Indian Technology
-
భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా
న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్‌ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు. రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ హార్డ్‌వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్–వేరబుల్స్ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 2023–24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
బ్రేకేయకున్నా ఢీకొట్టలే!
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలు.. వికారాబాద్ రైల్వే సెక్షన్ పరిధిలోని గొల్లగూడ–చిట్టిగడ్డ మధ్య ప్రాంతం.. ఒకవైపు నుంచి రైలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.. అదే ట్రాక్‌పై ఎదురుగా లోకో ఇంజిన్ 80 కిలోమీటర్ల వేగంతో వస్తోంది.. రెండింటి మధ్య దూరం 600 మీటర్లే.. అయినా దేనికీ బ్రేకులు వేయలేదు.. కానీ చూస్తుండగానే రెండూ ఆటోమేటిగ్గా వేగం తగ్గించుకున్నాయి. రెండింటి మధ్య 380 మీటర్ల దూరం ఉందనగా ఆగిపోయాయి. అంటే ఎదురెదురుగా దూసుకొస్తున్న రైళ్లు బ్రేకులతో ప్రమేయం లేకుండా, లోకో పైలట్ల (రైలు నడిపేవారు) జోక్యం లేకుండానే ఆగిపోయి ప్రమాదాన్ని నివారించాయి. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ‘కవచ్’ పరిజ్ఞానమే దీనికి కారణం. తొలుత టి–కాస్ పేరుతో రూపొందిన ఈ పరిజ్ఞానంపై ఎనిమిదేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా మేకిన్ ఇండియాలో భాగంగా ‘కవచ్’ పేరిట పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. మరో విశేషం ఏమిటో తెలుసా.. ఇలా ఒకేట్రాక్‌పై దూసుకొచ్చిన ఓ రైలులో స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉండగా.. ఎదురుగా వచ్చిన ఇంజన్లో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్ కుమార్ త్రిపాఠీ ఉన్నారు. త్వరలోనే ‘కవచ్’ను దేశవ్యాప్తంగా రైళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో దీనిని స్వయంగా పరిశీలించేందుకు రైల్వే మంత్రి ఈ పరీక్షలో పాల్గొన్నారు. కవచ్ సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం అయిందని చెబుతున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. చిత్రంలో ఎంపీ అర్వింద్ తదితరులు కిలోమీటరుకు రూ. 50 లక్షల ఖర్చు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్’ పూర్తిస్థాయిలో విజయవంతం కావటం గర్వకారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రశంసించారు. ‘‘కవచ్ అద్భుతంగా పనిచేస్తుందని ధీమాగా చెప్పగలను. అందుకే బహిరంగంగా, అందరి సమక్షంలో ప్రయోగించి చూశాం. దీన్ని దేశవ్యాప్తంగా.. ఏటా నాలుగైదు వేల కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేస్తాం. కవచ్ పరిజ్ఞానం కోసం కిలోమీటర్‌కు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చవుతుంది. అదే యూరోపియన్ పరిజ్ఞానానికైతే కిలోమీటర్‌కు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుంది. పైగా కవచ్ వాటి కంటే సమర్థవంతమైనది. అందుకే దీన్ని సగర్వంగా ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేస్తాం’’ అని రైల్వే మంత్రి చెప్పారు. అన్ని రూల్స్.. ఆటోమేటిగ్గా.. ►తొలుత రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ విడివిడిగా రెండు రైళ్లలో బయలుదేరారు. సనత్‌నగర్ దాటాక ఒకేట్రాక్లో ముందు మంత్రి ఉన్న రైలు, వెనుక బోర్డు చైర్మన్ ఉన్న రైలు ప్రయాణించాయి. ముందున్న రైలుకు వెనకాల ఉన్న రైలు చేరువగా వచ్చే ప్రయత్నం చేసింది. లోకో పైలట్ బ్రేకు వేయకున్నా.. వెనకాల ఉన్న రైలు దానంతట అదే వేగం తగ్గి, ఆగిపోయింది. ►ఒకచోట మధ్యలో రెడ్ సిగ్నల్ పడినా లోకోపైలట్ బ్రేకు వేయకుండా ముందుకు నడిపించారు. కానీ ఆటోమేటిగ్గా బ్రేకు పడి రైలు ఆగిపోయింది. ►లెవల్ క్రాసింగ్ వద్ద నిర్ధారిత దూరం నుంచి హారన్ మోగించాలి. కానీ లోకోపైలట్ మోగించకున్నా.. నిర్ధారిత ప్రాంతానికి చేరుకోగానే ఆటోమేటిక్‌గా రైలు కూత వేసింది. ►లూప్లైన్లో వెళ్లేప్పుడు గంటకు 20 కిలోమీటర్ల లోపు వేగం ఉండాలన్న నిబంధన ఉంది. వేగంగా నడిపేందుకు లోకో పైలట్ ప్రయత్నించినా రైలు దానంతట అదే వేగం తగ్గింది. ►పెద్ద మలుపులో రైలుగరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు మించొద్దు. అంతకన్నా వేగంగా నడిపితే రైలు ఆటోమేటిగ్గా ఆ వేగానికి తగ్గిపోయింది. ఎలా పనిచేస్తుంది? రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ ‘రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)’ కవచ్ పరిజ్ఞానాన్ని రూపొందిం చింది. కొన్ని దేశీ పరిశ్రమలు పరికరాలను తయారు చేసి సమకూర్చాయి. 2013లో ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టం(టీకాస్)పేరుతో.. వికారాబాద్–వాడీ–సనత్ నగర్ సెక్షన్ల మధ్య ప్రయోగాలు చేసి, అభి వృద్ధి చేశారు. ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వేస్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్ పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాబ్‌లను అమర్చుతారు. రేడి యో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాం తాల్లో 40 మీటర్ల ఎత్తు ఉండే టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేజ్లతో అన్నిం టినీ అనుసంధానిస్తారు. ఈ మొత్తం పరి జ్ఞానం ఎప్పటికప్పుడు రైళ్లను పరిశీలిస్తుం టుంది. లోకోపైలట్ ముందుండే స్క్రీన్‌లో సమాచారం డిస్ప్లే అవుతుంది. మంచు, రాత్రి సమయాలు, ఇతర కారణాలతో మసకగా ఉన్నప్పుడు.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగ్నల్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఏ చిన్న సమస్య చోటుచేసుకున్నా.. వెంటనే లోకోపైలట్‌ను, స్టేషన్‌లోని అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా పరస్పరం సమాచారాన్ని కూడా పంపించుకోవచ్చు. కొత్త ధైర్యం వచ్చింది ‘‘కవచ్‌తో ఎంతో దూరం నుంచి కూడా సిగ్నళ్లను తెలుసుకోగలం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రమాదాలకు అవకాశం ఉండదు. ప్రయాణికులకు పూర్తి ధైర్యం, నమ్మకాన్ని కల్పించగలం. మాకు కూడా కొత్త ధైర్యం వచ్చింది’’ – జీఎస్ ప్రసాద్, రైలు లోకో పైలట్ -
జియో.. 5జీ గూగులీ!
ముంబై: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన టెలికం సేవల సంస్థ జియో భారీ ప్రణాళికలకు తెరతీసింది. కొత్త తరం 5జీ సేవలకు సంబంధించిన సొల్యూషన్స్‌ను సొంతంగా దేశీయంగా అభివృద్ధి చేసింది. వీటిని వచ్చే ఏడాదే అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అలాగే భారత అవసరాలకు అనుగుణంగా ఆండ్రాయిడ్ ఆధారిత చౌక 5జీ స్మార్ట్ఫోన్లను దేశీ సాంకేతికతతో రూపొందించాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం టెక్ దిగ్గజం గూగుల్‌తో జట్టు కట్టింది. అదే సమయంలో డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ దాదాపు రూ. 34 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బుధవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 5జీ స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే మేడిన్ ఇండియా 5జీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించవచ్చని, మరుసటి ఏడాది క్షేత్రస్థాయిలో ఉపయోగంలోకి తేవచ్చని అంబానీ తెలిపారు. ‘5జీ సొల్యూషన్‌ను ప్రారంభ స్థాయి నుంచి పూర్తిగా జియోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేసిందని చెప్పేందుకు గర్వంగా ఉంది. పూర్తిగా 100 శాతం దేశీ సాంకేతికత, సొల్యూషన్స్‌ను ఉపయోగించి ప్రపంచ స్థాయి 5జీ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని పేర్కొన్నారు. ‘ఆండ్రాయిడ్ ద్వారా అందరికీ కంప్యూటింగ్ సామర్థ్యాలను అందుబాటులోకి తేవాలన్నది మా లక్ష్యం. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఇది సరైన సమయం. జియోతో భాగస్వామ్యం ఆ దిశగా తొలి అడుగు‘ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. రిలయన్స్ తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించిన ఏజీఎంలో జియోమీట్ ప్లాట్‌ఫాం ద్వారా 48 దేశాల్లోని 550 నగరాల నుంచి ఏకంగా 3.2 లక్షల మంది షేర్హోల్డర్లు పాల్గొన్నారు. 2జీ విముక్త భారత్.. 5జీ సేవల ముంగిట్లో ఉన్న భారత్‌ను పూర్తిగా 2జీ నుంచి విముక్తం చేయాలన్న లక్ష్యం దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం 2జీ ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్న దాదాపు 35 కోట్ల మంది భారతీయులను చౌక స్మార్ట్ఫోన్ల వైపు మళ్లేలా చేయాల్సి ఉందని అంబానీ తెలిపారు. ‘చాలా మంది ఫీచర్ ఫోన్ యూజర్లు కాస్త చౌకగా ఉండే స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. ఈ సవాలును ఎదుర్కొనాలని నిర్ణయించుకున్నాం. మనం ఎంట్రీ లెవెల్ 4జీ .. అంతకు మించి ఆఖరుకు 5జీ స్మార్ట్ఫోన్లయినా సరే ప్రస్తుతమున్న ధరకన్నా అత్యంత చౌకగా డిజైన్ చేయగలమన్న నమ్మకం ఉంది‘ అని అంబానీ తెలిపారు. అయితే, ఇందుకోసం భారత్ అవసరాలకు అనుగుణంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టం అవసరమన్నారు. టెక్ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం ద్వారా ఇది సుసాధ్యం కాగలదని చెప్పారు. భారత్ స్థాయిలో 5జీ సొల్యూషన్స్ ఉపయోగం నిరూపితమైన తర్వాత వీటిని అంతర్జాతీయంగా ఇతర టెల్కోలకు కూడా వీటిని ఎగుమతి చేస్తామని తెలిపారు. ప్చ్.. సౌదీ ఆరామ్కో కుదరలేదు.. చమురు, రసాయనాల (ఓ2సీ) వ్యాపారంలో సౌదీ ఆరామ్కో సంస్థకు వాటాలు విక్రయించాలన్న ప్రతిపాదన అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదని అంబానీ చెప్పారు. కరోనా వైరస్ సంబంధ పరిణామాలు ఇందుకు కారణమని పేర్కొన్నారు. సౌదీ ఆరామ్కోతో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్న అంబానీ.. డీల్ ప్రస్తుత స్థితి గురించి వెల్లడించలేదు. సౌదీ ఆరామ్కో సంస్థకు ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సుమారు 15 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నట్లు రిలయన్స్ గతేడాది ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ2సీ వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా విడదీస్తున్నట్లు, 2021 తొలినాళ్లలో ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంబానీ చెప్పారు. ఆన్లైన్ ఏజీఎం రికార్డు వర్చువల్ విధానంలో నిర్వహించిన రిలయన్స్ ఏజీఎంలో రికార్డు స్థాయిలో షేర్హోల్డర్లు పాల్గొన్నారు. 48 దేశాల్లోని 550 నగరాల నుంచి దాదాపు 3.2 లక్షల మంది ఇందులో పాల్గొన్నట్లు కంపెనీ వెబ్సైట్ వెల్లడించింది. ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద వర్చువల్ ఏజీఎంగా అంచనా. రిలయన్స్‌కి 26 లక్షల పైచిలుకు షేర్హోల్డర్లు ఉన్నారు. 2035 నాటికి జీరో కార్బన్ ప్రస్తుతం వాహనాల్లో వినియోగిస్తున్న ఇంధనాల స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్, హైడ్రోజన్ మొదలైన వాటిని అందుబాటులోకి తెస్తామని అంబానీ చెప్పారు. టెక్నాలజీ సాయంతో కర్బన ఉద్గారాలను ఉపయోగకర ఉత్పత్తులు, రసాయనాల కింద మార్చడంపై దృష్టి పెడతామన్నారు. తద్వారా 2035 నాటికి కార్బన్–జీరో సంస్థగా మారాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. జియో గ్లాస్.. ఆన్లైన్ విప్లవం మిక్సిడ్ రియాలిటీ సర్వీసులు అందించే జియో గ్లాస్‌ను రిలయన్స్ జియో ఆవిష్కరించింది. దీని బరువు 75 గ్రాములు ఉంటుంది. కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేస్తే ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. 25 ఇన్‌బిల్ట్ యాప్స్ ఉంటాయి. వాయిస్ కమాండ్‌తో కాల్స్ చేయొచ్చు. ఆఫీసుల్లో జరిగే సమావేశాల్లో ఇంటి వద్ద నుంచే పాల్గొనడం, ఉపాధ్యాయులు 3డీ వర్చువల్ రూమ్స్ ద్వారా హోలోగ్రామ్ తరగతులను నిర్వహించడం తదితర అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ ఎం థామస్ తెలిపారు. దీని ధర ఎంత ఉంటుందన్నదీ వెల్లడించకపోయినప్పటికీ, మార్కెట్లో ఈ తరహా గ్లాస్‌ల రేటు సుమారు రూ. 37,000–40,000 స్థాయిలో ఉంటోంది. జియో మీట్ 50 లక్షల డౌన్లోడ్స్.. దేశీయంగా తొలి క్లౌడ్ ఆధారిత వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జియోమీట్‌ను ప్రవేశపెట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే 50 లక్షల డౌన్లోడ్స్ నమోదయ్యాయని అంబానీ తెలిపారు. మరో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్‌కు పోటీగా జియో దీన్ని ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లో ఇది పనిచేస్తుంది. జూమ్లాగా 40 నిమిషాల కాలపరిమితి లాంటివి ఇందులో ఉండవని, 24 గంటలూ కాల్స్ కొనసాగించవచ్చని జియో పేర్కొంది. గూగుల్ 33,373 కోట్లు ముంబై: జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా జియోలో టెక్ దిగ్గజం గూగుల్ 7.7 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం గూగుల్ రూ. 33,373 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. దీని ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ విలువ సుమారు రూ. 4.36 లక్షల కోట్లుగా ఉంటుంది. గత వారమే సుమారు రూ. 4.91 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో జియోలో చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ ఇన్వెస్ట్ చేసింది. తాజాగా జియోలో ఇన్వెస్ట్ చేసిన దిగ్గజాల్లో గూగుల్ 13వది. కేవలం 12 వారాల వ్యవధిలో వాటాల విక్రయం ద్వారా జియో సుమారు రూ. 1,52,055 కోట్లు సమీకరిం చినట్లయింది. 32.94 శాతం వాటాలు విక్రయించింది. గూగుల్‌కి వాటాల అమ్మకంతో జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి తొలి దశ పెట్టుబడుల సమీకరణ పూర్తయినట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. రుణరహిత కంపెనీ.. గడిచిన మూడు నెలల్లో రిలయన్స్ మొత్తం మీద రూ. 2,12,809 కోట్లు సమీకరించినట్లు అంబానీ తెలిపారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులతో పాటు రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,124 కోట్లు, ఇంధన రిటైల్ వెంచర్లో బ్రిటన్ దిగ్గజం బీపీ చేసిన రూ. 7,629 కోట్ల పెట్టుబడులు కూడా వీటిలో ఉన్నాయి. ‘2021 మార్చి కన్నా ముందుగానే రిలయన్స్ ప్రస్తుతం నికరంగా రుణ రహిత కంపెనీగా మారింది. జియో, రిటైల్, చమురు–రసాయనాల (ఓ2సీ) వ్యాపారాల వృద్ధికి తోడ్పడేలా పటిష్టంగా మారింది‘ అని అంబానీ తెలిపారు. ఆయా ఒప్పందాలకు సంబంధించిన నిధులు దఖలు పడిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరంగా రుణ రహిత సంస్థగా మారనుంది. రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తంలో 75 శాతం నిధులు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయి. 2020 మార్చి 31 నాటికి రిలయన్స్ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. ఏప్రిల్ 22న ఫేస్బుక్ రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ (9.99 శాతం వాటా) చేయడం ద్వారా మొదలైన పెట్టుబడుల పరంపర ఆ తర్వాత వేగం పుంజుకుంది. ఆరు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, చిప్ తయారీ సంస్థలు ఇంటెల్ కార్పొరేషన్ .. క్వాల్కామ్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. షేరు... రేసు గుర్రమే! గత ఏజీఎమ్ (12–8–2019) నాటి ధర రూ.1,151 ఏడాది కనిష్ట ధర (23–3–2020) రూ.867 బుధవారం ఆల్‌టైమ్ గరిష్ట ధర (15–7–2020–ఇంట్రాడే) రూ.1,978 జియోలో 7.7 శాతం వాటా కొనుగోలు... జియో ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూహాత్మక ఇన్వెస్టరుగా గూగుల్‌ను సాదరంగా స్వాగతిస్తున్నాం. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య, పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనితో తొలి దశ పెట్టుబడుల సమీకరణ లక్ష్యం పూర్తయ్యింది. కోట్లాది మంది భారతీయులకు ఉపయోగకరమైన సమాచారాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. జియో తరహాలోనే కొంగొత్త మార్పులు, నవకల్పనలను ఆవిష్కరిస్తోంది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్ డిజిటలీకరణలో జియో ప్లాట్‌ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించగలిగితే మిగతా అందరు యూజర్లకు కూడా అనువైన ఉత్పత్తులను రూపొందించవచ్చన్న మా అభి ప్రాయానికి ఊతమిస్తోంది. జియోతో భాగస్వామ్యం ద్వారా కోట్ల మంది భారతీయులకు స్మార్ట్‌ఫోన్‌ను మరింత అందుబాటులోకి తేగలదని ఆశిస్తున్నాం. – సుందర్ పిచాయ్, సీఈవో, గూగుల్ -
అంతరిక్ష పరిశోధనల్లో భారత్ టాప్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: అంతరిక్ష పరిశోధనల్లో భారత్ నాలుగో అగ్రగామిగా ఖ్యాతి దక్కించుకుందని ఇజ్రాయెల్‌కు చెందిన ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త బ్రిగ్ జెన్ (ఆర్ఈఎస్) ప్రొఫెసర్ చైమ్ ఈష్డె పేర్కొన్నారు. బెంగళూర్ వేదికగా ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్– 2019 సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమత్రి అశ్వర్ధ నారాయణ పాల్గొని మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు అంతరిక్ష విప్లవం భారత్ ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో విప్లవం రానుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త బ్రిగ్ జెన్ అన్నారు. యువ శక్తిశీల దేశమైన భారత్‌లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అపారమన్నారు. ప్రత్యేకించి సైన్స్ , ఇంజినీరింగ్ సాంకేతికతలో అద్భుతాలు సృష్టించే యువత భారత్‌కు అమూల్యమైన సంపద అంటూ కొనియాడారు. భారత్ చంద్రయాన్–2ను విజయవంతంగా నింగికి పంపి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కించుకుందన్నారు. భారత యువతకు ఆ సత్తా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇజ్రాయిల్ టు సౌత్ ఇండియా ప్రత్యేక అతిథిగా హాజరైన డానా కుర్‡్ష మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనల్లో అంకితభావంతో కృషి చేస్తున్న యువత పనితీరు ప్రశంసనీయన్నారు. భారత్, ఇజ్రాయెల్ అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యంతో చేస్తున్న కృషిని కొనియాడారు. ఇండో–ఇజ్రాయెల్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రామ్, నీటి నిర్వహణ తదితర రంగాల్లో భారత్‌కు సహకరిస్తామన్నారు. 75 ఏళ్లు.. 75 ఉపగ్రహాలు 2022కు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆ సందర్భంగా 75 విద్యార్థి రూపకల్ప ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చొరవ చూపిస్తామని ఐటీసీ–2019 చైర్మన్ మురళీకృష్ణా రెడ్డి అన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 7 విద్యార్థి రూపకల్పన ఉపగ్రహాలు ఉన్నాయన్నారు. ఐటీ, బీటీ రంగాలే రేపటి భవిష్యత్తు అని అటల్జీ మాటలను పద్మశ్రీ డాక్టర్ వాసుగం గుర్తుచేశారు. ఈ సదస్సులో 7 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజినీర్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉడే పి.కృష్ణ, ప్రొఫెసర్ ఎంఆర్ ప్రాణేష్, డాక్టర్ బీవీఏ రావులు పాల్గొన్నారు. -
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా వస్తున్న ట్రైన్ 18
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి వారణాసి వరకూ నడిచే అత్యాధునిక హైస్పీడ్ ట్రైన్ 18 పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నిర్ణయించినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దేశీయ పరిజ్ఞానంతో భారత ఇంజనీర్లు రూపొందించిన ఈ రైలు మేక్ ఇన్ ఇండియా కింద ప్రపంచ స్ధాయి రైళ్ల నిర్మాణం మనకు సాధ్యమవుతుందనేందుకు నిదర్శనమని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 16 కోచ్‌ల ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలును రూ 97 కోట్ల వ్యయంతో రాయ్‌బరేలిలోని మోడ్రన్ కోచ్ ఫ్యాకర్టీ 18 నెలల పాటు శ్రమించి పట్టాలపైకి ఎక్కించనుంది. 30 సంవత్సరాల కిందట ప్రారంభించిన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ వారసత్వానికి కొనసాగింపుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను భావిస్తున్నారు. పూర్తి ఏసీ సదుపాయం కలిగిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే తొలి ఇంజన్ రహిత రైలుగా గుర్తింపు పొందనుంది. రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లుండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్, అలహాబాద్లలో ఆగుతుంది. -
ఐదేళ్లలో రక్షణ రంగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానం
విశాఖ సిటీ: దేశ రక్షణ రంగంలో ఇప్పటి వరకు 60 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, రానున్న ఐదేళ్లలో 100 శాతం వినియోగించే దిశగా అడుగులేస్తున్నట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్ సతీష్‌రెడ్డి చెప్పారు. విశాఖలోని నేవల్ సైన్స్ టెక్నాలజీ లేబొరేటరీ(ఎన్ఎస్టీఎల్) 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మహాపాత్ర ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన రైజింగ్ డే ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్తులో దేశంలో వినియోగించే ప్రతి ఆయుధం, సామగ్రిని ఇండియన్ టెక్నాలజీతో రూపొందిస్తామని చెప్పారు. లాంతర్గామి విధ్వంసక టార్పెడో ప్రాజెక్టు వరుణాస్త్రకు డిమాండ్ ఉండటం వల్ల.. దాన్ని ఎగుమతి చేసే సత్తా దేశానికి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. వరుణాస్త్రలో భాగంగా తేలికపాటి టార్పెడోల తయారీకి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. వరుణాస్త్ర సహా మారీచ్, థాల్ టెక్నాలజీలను డిజైన్‌తో పాటు అభివృద్ధిచేసి దేశంలోని పలు సంస్థలకు బదిలీచేసే దిశగా కృషి చేయాలని సూచించారు. భారత రక్షణ పరిశోధన రంగంలోనూ స్టార్టప్‌లను ప్రోత్సహించేలా అడుగులేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్టీఎల్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌వీఎస్‌ఎస్ మూర్తితోపాటు సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అప్పలరాజు, సైంటిస్ట్ వర్కర్స్ కమిటీ దూబే, పీవీఎస్ గణేష్‌కుమార్ పాల్గొన్నారు. -
మన స్టెంట్లే మేలు..
సాక్షి, న్యూఢిల్లీ : బహుళజాతి కంపెనీలు రూపొందించే స్టెంట్లతో పోలిస్తే దేశీయంగా తయారయ్యే కరోనరీ స్టెంట్లే మేలైనవని తాజా అథ్యయనం వెల్లడించింది. అమెరికాలోని శాండియాగోలో నాన్ సర్జికల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్పై ఇటీవల జరిగిన సదస్సులో అథ్యయన వివరాలు సమర్పించారు. యూరప్ సహా పలు దేశాల్లోని 1500 మంది రోగులపై నిర్వహించిన ఈ అథ్యయనాన్ని ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఆర్ఓ) పర్యవేక్షించింది. విదేశాల్లో తయారయ్యే స్టెంట్లలో ఉండే నాణ్యత, సామర్థ్యం భారత్‌లో తయారయ్యే దేశీయ స్టెంట్లకు లేదని చాలా మంది డాక్టర్లు, రోగుల్లో ఉండే అపోహలను ఈ అథ్యయనం పటాపంచలు చేసింది. గుండె ధమనుల్లో పూడికలకు చికిత్స అందించే క్రమంలో లోహంతో తయారయ్యే కరోనరీ స్టెంట్లపై పాలిమర్స్‌తో ఔషధపు పూత ఉంటుంది. దీర్ఘకాలం సరైన సామర్థ్యంతో పనిచేసేలా వీటిని తయారుచేస్తారు. యూరప్, అమెరికాల్లో తయారయ్యే అబాట్ వాస్కులర్ కంపెనీకి చెందిన జిన్స్ స్టెంట్‌తో పోలిస్తే భారత్‌లో రూపొందే ఎస్‌ఎంటీకి చెందిన సుప్రాఫ్లెక్స్ స్టెంట్ మెరుగైనదని రాండమ్ ట్రయల్‌లో పలువురు పేర్కొన్నారు. దేశీయ స్టెంట్లు చవకగా అందుబాటులో ఉండటంతో తాజా అథ్యయనం నేపథ్యంలో వీటి వాడకం పెరుగుతుందని అథ్యయనంలో చురుకైన పాత్ర పోషించిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్ పేర్కొన్నారు. దేశీయ పరిజ్ఞానంతో తయారయ్యే స్టెంట్లు మెరుగైనవని సర్వేలో వెల్లడవడంస్వాగతించదగిందని చెప్పారు. -
స్వదేశీ టెక్నాలజీకే ఓటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దేశ రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం వాడకాన్ని మరింతగా పెంచడంతో పాటు దేశీయంగా పరికరాల తయారీకి ప్రాధాన్యం ఇస్తామని డీఆర్డీఓ కొత్త చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. మన సాంకేతిక పరిజ్ఞానంతోనే సైన్యానికి కావాల్సిన పరికరాల్ని సమర్ధంగా తయారు చేయడమే ప్రధాన ఎజెండా అని, ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. డీఆర్డీఓ చైర్మన్‌గా తన ప్రాధాన్యతలు, దేశానికి తనవంతు చేయాల్సిన కర్తవ్యాలను, క్షిపణి రంగం స్థితిగతులు తదితర అంశాలపై ఆయ న ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. భవిష్యత్ భారత్ కోసం.. మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో ముందుకు సాగుతోంది. దానికి అనుగుణంగా అన్ని రంగాల్లో దేశీయ పరిజ్ఞానంతో వస్తు ఉత్పత్తులు జరగాలనేది ప్రభుత్వ సంకల్పం. దేశ రక్షణ రంగంలోనూ ఆ దిశగా సాగడమే నా ముందున్న ప్రధాన బాధ్యత. రానున్న కాలంలో స్వదేశీ ప్రయోగాల ద్వారా దేశ సైన్యానికి కావాల్సిన అన్ని పరికరాలను తయారు చేయటంలో డీఆర్డీఓ కీలకంగా వ్యవహరిస్తుంది. తద్వారా దేశ సైన్యాన్ని సర్వం సన్నద్ధంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంగా డీఆర్డీఓ పనిచేయనుంది. ప్రస్తుతం భారత సైన్యం దిగుమతుల పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీనిని తగ్గించి మన కాళ్లపైన మనం నిలబడే స్థాయికి ఎదిగే దిశగా దేశంలో పలు ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించి కొత్త పరికరాలను, పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తాం. క్షిపణి ప్రయోగాల్లో అగ్రగామిగా... క్షిపణి ప్రయోగాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. 30 ఏళ్ల నుంచి చేసిన పరిశోధనలు, కృషి వల్లే అది సాధ్యమైంది. మరింత స్వయం సమృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. ఇప్పటికే ఆగ్ని, ఆకాష్, తిశ్రూల్ ఇలా అనేక ప్రయోగాలు విజయవంతంగా చేపట్టాం. భవిష్యత్‌లో క్షిపణి రంగంలో దిగుమతుల అవసరం లేకుండా చూస్తాం. క్షిపణి, రక్షణ రంగంలో అగ్రదేశాలకు ధీటుగా పోటీపడుతున్నాం. దేశం కోసం పని చేయడమే ప్రాధాన్యం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రక్షణ రంగంలో వెనుకంజలో ఉన్న విభాగాలపై పూర్తిగా దృష్టి పెట్టి.. వాటికి ప్రాధాన్యం ఇస్తాం. రక్షణ రంగంలో దేశాన్ని సమున్నత స్థాయిలో ఉంచడమే నా లక్ష్యం. దేశం కోసం పనిచేయడానికే నా ప్రథమ ప్రాధాన్యత. స్టారప్ట్లను బలోపేతం చేసి వారికి సహకారం అందిస్తాం. అలాగే పరిశ్రమ రంగంలోనూ అభివృద్ధికి సహకరించి వారి భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం. విద్యా సంస్థల్లో పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తాం. -
ముగిసిన ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ – 2017
- హాజరైన 1200 మందికిపైగా శాస్త్రవేత్తలు, విద్యా, వ్యాపారవేత్తలు - మానవరహిత వాహనాల తయారీ, రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధే ధ్యేయం - 2018 ఇండియన్ కాంగ్రెస్ నాటికి మంచి ఫలితాలు సాధిస్తామన్న ఐటీసీ చైర్మన్ - ‘సాక్షి’కి ప్రత్యేక అభినందనలతోపాటు సర్టిఫికెట్ బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐదేళ్ల కిందట జర్మనీలో మొదలైన పారిశ్రామిక విప్లవం (4.0) అభివృద్ధి చెందిన దేశాల్లో వేగంగా ఫలితాలు ఇస్తోంది. ఈ క్రమంలో ఇండియా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పురోగతిని సాధించాలని, ఆ దిశగా శాస్త్రవేత్తలు, పారిశ్రామిక, విద్యావేత్తలు దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలని ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ చైర్మన్ ఎల్.వి.మురళీకృష్ణారెడ్డి అన్నారు. బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు జరిగిన సదస్సు శుక్రవారం ముగిసింది. కార్యక్రమానికి ఐటీసీ నేషనల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఆర్ఎం వాసగన్ అధ్యక్షత వహించారు. ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సీజే జగదీశా నివేదిక సమర్పించారు. సదస్సుకు 1200 మందికిపైగా స్వదేశీ, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. పారిశ్రామిక, టెక్నాలజీ, వ్యవసాయ రంగాలపై 121 ప్రజంటేషన్లు ఇచ్చారు. పారిశ్రామిక రంగం లో 4, వ్యవసాయ రంగంలో 9 తీర్మానాలు చేశారు. 2025 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యం 2018 కాంగ్రెస్ నాటికి ఈ తీర్మానాల ఫలితాలు సాధించేలా అంతా చొరవ చూపాలని మురళీ కృష్ణారెడ్డి కోరారు. 2025 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధిని సాధించేలా చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. పారిశ్రామిక, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు అంకిత భావంతో పనిచేసి సరికొత్త టెక్నాలజీని అందించాలన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో శ్రామికుల కొరత తీవ్రంగా ఉందని, భవిష్యత్‌లో ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరుతుందన్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే రోబోటిక్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నారు. దీనివల్ల సమస్య పరిష్కారంతోపాటు కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారత్ తయారీ రంగంలో వేగంగా అభివృద్ధి సాధిస్తోందని, 2050 నాటికి ప్రపంచానికే భారత్ తయారీ కేంద్రంగా మారాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ పట్నాయక్ ప్రజంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి బెల్ కంపెనీ డైరెక్టర్ డాక్టర్ రవిశంకరన్ మాట్లాడుతూ భారత్‌లో పారిశ్రామిక విప్లవం వెనుకంజలో ఉండటానికి కారణం ఇక్కడి కంపెనీలు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోకపోవడమేనన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపైనే భారత్ అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. శాస్త్రవేత్తలు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రపంచాన్ని శాసిస్తోన్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ద్వారా కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మెనాశ్ కంపెనీ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డీన్ యాసిన్ బ్రిజ్మోన్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్‌లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని కొత్త టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులు దేశానికి అందించడంలో శాస్త్రవేత్తలు చొరవ చూపాలన్నారు. దేశంలోని మార్కెట్ రంగాన్ని మొత్తం ఒకే వేదికపైకి తెచ్చి పంట సాగు నుంచి మార్కెటింగ్ దాకా ధరలు, మార్కెటింగ్ పరిస్థితి రైతులకు తెలిసేలా కొత్త యాప్‌లను రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డివిజన్ బోర్డు చైర్మన్ అలగసుందరమ్ అన్నారు. రైతుల ఆదాయాన్ని 2025 నాటికి రెట్టింపు చేయాలని నాబార్డ్ చైర్ ప్రొఫెసర్ అయ్యప్పన్ ఆకాంక్షించారు. కొత్త టెక్నాలజీపై టెక్నికల్ పేపర్లను కోడ్ చేసిన ప్రద్యోద్ అరమణి (బెంగళూరు), కేవీ జయప్రసాద్ (కొచ్చి), నాయక్ కృష్ణస్వామి (కర్ణాటక)లకు ప్రత్యేక అవార్డులు ఇచ్చారు. ఇస్రో, డీఆర్డీవో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం విస్తృత కవరేజీపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ‘సాక్షి’కి ప్రత్యేకంగా అభినందనలు తెలపడంతోపాటు సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. -
350 బిలియన్ డాలర్లకు దేశీ టెక్, సర్వీసెస్ మార్కెట్!
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ, సర్వీసెస్ మార్కెట్ పరిమాణం వచ్చే దశాబ్ద కాలంలో మరింత విస్తరించనుంది. ఈ పెరుగుదలకు కొత్త ఆవిష్కరణలు, వాణిజ్య నిర్వహణ వంటి అంశాలు దోహదపడనున్నాయి. ఈ విషయం నాస్కామ్-మెకిన్సె నివేదికలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 132 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ టెక్నాలజీ, సర్వీసెస్ మార్కెట్ దాదాపు 10-11% వృద్ధితో 2020 నాటికి 225 బిలియన్ డాలర్లకు, 2025 నాటికి 350 బిలియన్ డాలర్లకు పెరుగుతుం దని అంచనా. డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో గ్లోబల్ టెక్నాలజీ, బిజినెస్ సర్వీసులు 2025 నాటికి 3.6% సగటు వార్షిక వృద్ధి రేటుతో 4 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. దేశీ టెక్ పరిశ్రమ రెండంకెల వృద్ధిని సాధించడానికి అపార అవకాశాలు ఉన్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెక్ కంపెనీలు డిజిటల్ సర్వీసులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మెకిన్సె ఇండియా మేనే జింగ్ డెరైక్టర్ నొషిర్ తెలిపారు. వ్యాపార అనుకూల పరిస్థితుల కల్పనకు పన్ను విధానం తదితర అంశాల్లో మార్పు రావాల్సి ఉందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నాస్కామ్-మెకిన్సె నివేదిక -
పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
బాలాసోర్(ఒడిశా): భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్డీవో) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పృథ్వీ-2 అణ్వస్త్ర క్షిపణి మరోసారి సత్తా చాటింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి గురువారం ఉదయం 9:20 గంటలకు పృథ్వీ-2 క్షిపణిని సైన్యం విజయవంతంగా పరీక్షించింది. -
‘భారత్ సూపర్ పవర్ ’ శాస్త్రవేత్తలతోనే సాధ్యం
సాక్షి, బెంగళూరు : భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చడం కేవలం శాస్త్రవేత్తల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ఈ విషయంలో రాజకీయ నాయకులు ఏమీ చేయలేరని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. గురువారం ఆయన న గరంలోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాజకీయ నాయకులు కేవలం దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చేందుకు హామీలు మాత్రమే ఇవ్వగలరు కానీ, ఆ హామీలను కార్యరూపంలోకి తీసుకొచ్చి భారత్‌ను ప్రపంచ పటంలో సూపర్‌పవర్‌గా మార్చడం కేవలం శాస్త్రవేత్తల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో అణు పరీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమయ్యామని తెలిపారు. అయితే ఆ సమయంలో అణు పరీక్షలపై అమెరికా ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. అయినా కూడా ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ సలహాతో అణు పరీక్షలకు సన్నద్ధమయ్యామని చెప్పారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే అణు పరీక్షల నుంచి వెనకడుగు వేశాం తప్పితే అమెరికా ఆంక్షలకు బెదిరి కాదని అన్నారు. బెంగళూరు నగరం ఐటీ రాజధానిగా గుర్తింపు పొందడానికి తాను ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే ప్రధాన కారణమని దేవెగౌడ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో విద్యుత్, ఇతర ఇంధనాల తీవ్రత అధికంగా ఉందని, ఈ తీవ్రతను ఎదుర్కొనేలా దేశం స్వావలంబన సాధించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్.మహేషప్ప తదితరులు పాల్గొన్నారు.