జియో.. 5జీ గూగులీ! | Reliance Industries 43rd Annual General Meeting-2020 | Sakshi
Sakshi News home page

జియో.. 5జీ గూగులీ!

Published Thu, Jul 16 2020 4:43 AM | Last Updated on Thu, Jul 16 2020 11:35 AM

Reliance Industries 43rd Annual General Meeting-2020 - Sakshi

ముంబై: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన టెలికం సేవల సంస్థ జియో భారీ ప్రణాళికలకు తెరతీసింది. కొత్త తరం 5జీ  సేవలకు సంబంధించిన సొల్యూషన్స్‌ను సొంతంగా దేశీయంగా అభివృద్ధి చేసింది. వీటిని వచ్చే ఏడాదే అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అలాగే భారత అవసరాలకు అనుగుణంగా ఆండ్రాయిడ్‌ ఆధారిత చౌక 5జీ స్మార్ట్‌ఫోన్లను దేశీ సాంకేతికతతో రూపొందించాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం టెక్‌ దిగ్గజం గూగుల్‌తో జట్టు కట్టింది.

అదే సమయంలో డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్‌ దాదాపు రూ. 34 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. బుధవారం జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 5జీ స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే మేడిన్‌ ఇండియా 5జీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించవచ్చని, మరుసటి ఏడాది క్షేత్రస్థాయిలో ఉపయోగంలోకి తేవచ్చని అంబానీ తెలిపారు. ‘5జీ సొల్యూషన్‌ను ప్రారంభ స్థాయి నుంచి పూర్తిగా జియోనే డిజైన్‌ చేసి, అభివృద్ధి చేసిందని చెప్పేందుకు గర్వంగా ఉంది.

పూర్తిగా 100 శాతం దేశీ సాంకేతికత, సొల్యూషన్స్‌ను ఉపయోగించి ప్రపంచ స్థాయి 5జీ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని పేర్కొన్నారు. ‘ఆండ్రాయిడ్‌ ద్వారా అందరికీ కంప్యూటింగ్‌ సామర్థ్యాలను అందుబాటులోకి తేవాలన్నది మా లక్ష్యం. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఇది సరైన సమయం. జియోతో భాగస్వామ్యం ఆ దిశగా తొలి అడుగు‘ అని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. రిలయన్స్‌ తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏజీఎంలో జియోమీట్‌ ప్లాట్‌ఫాం ద్వారా 48 దేశాల్లోని 550 నగరాల నుంచి ఏకంగా 3.2 లక్షల మంది షేర్‌హోల్డర్లు పాల్గొన్నారు.

2జీ విముక్త భారత్‌..    
5జీ సేవల ముంగిట్లో ఉన్న భారత్‌ను పూర్తిగా 2జీ నుంచి విముక్తం చేయాలన్న లక్ష్యం దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం 2జీ ఫీచర్‌ ఫోన్లను ఉపయోగిస్తున్న దాదాపు 35 కోట్ల మంది భారతీయులను చౌక స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లేలా చేయాల్సి ఉందని అంబానీ తెలిపారు. ‘చాలా మంది ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు కాస్త చౌకగా ఉండే స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. ఈ సవాలును ఎదుర్కొనాలని నిర్ణయించుకున్నాం.

మనం ఎంట్రీ లెవెల్‌ 4జీ .. అంతకు మించి ఆఖరుకు 5జీ స్మార్ట్‌ఫోన్లయినా సరే ప్రస్తుతమున్న ధరకన్నా అత్యంత చౌకగా డిజైన్‌ చేయగలమన్న నమ్మకం ఉంది‘ అని అంబానీ తెలిపారు. అయితే, ఇందుకోసం భారత్‌ అవసరాలకు అనుగుణంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టం అవసరమన్నారు. టెక్‌ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం ద్వారా ఇది సుసాధ్యం కాగలదని చెప్పారు. భారత్‌ స్థాయిలో 5జీ సొల్యూషన్స్‌ ఉపయోగం నిరూపితమైన తర్వాత వీటిని అంతర్జాతీయంగా ఇతర టెల్కోలకు కూడా వీటిని ఎగుమతి చేస్తామని తెలిపారు.

