rohit kapoor
-
బిజినెస్: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో.. గవర్నర్ చర్చ!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో నార్త్‌బ్లాక్‌లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశమయ్యారు. ఎకానమీపై చర్చించారు. కాగా సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ కూడా ఆర్థిక మంత్రితో సమావేశమై మార్కెట్ పరిణామాలను వివరించారు. స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ సీతారామన్‌తో సమావేశమయినట్లు మరో పోస్ట్‌లో ఆర్థికశాఖ పేర్కొంది. ఇవి చదవండి: బిజినెస్ - నష్టాల్లోంచి లాభాల్లోకి.. -
3,000 కిలోమీటర్లు ప్రయాణించి ఓయో దగ్గరికి వచ్చిన కస్టమరుకు సీఈఓ క్షమాపణలు
ఇటీవల పుదుచ్చేరికి 3000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఓయో లాడ్జ్ కి వచ్చిన ఒక బృందానికి ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. పుదుచ్చేరిలో ఓయోలో రూమ్ బుక్ చేసిన ఈ బృందానికి తీర ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ ఆ ఓయో లాడ్జ్ లేదు. దీంతో వారందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. ఈ బృందంలోని సభ్యుల్లో ఒకరైన అభినందన్ పంత్ ఈ అనుభవం గురించి లింక్డ్ ఇన్‌లో పోస్ట్ రాశారు. ఈ ఆసక్తికర పరిణామం గురించి వీడియో కూడా చిత్రీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ తొమ్మిది మంది గల బృందం ఓయో 74612 రాయల్ ప్లాజా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లో గదులను బుక్ చేసుకున్నారు. కానీ, వారు 3000 కిలోమీటర్లు ప్రయాణించి ఓయో లాడ్జ్ ఉన్న ప్రదేశానికి డిసెంబర్ 24 రాత్రి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న అడవి మొక్కల ప్రదేశం చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. తాను, తన తోటి ప్రయాణికులు రాత్రి పూట నిర్మానుష్యమైన రహదారిపై చిక్కుకుపోయినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. ఓయో కస్టమర్ సర్వీస్ కు కాల్ చేసినప్పుడు, తాము ఇతర లాడ్జింగ్ ఏర్పాటు చేయలేమని తనకు చెప్పినట్లు పంత్ పేర్కొన్నాడు. కానీ అతను ఆ నగరంలో తనిఖీ చేసినప్పుడు 50కి పైగా ఆస్తులు గల ఓయో లాడ్జ్ అందుబాటులో ఉన్నట్లు అతను అన్నాడు. చివరకు అక్కడ ఉండటానికి ఇతర హోటళ్లకు అనేకసార్లు కాల్స్ చేసినట్లు పంత్ చెప్పారు. అక్కడ ఉన్న ఒక హోటల్ లో బస చేశామని, క్రిస్మస్ వారాంతం కావడం వల్ల చివరి నిమిషంలో హోటల్ బుకింగ్ ఖర్చును రెట్టింపు చేసినట్లు తెలిపాడు. గత ఏడాదిగా ఉనికిలో లేని ఈ హోటల్ గురించి చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారని తను అన్నాడు. తనకు అసౌకర్యానికి చింతిస్తూ ఓయోపై కేసు వేస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. భారతదేశం & ఆగ్నేయ ఆసియా ఓయో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ అభినందన్ పంత్ లింక్డ్ ఇన్ పోస్టుకు స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు. "అలాగే, ఆ లాడ్జ్ మా ప్రమాణాలను ఏమాత్రం చేరుకోలేదు. మీ అనుభవంతో మరిన్ని మార్పులు చేయడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి మేము సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాము" అని కపూర్ పంత్ పోస్ట్ పై ఒక వ్యాఖ్యలో తెలిపారు. ఓయో సీఈఓ తను అసౌకర్యానికి గురైన ప్రాంతానికి సంబంధించిన లొకేషన్ పంపమని అభినందన్ ను కోరాడు. "అలాగే మీ అనుభవం నుంచి మరింత నేర్చుకుంటాను" అని ఆయన అన్నారు. (చదవండి: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక నిర్ణయం..!) -
కోతలు తప్పవు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 10 బిలియన్ డాలర్ల విలువను అందుకున్న అతిపెద్ద హోటల్ చెయిన్ ఓయో... కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా 60 శాతం ఆదాయాన్ని కోల్పోయింది. నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించటంతో పాటు వేతనాల్లోనూ భారీగా కోతలు పెడుతున్నట్లు ‘ఓయో హోటల్స్ అండ్ హోమ్స్’ ఇండియా, దక్షిణాసియా సీఈవో రోహిత్ కపూర్ చెప్పారు. మరో నాలుగు నెలల పాటు ఇబ్బందులు తప్పవన్నారు. లాక్డౌన్ తీసేసినా.. గతంలో మాదిరి కస్టమర్లు అత్యవసరం కాని ప్రయాణాలు చేయరని, విలాసాలకు దూరంగా ఉంటారని, దీంతో హోటల్స్ ఆక్యుపెన్సీ తగ్గుతుందని చెప్పారాయన. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. కరోనా ప్రభావం ఓయోపై ఏ మేరకు ఉంది? ప్రపంచ వ్యాప్తంగా ఆతిథ్య రంగం పీకల్లోతు కష్టాల్లో పడింది. దీనికి ఓయో మినహాయింపేమీ కాదు. ఆక్యుపెన్సీ పడిపోయి ఆదాయం 50–60 శాతం క్షీణించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవటం మినహా చేసేదేమీ లేదు. జూన్ నాటికి నెలవారీ ఖర్చుల్ని రూ.300 కోట్ల నుంచి రూ.185 కోట్ల స్థాయికి తగ్గించనున్నాం. కరోనా తర్వాత చైనాలో ఆతిథ్య రంగం కోలుకున్న సంకేతాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇదే సానుకూలత ఉంటుందని ఆశిస్తున్నాం. ఉద్యోగుల తొలగింపులు, వేతనాల్లో కోతలు ఎలా ఉన్నాయి? రెగ్యులర్ ఆదాయం లేకుంటే ఏ కంపెనీ అయినా మొదట చేసేది నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవటమే. ప్రపంచ వ్యాప్తంగా ఓయోలో 17 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 8 వేల మంది ఇండియా, దక్షిణాసియాలో ఉన్నారు. పెద్ద స్థాయి ఉద్యోగులకు 25–50 శాతం, మిగతా ఉద్యోగులకు 25 శాతం జీతాల్లో కోత వేశాం. కొందరు ఉద్యోగులకు సెలవులిచ్చాం. వారికి జీతాల్లేకుండా వైద్య బీమా, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి అందిస్తాం. మరో నాలుగు నెలల పాటు ఇవి కొనసాగుతాయి. కరోనా కంటే ముందు ఇండియాలో 550 నగరాల్లో సేవలందించిన ఓయో.. ఇపుడు 400 నగరాలకు పరిమితమైంది. ఓయోతో ఒప్పందం చేసుకున్న హోటల్స్ పార్టనర్స్ సంగతేంటి? ఓయోలో అమెరికా, చైనా, మలేíసియా, ఇండోనేసియా, నేపాల్ వంటి 80 దేశాల్లో 43 వేల హోటల్స్, 10 లక్షల రూమ్స్ ఉన్నాయి. మన దేశంలో 18 వేల హోటల్స్, 2.70 లక్షల గదులున్నాయి. మా హోటల్స్ పార్ట్నర్స్కు ఓయో సంబంధ్ పేరిట ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తున్నాం. ఓయోను ఎంఎస్ఎంఈ కింద పరిగణించాలని కేంద్రాన్ని కోరారు... ఎందుకు? కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఆతిథ్య రంగానికి చిల్లిగవ్వ కూడా లేదు. లాక్డౌన్ ఎత్తేశాక.. హోటల్స్‌కు వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఉంటుంది కదా? అందుకే ఓయో పార్టనర్ హోటల్స్, స్టార్టప్స్‌లను కూడా ఎంఎస్ఎంఈ విభాగంలోకి తెస్తే వారికి పూచీకత్తు లేని రుణాలు, తక్కువ వడ్డీ రేట్లు వంటి ప్రయోజనాలు అందుతాయనేది నా ఉద్దేశం. లాక్డౌన్ తర్వాత ఓయో హోటల్స్ ఎలా ఉండొచ్చు? పరిశుభ్రత, భద్రత, భౌతిక దూరం అనేవి ఓయో హోటల్స్ నిబంధనల్లో అతిముఖ్యమైనవిగా మారతాయి. రాబడి, వ్యయాల ఆడిట్లో వీటికీ చోటుంటుంది. ఈ నెలాఖరు నాటికి వెయ్యి హోటళ్లను, లాక్డౌన్ ఎత్తేశాక దేశంలోని 18 వేల హోటల్స్‌ను శానిటైజ్ చేస్తాం. ఇక నుంచి ఓయో ప్లాట్‌ఫ్లామ్‌లో ధర, వసతులతో పాటూ శానిటైజ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు రూమ్ డైనింగ్కే ప్రాధాన్యమిస్తాం. ఉద్యోగులకు, కస్టమర్లందరికీ హెల్త్ స్క్రీనింగ్ చేశాకే లోపలికి అనుమతి ఉంటుంది. వృద్ధులు, వికలాంగ కస్టమర్లు మినహా ఎవరి లగేజీని వాళ్లే లోపలికి తెచ్చుకోవాలి. ఇన్వెస్టర్లతో మీ సంబంధాలెలా ఉన్నాయి? ఓయోలో జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు 42% వాటా ఉంది. గ్రీన్ఓక్స్ క్యాపిటల్, సెకోయా ఇండియా, లైట్ స్పీడ్ ఇండియా, హీరో ఎంటర్ప్రైజ్, ఎయిర్ బీఎన్బీ, చైనా లాడ్జింగ్ గ్రూప్‌లకూ వాటాలున్నాయి. బోర్డ్ సభ్యులందరితో కలిసి పనిచేస్తున్నాం. తాజాగా అమెరికాకు చెందిన కాఫీ హౌజ్ కంపెనీ స్టార్‌బక్స్ మాజీ సీఓఓ ట్రాయ్ ఆల్స్టీడ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ బెట్సీ ఆట్కిన్స్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా బోర్డ్లోకి వచ్చారు. ఓయోపై నమ్మకం, సంస్థ సామర్థ్యం పెరగటానికి వీరి సేవలు ఉపయోగపడతాయి. -
ప్రైవేటు విమానాల కొరత..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఒకేరోజు నాలుగైదు ఊర్లలో ప్రచారం చేయాల్సి వస్తుంది. ఇందుకోసం హెలికాప్టర్లు లేదా చిన్న స్థాయి ప్రైవే టు జెట్లను ఆశ్రయిస్తుంటారు. కాని ఈ ఏడాది రాజకీయ నాయకులకు విమానాల కొరత తప్పదని బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏవోఏ) పేర్కొంది. దీనికి ప్రధాన కారణం గతేడాదితో పోలిస్తే ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య తగ్గడమే. ఆర్థిక మందగమనానికి తోడు, డాలరు విలువ 20 శాతానికిపైగా పెరగడంతో చాలామంది ప్రైవేటు ఆపరేటర్లు హెలికాప్టర్స్, విమానాలను విక్రయించినట్లు బీఏఓఏ తెలిపింది. ఈ విధంగా గతేడాది 19 ప్రైవేటు జెట్స్‌ను విక్రయించినట్లు బీఏవోఏ ప్రెసిడెంట్ రోహిత్ కపూర్ తెలిపారు. ఇండియా ఏవియేషన్ 2014 కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన రోహిత్ విలేకరులతో మాట్లాడుతూ గడిచిన 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రైవేటు విమానాల సంఖ్యలో క్షీణత నమోదయ్యిందన్నారు. పెరుగుతున్న కోటీశ్వరుల సంఖ్య, కార్పొరేట్ సంస్థలతో దేశంలో ప్రైవేటు విమానాలకు మంచి మార్కెట్ ఉందని, కాని నిర్వహణ వ్యయం, నిబంధనలు ఈ పరిశ్రమకు అడ్డుగా నిలుస్తున్నాయన్నారు. ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో ఇప్పటికే కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చినవారిలో కొంతమంది రద్దు చేసుకోగా, మరికొంతమంది వాయిదా వేసుకున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.