తిరుమలలో భార్యతో..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దేశ రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం వాడకాన్ని మరింతగా పెంచడంతో పాటు దేశీయంగా పరికరాల తయారీకి ప్రాధాన్యం ఇస్తామని డీఆర్‌డీఓ కొత్త చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. మన సాంకేతిక పరిజ్ఞానంతోనే సైన్యానికి కావాల్సిన పరికరాల్ని సమర్ధంగా తయారు చేయడమే ప్రధాన ఎజెండా అని, ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. డీఆర్‌డీఓ చైర్మన్‌గా తన ప్రాధాన్యతలు, దేశానికి తనవంతు చేయాల్సిన కర్తవ్యాలను, క్షిపణి రంగం స్థితిగతులు తదితర అంశాలపై ఆయ న ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే..
భవిష్యత్ భారత్ కోసం..
మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో ముందుకు సాగుతోంది. దానికి అనుగుణంగా అన్ని రంగాల్లో దేశీయ పరిజ్ఞానంతో వస్తు ఉత్పత్తులు జరగాలనేది ప్రభుత్వ సంకల్పం. దేశ రక్షణ రంగంలోనూ ఆ దిశగా సాగడమే నా ముందున్న ప్రధాన బాధ్యత. రానున్న కాలంలో స్వదేశీ ప్రయోగాల ద్వారా దేశ సైన్యానికి కావాల్సిన అన్ని పరికరాలను తయారు చేయటంలో డీఆర్‌డీఓ కీలకంగా వ్యవహరిస్తుంది. తద్వారా దేశ సైన్యాన్ని సర్వం సన్నద్ధంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంగా డీఆర్‌డీఓ పనిచేయనుంది. ప్రస్తుతం భారత సైన్యం దిగుమతుల పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీనిని తగ్గించి మన కాళ్లపైన మనం నిలబడే స్థాయికి ఎదిగే దిశగా దేశంలో పలు ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించి కొత్త పరికరాలను, పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తాం.
క్షిపణి ప్రయోగాల్లో అగ్రగామిగా...
క్షిపణి ప్రయోగాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. 30 ఏళ్ల నుంచి చేసిన పరిశోధనలు, కృషి వల్లే అది సాధ్యమైంది. మరింత స్వయం సమృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. ఇప్పటికే ఆగ్ని, ఆకాష్, తిశ్రూల్ ఇలా అనేక ప్రయోగాలు విజయవంతంగా చేపట్టాం. భవిష్యత్‌లో క్షిపణి రంగంలో దిగుమతుల అవసరం లేకుండా చూస్తాం. క్షిపణి, రక్షణ రంగంలో అగ్రదేశాలకు ధీటుగా పోటీపడుతున్నాం.
దేశం కోసం పని చేయడమే ప్రాధాన్యం
చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రక్షణ రంగంలో వెనుకంజలో ఉన్న విభాగాలపై పూర్తిగా దృష్టి పెట్టి.. వాటికి ప్రాధాన్యం ఇస్తాం. రక్షణ రంగంలో దేశాన్ని సమున్నత స్థాయిలో ఉంచడమే నా లక్ష్యం. దేశం కోసం పనిచేయడానికే నా ప్రథమ ప్రాధాన్యత. స్టారప్ట్‌లను బలోపేతం చేసి వారికి సహకారం అందిస్తాం. అలాగే పరిశ్రమ రంగంలోనూ అభివృద్ధికి సహకరించి వారి భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం. విద్యా సంస్థల్లో పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తాం.
Comments
Please login to add a commentAdd a comment