సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్‌ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్‌ఎంసీ మాస్టర్‌ప్లాన్‌లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్‌ప్లాన్‌పైన హెచ్‌ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్‌ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది.
పరిరక్షణపై నీలినీడలు...
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు.
జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
భారీగా అక్రమ నిర్మాణాలు...
ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్‌ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి.
అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్‌పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్‌లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు.
ఏం చేస్తారు...
ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్‌లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే.
ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్‌ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment