ప్రైవేటు విమానాల కొరత..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఒకేరోజు నాలుగైదు ఊర్లలో ప్రచారం చేయాల్సి వస్తుంది. ఇందుకోసం హెలికాప్టర్లు లేదా చిన్న స్థాయి ప్రైవే టు జెట్‌లను ఆశ్రయిస్తుంటారు. కాని ఈ ఏడాది రాజకీయ నాయకులకు విమానాల కొరత తప్పదని బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏవోఏ) పేర్కొంది. దీనికి ప్రధాన కారణం గతేడాదితో పోలిస్తే ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య తగ్గడమే. ఆర్థిక మందగమనానికి తోడు, డాలరు విలువ 20 శాతానికిపైగా పెరగడంతో చాలామంది ప్రైవేటు ఆపరేటర్లు హెలికాప్టర్స్, విమానాలను విక్రయించినట్లు బీఏఓఏ తెలిపింది.
ఈ విధంగా గతేడాది 19 ప్రైవేటు జెట్స్‌ను విక్రయించినట్లు బీఏవోఏ ప్రెసిడెంట్ రోహిత్ కపూర్ తెలిపారు. ఇండియా ఏవియేషన్ 2014 కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన రోహిత్ విలేకరులతో మాట్లాడుతూ గడిచిన 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రైవేటు విమానాల సంఖ్యలో క్షీణత నమోదయ్యిందన్నారు. పెరుగుతున్న కోటీశ్వరుల సంఖ్య, కార్పొరేట్ సంస్థలతో దేశంలో ప్రైవేటు విమానాలకు మంచి మార్కెట్ ఉందని, కాని నిర్వహణ వ్యయం, నిబంధనలు ఈ పరిశ్రమకు అడ్డుగా నిలుస్తున్నాయన్నారు. ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో ఇప్పటికే కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చినవారిలో కొంతమంది రద్దు చేసుకోగా, మరికొంతమంది వాయిదా వేసుకున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.