ప్చ్‌.. సౌదీ ఆరామ్‌కో కుదరలేదు..
చమురు, రసాయనాల (ఓ2సీ) వ్యాపారంలో సౌదీ ఆరామ్‌కో సంస్థకు వాటాలు విక్రయించాలన్న ప్రతిపాదన అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదని అంబానీ చెప్పారు. కరోనా వైరస్‌ సంబంధ పరిణామాలు ఇందుకు కారణమని పేర్కొన్నారు. సౌదీ ఆరామ్‌కోతో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్న అంబానీ.. డీల్‌ ప్రస్తుత స్థితి గురించి వెల్లడించలేదు. సౌదీ ఆరామ్‌కో సంస్థకు ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సుమారు 15 బిలియన్‌ డాలర్లకు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నట్లు రిలయన్స్‌ గతేడాది ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ2సీ వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా విడదీస్తున్నట్లు, 2021 తొలినాళ్లలో ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంబానీ చెప్పారు.

ఆన్‌లైన్‌ ఏజీఎం రికార్డు
వర్చువల్‌ విధానంలో నిర్వహించిన రిలయన్స్‌ ఏజీఎంలో రికార్డు స్థాయిలో షేర్‌హోల్డర్లు పాల్గొన్నారు. 48 దేశాల్లోని 550 నగరాల నుంచి దాదాపు 3.2 లక్షల మంది ఇందులో పాల్గొన్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌ వెల్లడించింది. ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద వర్చువల్‌ ఏజీఎంగా అంచనా. రిలయన్స్‌కి 26 లక్షల పైచిలుకు షేర్‌హోల్డర్లు ఉన్నారు.

2035 నాటికి జీరో కార్బన్‌
ప్రస్తుతం వాహనాల్లో వినియోగిస్తున్న ఇంధనాల స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్, హైడ్రోజన్‌ మొదలైన వాటిని అందుబాటులోకి తెస్తామని అంబానీ చెప్పారు. టెక్నాలజీ సాయంతో కర్బన ఉద్గారాలను ఉపయోగకర ఉత్పత్తులు, రసాయనాల కింద మార్చడంపై దృష్టి పెడతామన్నారు. తద్వారా 2035 నాటికి కార్బన్‌–జీరో సంస్థగా మారాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

జియో గ్లాస్‌.. ఆన్‌లైన్‌ విప్లవం
మిక్సిడ్‌ రియాలిటీ సర్వీసులు అందించే జియో గ్లాస్‌ను రిలయన్స్‌ జియో ఆవిష్కరించింది. దీని బరువు 75 గ్రాములు ఉంటుంది. కేబుల్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్‌ చేస్తే ఇంటర్నెట్‌ ఉపయోగించుకోవచ్చు. 25 ఇన్‌బిల్ట్‌ యాప్స్‌ ఉంటాయి. వాయిస్‌ కమాండ్‌తో కాల్స్‌ చేయొచ్చు. ఆఫీసుల్లో జరిగే సమావేశాల్లో ఇంటి వద్ద నుంచే పాల్గొనడం, ఉపాధ్యాయులు 3డీ వర్చువల్‌ రూమ్స్‌ ద్వారా హోలోగ్రామ్‌ తరగతులను నిర్వహించడం తదితర అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ ఎం థామస్‌ తెలిపారు. దీని ధర ఎంత ఉంటుందన్నదీ వెల్లడించకపోయినప్పటికీ, మార్కెట్లో ఈ తరహా గ్లాస్‌ల రేటు సుమారు రూ. 37,000–40,000 స్థాయిలో ఉంటోంది.

జియో మీట్‌ 50 లక్షల డౌన్‌లోడ్స్‌..
దేశీయంగా తొలి క్లౌడ్‌ ఆధారిత వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌ జియోమీట్‌ను ప్రవేశపెట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే 50 లక్షల డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయని అంబానీ తెలిపారు. మరో వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌ జూమ్‌కు పోటీగా జియో దీన్ని ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్‌ తదితర ప్లాట్‌ఫామ్స్‌లో ఇది పనిచేస్తుంది. జూమ్‌లాగా 40 నిమిషాల కాలపరిమితి లాంటివి ఇందులో ఉండవని, 24 గంటలూ కాల్స్‌ కొనసాగించవచ్చని జియో పేర్కొంది.

గూగుల్‌ 33,373 కోట్లు
ముంబై: జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా జియోలో టెక్‌ దిగ్గజం గూగుల్‌ 7.7 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం గూగుల్‌ రూ. 33,373 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. దీని ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్‌ విలువ సుమారు రూ. 4.36 లక్షల కోట్లుగా ఉంటుంది. గత వారమే సుమారు రూ. 4.91 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో జియోలో చిప్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ ఇన్వెస్ట్‌ చేసింది. తాజాగా జియోలో ఇన్వెస్ట్‌ చేసిన దిగ్గజాల్లో గూగుల్‌ 13వది. కేవలం 12 వారాల వ్యవధిలో వాటాల విక్రయం ద్వారా జియో సుమారు రూ. 1,52,055 కోట్లు సమీకరిం చినట్లయింది. 32.94 శాతం వాటాలు విక్రయించింది. గూగుల్‌కి వాటాల అమ్మకంతో జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి తొలి దశ పెట్టుబడుల సమీకరణ పూర్తయినట్లు ముకేశ్‌ అంబానీ చెప్పారు.

రుణరహిత కంపెనీ..
గడిచిన మూడు నెలల్లో రిలయన్స్‌ మొత్తం మీద రూ. 2,12,809 కోట్లు సమీకరించినట్లు అంబానీ తెలిపారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులతో పాటు రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ. 53,124 కోట్లు, ఇంధన రిటైల్‌ వెంచర్‌లో బ్రిటన్‌ దిగ్గజం బీపీ చేసిన రూ. 7,629 కోట్ల పెట్టుబడులు కూడా వీటిలో ఉన్నాయి. ‘2021 మార్చి కన్నా ముందుగానే రిలయన్స్‌ ప్రస్తుతం నికరంగా రుణ రహిత కంపెనీగా మారింది. జియో, రిటైల్, చమురు–రసాయనాల (ఓ2సీ) వ్యాపారాల వృద్ధికి తోడ్పడేలా పటిష్టంగా మారింది‘ అని అంబానీ తెలిపారు.

ఆయా ఒప్పందాలకు సంబంధించిన నిధులు దఖలు పడిన తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికరంగా రుణ రహిత సంస్థగా మారనుంది. రైట్స్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తంలో 75 శాతం  నిధులు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయి. 2020 మార్చి 31 నాటికి రిలయన్స్‌ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. ఏప్రిల్‌ 22న ఫేస్‌బుక్‌ రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్‌ (9.99 శాతం వాటా) చేయడం ద్వారా మొదలైన పెట్టుబడుల పరంపర ఆ తర్వాత వేగం పుంజుకుంది. ఆరు అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు, చిప్‌ తయారీ సంస్థలు ఇంటెల్‌ కార్పొరేషన్‌ .. క్వాల్‌కామ్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.

షేరు... రేసు గుర్రమే!
గత ఏజీఎమ్‌ (12–8–2019) నాటి ధర రూ.1,151
ఏడాది కనిష్ట ధర (23–3–2020) రూ.867
బుధవారం ఆల్‌టైమ్‌ గరిష్ట ధర (15–7–2020–ఇంట్రాడే) రూ.1,978  


జియోలో 7.7 శాతం వాటా కొనుగోలు...
జియో ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూహాత్మక ఇన్వెస్టరుగా గూగుల్‌ను సాదరంగా స్వాగతిస్తున్నాం. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య, పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనితో తొలి దశ పెట్టుబడుల సమీకరణ లక్ష్యం పూర్తయ్యింది. కోట్లాది మంది భారతీయులకు ఉపయోగకరమైన సమాచారాన్ని గూగుల్‌ అందుబాటులోకి తెచ్చింది. జియో తరహాలోనే కొంగొత్త మార్పులు, నవకల్పనలను ఆవిష్కరిస్తోంది.

– ముకేశ్‌ అంబానీ,  చైర్మన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

భారత్‌ డిజిటలీకరణలో జియో ప్లాట్‌ఫామ్స్‌ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించగలిగితే మిగతా అందరు యూజర్లకు కూడా అనువైన ఉత్పత్తులను రూపొందించవచ్చన్న మా అభి ప్రాయానికి ఊతమిస్తోంది. జియోతో భాగస్వామ్యం ద్వారా కోట్ల మంది భారతీయులకు స్మార్ట్‌ఫోన్‌ను మరింత అందుబాటులోకి తేగలదని ఆశిస్తున్నాం.

– సుందర్‌ పిచాయ్, సీఈవో, గూగుల్‌
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement