యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి సొంతూరికి బయల్దేరిన వలసకూలీల కుటుంబాలు
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నాటికి కరోనా మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య 724కు పెరిగిపోయింది. గత 24 గంటల్లో మరో ఏడుగురు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 17కు చేరుకుందని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరులతో అన్నారు. కర్ణాటకలో ఇప్పటివరకూ ఇద్దరు మరణించగా మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒకొక్కరు చొప్పున కరోనాకు బలైన విషయం తెలిసిందే.
వ్యాధి బాధితుల్లో 47 మంది విదేశీయులు కాగా, 66 మందికి నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క వ్యక్తి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాడని, దీంతో దేశం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 640 అయ్యిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యాధి చికిత్సకు మందులు అభివృద్ధి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టనున్న సాలిడారిటీ ట్రయల్‌లో భారత్ కూడా భాగస్వామి కానుందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయినా వైద్య పరికరాల కొరత రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థ నుంచి 10వేల వెంటిలేటర్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని, వీటికి అదనంగా మరో 30 వేల వెంటిలేటర్లను రానున్న ఒకట్రెండు రోజుల్లో తయారు చేయాల్సిందిగా భారత్ ఎలక్ట్రానిక్స్‌ను కోరామన్నారు. వలస కార్మికులకు ఆహారం, నీరు, పారిశుధ్య సౌకర్యాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించామని, హోటళ్లు, హాస్టళ్ల వంటివి తెరిచే ఉండాలని, తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ తెలిపారు. వలస కార్మికులను రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఆలోచన ఏదీ లేదని ఆమె స్పష్టం చేశారు.
రోగులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం టెలీమెడిసిన్ వినియోగంపై మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. గడచిన రెండు నెలల్లో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారు సుమారు 15 లక్షల మంది ఉన్నారని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబా తెలిపారు. కరోనా నేపథ్యంలో వీరందరినీ కచ్చితంగా పరిశీలించేందుకు నిఘా వ్యవస్థలను పటిష్టీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో సార్క్ దేశాలన్నింటికీ ఒక ఉమ్మడి ఎలక్ట్రానిక్ వేదికను ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. సార్క్ దేశాల ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ప్రతిపాదన చేసింది.
అతిక్రమించిన అధికారులపై చర్యలు..
లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తున్న అధికారులపై ప్రభుత్వాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తెలంగాణలో తన కుమారుడి అంతర్జాతీయ ప్రయాణ వివరాలను దాచి ఉంచినందుకు ఓ డీఎస్పీపై చర్యలు తీసుకున్నట్టుగానే కేరళలో ఓ ఐఏఎస్ అధికారిపై, ఢిల్లీలో ఓ పోలీస్ అధికారిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇటీవలే విదేశాల్లో హనీమూన్ జరుపుకుని వచ్చిన యువ ఐఏఎస్ అధికారి, కొల్లం సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రాపై నిబంధనల ఉల్లంఘనకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రయత్నించిన రైల్వే పోలీస్ అధికారిని అధికారులు సస్పెండ్ చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో మాస్కులు, శానిటైజర్లను అధిక ధరలకు అమ్ముతున్న ఓ కెమిస్టును విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు.
మా విమానాలు వాడుకోండి...
భారతీయ పౌరులను దేశంలోకి తిరిగి తీసుకొచ్చేందుకు, అత్యవసర సేవల కోసం తమ విమానాలు, సిబ్బంది, విమానాశ్రయ ఉద్యోగులను వాడుకోవచ్చునని ప్రైవేట్ విమానయాన సంస్థ గో ఎయిర్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇండిగో కూడా ఇటీవలే ఇలాంటి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం ఉండగా.. సరుకుల రవాణా చేసేవి మాత్రం యథావిధిగా చేయవచ్చు. అయితే ఇండిగో, గో ఎయిర్ లాంటి దేశీ విమానయాన సంస్థలు ప్రయాణికుల్లేకుండా, కేవలం
సరుకులు మాత్రమే రవాణా చేసేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
ఉపరాష్ట్రపతి ఒక నెల వేతనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు, లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన ఒక నెల వేతనాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.
షిర్డీ సాయి సంస్థాన్ రూ.51 కోట్ల విరాళం
సాక్షి ముంబై: కరోనా వైరస్‌పై పోరాటంలో మహారాష్ట్ర సర్కారును ఆదుకునేందుకు షిర్డీ సాయి సంస్థాన్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.51 కోట్ల విరాళం ప్రకటించింది. ‘రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే అయిదుగురు మృతి చెందగా, 120 మందికిపైగా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు షిర్డీ సాయి సంస్థాన్ సీఈఓ అరుణ్ డోంగరే పేర్కొన్నారు.
గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాధి విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రథమ పౌరులుగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంలో, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన మార్గదర్శనం చేయడంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పోషించే పాత్ర కీలకమని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం వారు సంయుక్తంగా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలను చైతన్య పరిచే విషయాల్లో చొరవతీసుకోవాలని సూచించారు.
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆహారపంపిణీ కేంద్రం వద్ద కొట్లాడుతున్న నిరాశ్రయులు
నిర్మానుష్యంగా మారిన కేరళలోని మెప్పుయుర్ రోడ్డుపై పునుగుపిల్లి
Comments
Please login to add a commentAdd a comment