఏదోటి చేస్తూ బిజీగా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో లాక్‌ కావడం ఎలా అనిపిస్తోంది?
షూటింగ్స్‌ను బాగా మిస్‌ అవుతున్నాను. నా కో–స్టార్స్, డైరెక్టర్స్, లొకేషన్‌ అన్నీ మిస్‌ అవుతున్నాను. కానీ అది పెద్ద సమస్య కాదు. ప్రపంచం పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ‘అది లేదు.. ఇది లేదు’ అని కంప్లయింట్‌ చేయడం కూడా కరెక్ట్‌ కాదు. నా కంపెనీని నేను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను. వంట పని, ఇంటి పని, మ్యూజిక్, కవితలు రాస్తున్నాను.

► ప్రస్తుతం ఈ కరోనా వల్ల కొందరు ‘ఐసొలేషన్‌’ లో ఉండిపోవాల్సిన పరిస్థితి. లైఫ్‌లో ఎప్పుడైనా మీరు అలా ఐసొలేట్‌ అయిపోవాలనుకున్న సందర్భాలు ఉన్నాయా?
కొన్నిసార్లు అనిపించింది. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పుగా అర్థం చేసుకోబడతాం. అలా జరిగినప్పుడు ఐసొలేట్‌ అయిపోవాలనుకుంటాం. లైఫ్‌లో చాలాసార్లు చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అప్పుడు ఒంటరిగా ఉండిపోవాలనిపించింది.

► నలుగురితో కలిసిమెలిసి ఉండాలంటారు. కానీ ఇప్పుడు నలుగురు కలిస్తే ముప్పు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు?
ఇది చాలా పాజిటివ్‌ విషయంగా చూస్తాను. ఇన్ని రోజులూ పార్టీలంటూ తిరిగాం. పార్క్, మాల్స్, కాఫీ షాప్స్‌.. ఎవరూ ఏదీ వదలపెట్టకుండా అదొక పనిగా పెట్టుకుని కలుసుకునేవాళ్లం. ఆ మీటింగ్స్‌లో అనవసరమైన విషయాల గురించే ఎక్కువగా చర్చించేవాళ్లం. కానీ ఇప్పుడు ఇల్లే కాఫీ షాప్, ఇల్లే పార్క్‌. ఫోన్‌లో కూడా కావాల్సిన విషయాలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నాన్సెన్స్‌ మాట్లాడటం లేదు. జీవితంలో అతి ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు అందరికీ అర్థం అవుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత చాలామందిలో చాలా మార్పు కనిపిస్తుందని నా ఫీలింగ్‌.

► ఈ లాక్‌డౌన్లో మీరేదైనా నిర్ణయం తీసుకున్నారా?
నెగటివ్‌గా మాట్లాడేవాళ్లు, నెగటివ్‌ ఎనర్జీ  పంచేవాళ్లు నాకు అవసరం లేదు. అలాంటి వాళ్లను దూరం పెట్టాలని చాలా బలంగా ఫిక్సయ్యాను. నా చుట్టూ పాజిటివ్‌ పీపుల్‌ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు కేవలం పాజిటివిటీయే కావాలి.  

► కానీ ఇప్పుడు ‘పాజిటివ్‌’ అంటే ప్రమాదం కదా?
(నవ్వుతూ).. అవును. కోవిడ్‌ 19 టెస్ట్‌లో పాజిటివ్‌ వస్తే ప్రమాదమే. కానీ లైఫ్‌లో పాజిటివిటీ లేకపోతే చాలా పెద్ద ప్రమాదం. నెగటివ్‌ మైండ్‌సెట్‌ ఉన్నవారికి ప్రతిదీ తప్పుగా అనిపిస్తుంది. ఎదుటివారిలో తప్పులు పట్టడమే వాళ్ల పని. నేను ఎదుటి వ్యక్తిలో ఉన్న నెగటివిటీని పక్కన పెట్టి  పాజిటివ్‌ విషయాలను మాత్రమే తీసుకుంటాను.

► లాక్‌డౌన్‌లో పూర్తిగా ఇంట్లోనే లాక్‌ అయ్యారా? బయటకు వెళ్తున్నారా?
చెత్త కవర్‌ పడేయడానికి మాత్రమే బయటకు అడుగుపెడుతున్నాను. అది కూడా నా ఇంటి మెయిన్‌ డోర్‌ కాస్త తెరిచి, బయట కవర్‌ పెట్టి, వెంటనే లోపలికి వెళ్లిపోతాను. కూరగాయలు, పండ్లు... ఇలా కావాల్సినవి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నాను. అవి వచ్చాక శుభ్రంగా కడిగి, ఫ్రిజ్‌లో పెడుతున్నాను.

► కుకింగ్‌లో ప్రయోగాలు చేస్తున్నారా?
నాకు తెలుగు వంటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బెండకాయ పచ్చడి ఇష్టం. ఈ లాక్‌డౌన్‌లో అది ట్రై చేశాను. ఆ రెసిపీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాను. చిన్నప్పటి నుంచి నాన్నగారు దాదాపు  ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో పెసరట్టు తింటారు. ఇప్పుడు పెసరట్టు ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఫస్ట్‌ టైమ్‌ చేసినప్పుడే బాగా కుదిరింది.

► ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో ఉద్యోగాలు కోల్పోయినవాళ్లు ఉన్నారు. వలస కార్మికుల స్థితి దారుణంగా ఉంది. అన్నీ ఉన్న మీరు చాలా అదృష్టవంతులు...
మీరు లాక్‌డౌన్‌ని ఎలా మ్యానేజ్‌ చేస్తున్నారు? అని కొందరు నన్ను అడిగారు. మ్యానేజ్‌ చేయడానికి ఏముంది? అన్ని వసతులు ఉన్నాయి కదా. మహా అయితే బోర్‌ కొడుతుంది.. అంతే. అది పెద్ద సమస్య కానే కాదు. అన్నీ ఉన్నవాళ్లు ప్రతిరోజూ ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాభావంతో ఉండాలి. వలస కూలీలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కాలి నడకన వెళ్తున్నారు. తినడానికి తిండి లేదు. చేతిలో డబ్బులు లేవు. చాలా దయనీయమైన స్థితి.

► మీ సొంత సంపాదనతోనే లైఫ్‌ లీడ్‌ చేస్తున్నారా? నాన్నగారి నుంచి హెల్ప్‌ ఏమైనా?
నాకూ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. లోన్లు కట్టాలి. నేనెప్పుడూ డబ్బులు కావాలని మా నాన్నగారిని అడగను. ఒకవేళ కావాలని అడిగితే ఆయన ఇస్తారు. కానీ నేను ఎవరి మీదా ఆధారపడకుండా బతకాలనుకుంటాను. కానీ నాది రోజువారీ జీతం తీసుకునే పని కాదు. అలాంటి జాబ్‌ అయితే టెన్షన్‌తో కూడుకున్నదే. ఇండస్ట్రీలో చాలా మంది ఏ రోజు జీతం ఆ రోజే తీసుకుంటారు. ఆ రోజు పని ఉంటేనే డబ్బులు. అలాంటివారి జీవితాన్ని ఈ కరోనా చాలా ఇబ్బందుల్లో పడేసింది.

► ఫైనల్లీ కంటికి కనిపించని శత్రువు కరోనాతో పోరాటం చేస్తున్నాం. కానీ మన జీవితంలో కనిపించే శత్రువులు ఉంటారు. వీళ్లను ఎలా ఎదుర్కొంటారు?
నా ఆలోచనలన్నీ ఆధ్యాత్మికంగా ఉంటాయా? అంటే వంద శాతం ఉంటాయని చెప్పలేను. పోనీ నేను టోటల్‌గా స్పిరిచ్యువల్‌ పర్సనా? అంటే అది కూడా కరెక్ట్‌గా చెప్పలేను. అయితే ఓ పవర్‌ అందర్నీ నడిపిస్తుందని నమ్ముతాను. మన మనసులో ఒక విషయాన్ని బలంగా అనుకుంటే సమయం పట్టినా అది కచ్చితంగా జరిగేలా ఆ పవర్‌ చేస్తుందని నమ్ముతాను.  నేను అద్దం లాంటిదాన్ని. మీరు నాకు ఏది ఇస్తే అది మీకు తిరిగి ఇస్తాను. మీరు నాకు ప్రేమను ఇచ్చారనుకోండి.. ఆ ప్రేమ తిరిగి వస్తుంది. ఇంకా రెట్టింపు కూడా వస్తుంది. అదే ద్వేషించారా? అది కూడా అలానే ఉంటుంది. ఈ శత్రువుని ఇలా ఎదుర్కోవాలని ఒక రూల్‌ ఏం ఉండదు. శత్రువుని బట్టి మారుతుంది. చెప్పాను కదా.. మీ రియాక్షన్‌ బట్టి నా రిఫ్లెక్షన్‌ ఉంటుంది.

► మైఖేల్‌ కోర్సలే నుంచి బ్రేక్‌ అప్‌ అయ్యారు? ఆ బ్రేకప్‌ నేర్పించిన పాఠం?
పాఠం అనుకోవడం లేదు కానీ ఆ రిలేషన్‌షిప్‌ ఓ మంచి అనుభవాన్ని ఇచ్చింది. ‘లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’ అంటారు కదా. అలా అన్నమాట. అయితే నేను ఒక రిలేషన్‌లో ఉన్నందుకు, ఆ తర్వాత బ్రేకప్‌ అయినందుకు పశ్చాత్తాపపడటంలేదు.

► మళ్లీ ప్రేమలో పడతారా?
ఎందుకు పడకూడదు. నేను ప్రేమలో పడే వయసులోనే ఉన్నాను కదా. ఈ వయసులో ప్రేమకబుర్లు చెప్పకపోతే ఏ వయసులో చెబుతాం. అయితే నేను అనుకుంటున్న ఆ ‘గొప్ప ప్రేమ’ దొరికినప్పుడు ఇలాంటి ప్రేమకోసమే ఎదురు చూశానని తప్పకుండా చెబుతాను.

ఇప్పుడు  మీ డైలీ రొటీన్‌ ఏంటి?
షూటింగ్స్‌ వల్ల మార్నింగ్‌ నిద్రలేచే టైం మారిపోయింది. రాత్రి త్వరగా పడుకుంటే త్వరగా లేస్తాను. ఆలస్యంగా పడుకుంటే ఆలస్యం అవుతుంది. నిద్ర లేవగానే బెడ్‌ని నీట్‌గా సర్దుకుంటాను. మళ్లీ రాత్రి వరకూ నిద్రపోను. నిద్ర లేవగానే టీ, బ్రేక్‌ఫాస్ట్, వర్కౌట్స్‌ పూర్తి చేస్తాను. ఆ తర్వాత భోజనం తయారు చేసుకుంటాను. తిన్న తర్వాత ఏదైనా రాసుకుంటాను. ఫ్రెండ్స్‌తో మాట్లాడతాను. ఇల్లు క్లీన్‌ చేస్తాను. ప్రతిరోజూ ఏదో పని ఉంటుంది.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement