న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 13,227 కోట్లకు చేరింది. దీనిలో యూఎస్ షేల్ ఆస్తుల విక్రయం ద్వారా లభించిన రూ. 737 కోట్ల అనుకోని లాభం కలసి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 6,348 కోట్లు మాత్రమే ఆర్జించింది.
కాగా.. 2019–20 క్యూ4లో రూ. 4,267 కోట్లమేర అసాధారణ నష్టం నమోదుకాగా.. తాజా(2020–21) త్రైమాసికంలో రూ. 787 కోట్లమేర ఆస్తుల విక్రయ లాభం జత కలసింది. వీటిని మినహాయిస్తే.. నికర లాభం 17 శాతం వృద్ధి సాధించినట్లని విశ్లేషకులు తెలియజేశారు. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 1,72,095 కోట్లను తాకింది. త్రైమాసికవారీగా చూస్తే ఆయిల్ టు కెమికల్(ఓటూసీ) బిజినెస్ మెరుగుపడినట్లు కంపెనీ తెలియజేసింది. కంపెనీ ఆర్జనలో టెలికం, రిటైల్ విభాగాల వాటా 33 శాతం నుంచి 45 శాతానికి ఎగసినట్లు ఆర్‌ఐఎల్ పేర్కొంది. వాటాదారులకు షేరుకి రూ. 7 డివిడెండ్ ప్రకటించింది.
జియో జూమ్: క్యూ4లో టెలికం విభాగం జియో నికర లాభం 47 శాతంపైగా జంప్‌చేసి రూ. 3,508 కోట్లయ్యింది. ఆదాయం 19 శాతం పెరిగి రూ. 18,278 కోట్లకు చేరింది. 1.54 కోట్లమంది సబ్‌స్క్రయిబర్లను జత చేసుకుంది. అయితే ఇంటర్ కనెక్ట్ యూసేజీ చార్జీల విధానాలలో చేపట్టిన మార్పుల కారణంగా సగటు వినియోగదారు ఆదాయం రూ. 151 నుంచి రూ. 138కు తగ్గింది. 2021 మార్చికల్లా 42.62 కోట్లమంది సబ్‌స్క్రయిబర్లను కలిగి ఉంది.
మార్చిలో జియో ఫోన్ ఆఫర్ కారణంగా వినియోగదారులు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక రిటైల్ బిజినెస్‌లో గ్రోసరీ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి రికార్డ్ ఆదాయం సమకూరడంతో నిర్వహణ లాభం 41 శాతం ఎగసింది. రూ. 3,623 కోట్లకు చేరింది. కాగా.. తొలిసారి జియో పూర్తి ఏడాది కార్యకలాపాల నేపథ్యంలో ఫలితాలు విడుదల చేసింది. వెరసి 2020–21లో రూ. 73,503 కోట్ల ఆదాయం, రూ. 12,537 కోట్ల నికర లాభం ఆర్జించింది.
ఓటూసీ, గ్యాస్ విభాగాలు
పెట్రోకెమికల్ మార్జిన్లలో రికవరీ కొనసాగినప్పటికీ కోవిడ్–19 కారణంగా రిఫైనరీలు తక్కువ సామర్థ్యంతో పనిచేసినట్లు ఆర్‌ఐఎల్ తెలియజేసింది. దీంతో ఓటూసీ ఇబిటా 4.6 శాతం నీరసించి రూ. 11,407 కోట్లకు పరిమితమైంది. తూర్పుతీర ప్రాంతంలోని కేజీ–డీ6 బ్లాకులో కొత్త డిస్కవరీలలో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభంకావడంతో కొన్నేళ్ల తదుపరి వరుసగా రెండో క్వార్టర్‌లో పన్నుకుముందు లాభాలు నమోదయ్యాయి.
కాగా.. పూర్తి ఏడాదికి(2020–21) నికర లాభం 35 శాతం పుంజుకుని రూ. 53,739 కోట్లకు చేరింది. టర్నోవర్ మాత్రం 18 శాతం క్షీణించి రూ. 5,39,238 కోట్లను తాకింది. ఆర్‌ఐఎల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.4 శాతం నీరసించి రూ. 1,996 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.
ఓటూసీ విభాగంలో పటిష్ట రికవరీని సాధించాం. టెలికం, జియోలతో కూడిన డిజిటల్ సర్వీసుల బిజినెస్‌లోనూ ప్రస్తావించదగ్గ వృద్ధిని చూపాం. అధికస్థాయిలకు చేరిన సైట్ల వినియోగ రేటు, డౌన్‌స్ట్రీమ్ ప్రొడక్టులు మెరుగుపడటం, ఇంధన రవాణా మార్జిన్లు వంటి అంశాలు ఓటూసీ బిజినెస్‌కు జోష్‌నిచ్చాయి. ప్రస్తుత సమస్యాత్మక పరిస్థితులలో కన్జూమర్ విభాగం దేశానికి డిజిటల్, ఫిజికల్ లైఫ్‌లైన్‌గా వినియోగపడింది. కోవిడ్–19 ప్రజల జీవితాలను విచ్చిన్నం చేస్తున్న నేపథ్యంలోనూ 75,000 మందికి ఉపాధి కల్పించాం.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment