సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌ఎండీఏ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని...ప్రాథమిక ఫీజు(ఇన్షియల్ పేమెంట్) చెల్లించలేకపోయిన దరఖాస్తుదారులకు ఇప్పటికీ లైన్ క్లియర్ కాలేదు. మరో ఐదు రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ గడువు ముగియనుండగా ఇప్పటికీ దాదాపు 9 వేల మంది దరఖాస్తుదారుల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో ఫీజు చెల్లించలేక పోయిన వీరికి..మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇన్షియల్ పేమెంట్‌కు అవకాశం కల్పిస్తామని మౌఖికంగా చెప్పారు. కానీ అధికారికంగా ఈ దరఖాస్తుదారులకు ఇప్పటి వరకు ఎలాంటి క్లియరెన్స్ లభించలేదు. దీంతో వారంతా ఆందోళనకుగురవుతున్నారు. రెండు నెలల క్రితం హెచ్‌ఎండీఏ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఇన్షియల్ పేమెంట్ చేయని వారి గురించి చర్చించారు. ఆ సమయంలో వారికి అవకాశం కల్పిద్దామని మంత్రి కేటీఆర్ మౌఖికంగా చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా... చివరకు ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ ముగింపు గడువు సమీపిస్తున్నా అధికారికంగా ఉత్తర్వులు జారీకాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 15 వేల మంది ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ అయి ఫీజు చెల్లించాలంటూ ఎస్‌ఎంఎస్‌లు అందుకున్నవారు ఫీజులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. అలాంటిది ఫీజులు చెల్లిస్తామని చెబుతున్న తమను ఎందుకు పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. వీరికి అవకాశం కల్పిస్తు హెచ్‌ఎండీనకు రూ.100 కోట్లు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.
మా చేతిలో లేదు...ప్రభుత్వ నిర్ణయమే
ఆన్‌లైన్ విధానంపై అవగాహన లేక...దళారులను నమ్ముకొని...స్వయం తప్పిదాలతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించలేకపోయామని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్‌కు అయ్యే చార్జీ, నాలా ఫీజులను కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఒక్క అవకాశం ఇవ్వాలంటూ హెచ్‌ఎండీఏ అధికారులను కోరుతున్నారు. అప్పు చేసి కొన్నేళ్ల క్రితం నగర శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ఈ ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ ఇస్తే బ్యాంక్ రుణాలు తీసుకొని సొంతింటి వారమవుతామంటున్నారు. అయితే రూ.పది వేల రుసుం గల ‘ఇన్షియెల్ పేమెంట్’ చెల్లించకపోవడంతో వీరి దరఖాస్తుదారులను ప్రాసెస్ చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఒప్పుకోవడం లేదు. 2015 నవంబర్‌లో జారీ చేసిన జీవో నంబర్ 151లో రూ.పది వేల ఇన్షియెల్ పేమెంట్ తప్పనిసరిగా కట్టాలంటూ పేర్కొన్నారని, ప్రభుత్వ స్థాయిలో మళ్లీ నిర్ణయం తీసుకుంటే తప్ప తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. అయినా ప్రభుత్వం స్పందిస్తుందన్న ఆశతో దాదాపు రెండేళ్ల నుంచి తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు.
పూర్వ కమిషనర్ చిరంజీవులును కలిసి వీరు గోడు వినిపించడంతో చివరకు చొరవ తీసుకొని దాదాపు తొమ్మిదివేల మంది దరఖాస్తుదారులు ఇన్షియెల్ పేమెంట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ...వీరికి అనుమతిస్తే హెచ్‌ఎండీఏకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రూపంలో రూ.వంద కోట్లు వచ్చే అవకాశముందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌కు లేఖ రాశారు. ఇక ప్రభుత్వస్థాయిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇన్షియెల్ పేమెంట్ దరఖాస్తుదారుల ఎల్‌ఆర్‌ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగ అధికారులు చెబుతున్నారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ ముగింపు గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకొని న్యాయం చేయాలని దరఖాస్తుదారులు అంటున్నారు. కాగా, హెచ్‌ఎండీఏకు లక్షా 75 వేలకుపైగా దరఖాస్తులు వస్తే లక్షా రెండువేల దరఖాస్తులకు ఫైనల్ ప్రొసిడింగ్స్ ఇచ్చారు. మరో పదివేల దరఖాస్తులు రెవెన్యూ, ఇరిగేషన్ నుంచి ఎన్‌వోసీలు రాక పెండింగ్‌లో ఉన్నాయి. మాస్టర్ ప్లాన్‌లో రోడ్డు, శిఖం, చెరువులు, సరైన పత్రాలు ఆప్‌లోడ్ చేయలేదనే వివిధ కారణాలతో 63 వేల దరఖాస్తులు వరకు తిరస్కరించారు. వీటిలోనే ఎల్‌ఆర్‌ఎస్ ఇన్షియల్ పేమెంట్ చెల్లించని తొమ్మిదివేల దరఖాస్తులు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment