
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి తనవంతు సాయం అందించడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ ముందుకొచ్చారు. తన వేతనంలో ఏడాది పాటు 30 శాతం కోత విధించుకోవాలని నిర్ణయించారు. ఖర్చులకు కళ్లెం వేయడానికి పలు దేశీయ యాత్రలు, ఇతర కార్యక్రమాలను రాష్ట్రపతి గణనీయంగా తగ్గించుకుంటారు.
పరిమిత సంఖ్యలోనే అతిథులు..
రాష్ట్రపతి రామ్‌నాథ్ తాజా నిర్ణయాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ బడ్జెట్ 20 శాతం తగ్గుతుందని అంచనా. రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర బడ్జెట్‌కు ప్రతిఏటా రూ.200 కోట్లకుపైగా కేటాయిస్తారు. ఈసారి ఇందులో రూ.40–45 కోట్లు మిగలనున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోమ్, స్టేట్ బాంక్వెట్స్ వంటి కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించనున్నారు. వడ్డించే ఆహార పదార్థాల సంఖ్యను కుదిస్తారు. అలంకరణకు తక్కువ పుష్పాలు వాడనున్నారు. సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలకు ఉపయోగించే లిమోసిన్ కారు(ధర రూ.10 కోట్లు) కొనుగోలుకు ఈసారి దూరంగా ఉండాలని రాష్ట్రపతి నిర్ణయించారు. విద్యుత్, ఇంధన వ్యయాన్ని తగ్గించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని కార్యాలయాలను పర్యావరణ హితంగా మారుస్తారు. కాగితం వాడకాన్ని భారీగా తగ్గిస్తారు. పీఏం–కేర్స్ ఫండ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి నెలలో తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment