ఎన్నాళ్లు భయపడుతూ బతుకుతాం | Tollywood Actress Manchu Lakshmi Press Meet Over Corona issue | Sakshi
Sakshi News home page

భయంతో జీవితాన్ని గడపాలనుకోవడం లేదు

Published Sat, Jun 13 2020 3:34 AM | Last Updated on Sat, Jun 13 2020 8:24 AM

Tollywood Actress Manchu Lakshmi Press Meet Over Corona issue - Sakshi

‘‘కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నాకు హోమ్‌ క్వారంటైన్‌లా అనిపించలేదు. బాధ్యత లేకుండా నాకు నచ్చినట్టు ఉన్నాను(నవ్వుతూ). మొదటి వారం కొంచెం బోరింగ్‌గా అనిపించింది. దీంతో నాన్న వద్దకు (మంచు మోహన్‌బాబు) వెళ్లిపోయాను. నాన్న స్ట్రిక్ట్‌.. అందుకే మళ్లీ బాధ్యతగా ఉంటున్నాను’’ అని నటి, నిర్మాత లక్ష్మీ మంచు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడిన విశేషాలు ఈ విధంగా...

► లాక్‌డౌన్‌ సమయంలో నాన్న వద్దే ఉన్నాను. కాలేజీ రోజుల తర్వాత నాన్న, అమ్మ, విష్ణులతో ఎక్కువ రోజులు కలిసి ఉన్నది ఇప్పుడే. నచ్చిన వంటలు చేసుకుని తినడం.. నచ్చిన సినిమా చూడటం.. ఇలా ఇంట్లో ఉండి కూడా ఇంత సంతోషంగా ఉండొచ్చా? అనిపించింది. నాన్న, నా కూతురు (విద్యా నిర్వాణ) బాగా అల్లరి చేశారు. నాన్న వద్ద నిర్వాణ ఉంటే నాకు వెంకటేశ్వరస్వామి వద్ద ఉన్నట్టు అనిపించింది. విష్ణు భార్య (విరానికా), పిల్లలు సింగపూర్‌లో చిక్కుకుపోవడం బాధగా అనిపించింది.

► మానవుడు ప్రకృతిని నాశనం చేయడం వల్లే కరోనాలాంటివి వచ్చి హెచ్చరిస్తున్నాయి. మనతో పాటు భూమిపై బతికే హక్కు సకల జీవరాశులకు ఉంది. ప్రపంచం మొత్తం ప్రతి ఏడాదీ ఓ 10 రోజులు పూర్తిస్థాయి  లాక్‌డౌన్‌ పెట్టాలని కోరుకుంటున్నా.

► ఈ లాక్‌డౌన్‌లో స్నేహితుల్ని కలవడం కుదరలేదని మాత్రం అనిపించింది నాకు. అంతేకాదు.. షూటింగ్‌ సెట్‌ని బాగా మిస్‌ అయ్యాననిపించింది.. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మీ మంచు’ షో ఐడియా. ఈ షోకి తొలుత రానాని అడగ్గానే ఓకే అన్నాడు. పార్టీలంటే వచ్చే ఫ్రెండ్స్‌ చాలామంది ఉంటారు. కానీ, నేను ఏది అడిగినా రానా కాదనడు. రామానాయుడుగారు చనిపోయిన 10వ రోజే  నా ‘దొంగాట’ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నాడు. నా నిజమైన స్నేహితుడు తనే. ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మీ మంచు’ షోలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, శశి థరూర్, రామ్‌గోపాల్‌ వర్మ, రకుల్‌... ఇలా చాలా మందితో మాట్లాడాను.

► కరోనా అంటే ముందు భయం ఉండేది.. కానీ ఇప్పుడు లేదు. ఎన్నాళ్లు భయపడుతూ బతుకుతాం. భయంతో జీవితాన్ని గడపాలనుకోవడం లేదు. ప్రతి రోజూ భయపడుతూ బతకొద్దని నాన్నకు చెప్పాను. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను ఎంత అదృష్ణవంతురాలో ఈ లాక్‌డౌన్‌ సమయంలో నాన్న వద్ద ఉన్నప్పుడు తెలిసొచ్చింది. ఏదైనా జరిగితే మాకు నాన్న ఉన్నారు? అనే భరోసా.

► లాక్‌డౌన్‌ సమయంలో మనం ఇంట్లో ఉన్నా కావాల్సినవి కొనుక్కుని తింటున్నాం. కానీ, చాలా మంది పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కపూట కూడా భోజనం లేకుండా ఇబ్బందులు పడ్డవారు కూడా చాలామంది ఉన్నారు. అది నా మనసును కదిలించింది. ఆ సమయంలో వారికి ఒక్కపూట భోజనం పెట్టినా చాలు అనిపించింది. ఈ సమయంలో మన పిల్లలు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌ తరగతులు వింటున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనిపించింది. విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలనే ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’ కార్యక్రమం చేస్తున్నా.

► ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ సినిమా తర్వాత ఓ తమిళ సినిమా చేశా. ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ నాకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో ఏ మూవీ ఒప్పుకోలేదు. నేను ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమే.. అయితే నాకు నచ్చిన పాత్రలు రావాలి. నేను చేశానంటే ఆ పాత్రని లక్ష్మి బాగా చేసిందనాలి. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్, సినిమాకి కథలు రెడీ చేసుకుంటున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement