ఇప్పటివరకూ కరోనా విషయంలో చాలా ఎక్కువగా భయపడ్డామని.. ఇకపై భయానికి బదులు జాగ్రత్తపడదామని యశోద హాస్పిటల్ గ్రూప్స్ డైరెక్టర్, పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పవన్ గోరుకంటి సూచించారు. న్యూయార్క్, మిషిగన్ హాస్పిటల్స్‌లో పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాల్లో సేవలందించిన ఆయన.. కోవిడ్–19 విషయంలో అతిగా ఆందోళన చెందడం వల్ల ఏర్పడుతున్న అనేక అనర్థాలను విపులీకరించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. వివరాలివీ..
– సాక్షి, హైదరాబాద్
సాక్షి: కరోనా విషయంలో భయపడటం జాగ్రత్తను పెంచుతుంది కదా?
డాక్టర్ పవన్: కరోనా విషయంలో ప్రజల ను జాగ్రత్తగా ఉంచేంత మోతాదులో భయపడటం అవసరం. ఆ భయం వల్ల వాళ్లకు చాలా ప్రయోజనాలూ సమకూరాయి. అలాగే కొన్ని అనర్థాలూ వచ్చాయి.
కరోనా జాగ్రత్తల వల్ల అనర్థాలూ కలుగుతున్నాయనడం ఆశ్చర్యంగా ఉంది..?
కరోనా జాగ్రత్తల వల్ల కాదు.. అతి జాగ్రత్తల వల్ల అనర్థాలు కలుగుతున్నాయి. మాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి వరసగా మూణ్నాలుగు రోజుల్నుంచి తలనొప్పి వస్తున్నా ఆసుపత్రికి రాలేదు. చివరకు తేలిందేమిటంటే.. ఆయన మెదడులో రక్తపు గడ్డ (క్లాట్) ఉంది. దాంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఆయన సరైన సమయంలో వచ్చి ఉంటే చనిపోయేవారు కాదు. ఇటీవల ఓ చిన్న పిల్లవాడికి భరించలేనంతగా కడుపునొప్పి వస్తుంటే వెంటనే ఆస్పత్రికి తీసుకురాకుండా కండిషన్ బాగా క్లిష్టమయ్యాక తీసుకొచ్చారు. దాంతో చాలా సులువుగా జరగాల్సిన ఆపరేషన్ సంక్లిష్టమైంది. అందుకే కరోనా పట్ల నిజంగా వస్తున్న ముప్పుల కంటే, దానిపట్ల అతి ఆందోళనతో వచ్చే అనర్థాలే ఎక్కువ అనవచ్చు.
మీరో ఆసుపత్రికి డైరెక్టర్. మీరు చెబుతున్న మాటలన్నీ మీ హాస్పిటల్ ఆదాయాన్ని పెంచుకోవచ్చనే ఇలా చెబుతున్నారేమో అని అభిప్రాయపడటంలో తప్పు లేదు కదా?
మాది టెరిషియరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇచ్చే పెద్దాసుపత్రి. మామూలు జ్వరం, జలుబూ వంటి సమస్యలతో పేషెంట్ వస్తే మాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆరోగ్యం, ప్రాణం పట్ల ఉండే శ్రద్ధను కాదనలేక వైద్యం అందిస్తూ.. ఈ మందులతోనే మీ సమస్య తగ్గిపోతుంది. అవి వాడాక కూడా అప్పటికీ సమస్యగా ఉంటే చూద్దాం లెండి అంటూ వాళ్లు రానవసరం లేదన్న విషయాన్ని నొచ్చుకోకుండా చెబుతుంటాం. సకాలంలో ఆసుపత్రికి వచ్చి ఉంటే ప్రాణాలు నిలబడేవని తెలిశాక కూడా.. అలాంటి వ్యక్తులు చాలామంది కేవలం ఆసుపత్రికి వెళ్తే ప్రమాదం అన్న అపోహతో చనిపోతుంటే చూస్తూ ఆవేదన చెంది చెబుతున్న మాటలివి. కరోనా భయంతో హాస్పిటల్స్‌కు మీరు రావడం లేదు సరే.. కానీ వ్యాప్తికి అవకాశం ఉన్న మార్కెట్లూ, మటన్ అమ్మకం జరిగే ప్రదేశాలూ, మాల్స్‌కు వెళ్తున్నారు. ఇదెంత విజ్ఞత? ఎంతమేరకు సబబు? ఇదేదో మా ఆసుపత్రికి మాత్రమే పేషెంట్స్ రావాలని చెబుతున్నమాట కాదు. అదే ఆసుపత్రి అయినా ఆ అడ్వాన్స్‌డ్ టెరిషియరీ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నదే మా ఉద్దేశం.
మీరు న్యూయార్క్, మిషిగాన్‌లో పనిచేశారు కదా. కోవిడ్–19 విషయంలో మన చికిత్సలకూ, అక్కడి వాళ్లకూ తేడా ఏమిటి?
అక్కడి వైద్యసౌకర్యాలతో పోలిస్తే.. మనమేమీ తక్కువ కాదు. ఇంకా మెరుగని చెప్పవచ్చు. అక్కడ ఐసీయూలో ప్రతి ఏడుగురు పేషెంట్స్‌ను ఒక నర్స్ చూస్తుంటారు. కానీ మన దగ్గర ఐసీయూలోని ప్రతి పేషెంట్‌కూ ఒక్క నర్స్ పూర్తి ఫోకస్‌డ్‌గా సేవలందిస్తారు. ఇక కోవిడ్–19కు వాడే రెమ్‌డిస్‌విర్ వంటి యాంటీవైరల్ మందులు, హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిథ్రోమైసిన్ వంటి వాటి విషయంలో అక్కడికంటే ఇక్కడే వాటి లభ్యత ఎక్కువ. అత్యవసరంగా కోవిడ్–19 రోగులకు వైద్యసేవలు అవసరమైనప్పుడు చికిత్స అందించాల్సిన వైద్యసంస్థల జాబితాలో మేమూ ఉన్నాం. పైగా లాక్‌డౌన్ అయిన ఈ రెండున్నర నెలల వ్యవధిలో రోగులను సురక్షితంగా చూసే ప్రొటోకాల్స్‌లో మేం బాగా సంసిద్ధమయ్యాం.
కరోనా జాగ్రత్తల విషయంలో మీరేదైనా కొత్త సంగతి చెప్పగలరా?
లక్షణాలు బయటకు కనిపించని అసింప్టమాటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే.. వాళ్ల కారణంగా ఇతరులకు వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని గతంలో ఆందోళన ఉండేది. ఇప్పటి సరికొత్త అధ్యయనాల ద్వారా అసింప్టమాటిక్ పేషెంట్స్‌తో ఇతరులకూ వ్యాప్తి పెద్దగా ఉండదని తేలింది. అయితే ప్రిసింప్టమాటిక్.. అంటే వ్యాధి లక్షణాలు బయటపడే కొద్ది రోజుల ముందర దగ్గు, జ్వరం వస్తున్న తొలి రోజుల్లో వాళ్లు ఇతరులకు అంటించగలరు. అందుకే ఏమాత్రం చిన్నపాటి లక్షణాలు కనిపించినా.. ఇది సాధారణ దగ్గే కావచ్చు. ఇది మామూలు జ్వరమే కావచ్చు అని అనుకోకుండా డాక్టర్‌కు చూపించుకోండి. దగ్గు, జ్వరం, ముక్కుకారడం వంటి లక్షణాలు కనిపించినప్పటికీ.. సమాజంలో తమను వెలివేసినట్లుగా చూస్తారేమో అన్న ఆందోళనతో చాలామంది బయటకు రావడంలేదు. దాంతో వ్యాప్తి మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి.. భయపడటం అవసరమా, లేక జాగ్రత్త అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment