G Satheesh Reddy
-
తెలంగాణ గవర్నర్‌తో డీఆర్డీఓ మాజీ చీఫ్ భేటీ
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఈ డీఆర్డీవో మాజీ చీఫ్.. రాష్ట్రంలో ఏరోనాటిక్స్, అంతరిక్ష,రక్షణ రంగాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణదేవ్కు సతీష్ రెడ్డి మిషన్ శక్తి నమునా జ్ఞాపికను అందజేశారు. -
మేడిన్ ఇండియా కాదు.. మేక్ ఫర్ వరల్డ్: డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి
(గరికిపాటి ఉమాకాంత్) సాక్షి, తిరుపతి: ‘శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం గత ఏడేళ్లుగా ఎంతో పురోగతి సాధించింది. మన అవసరాలకు మించి ఉత్పత్తులను తయారుచేస్తున్నాం. ఇప్పటివరకు మేడ్ ఇన్ ఇండియా (దేశంలో తయారీ) దిశగా సాగాం. ఇప్పుడు ప్రపంచం కోసం తయారీ (మేక్ ఫర్ వరల్డ్) దిశగా మన ప్రయోగాలు, ఆవిష్కరణలు చేస్తున్నాం’ అని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి,సతీష్‌రెడ్డి వెల్లడించారు. ‘ప్రపంచ దేశాల అవసరాల కోసం తయారయ్యే ఉత్పత్తులకు మన దేశమే కేంద్రం కావాలి. ప్రపంచానికి మనమే దిక్సూచి కావాలి. రక్షణ శాఖ ఆ దిశగానే సరికొత్త ఆలోచనలు ఉన్నవారిని, పరిశోధనలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తోంది. త్వరలోనే భారత్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదుగుతుంది. దేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సంక్లిష్టమైన, కీలకమైన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై డీఆర్డీవో దృష్టి పెట్టింది. 5 బిలియన్ డాలర్ల (రూ.39 వేల కోట్ల) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా డీఆర్డీవో పని చేస్తోంది’ అని ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా సొంతంగా రక్షణ ఉత్పత్తులు తయారీపై దృష్టి సారించాం. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, జనాభా, డిమాండ్.. ఈ ఐదూ మూల సూత్రాలుగా భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా ఎదగడమే ప్రాజెక్టు లక్ష్యం, అందులో భాగంగా ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణిలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలన్నింటినీ భారత్‌లోనే తయారు చేశాం. ప్రపంచంలోనే దీర్ఘ శ్రేణి కలిగిన తుపాకీ (అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్)ను కూడా అభివృద్ధి చేయగలిగాం. సేవా రంగంలోనూ డీఆర్డీవో సేవలు దేశ రక్షణతో పాటు సామాజిక సేవా రంగంలోనూ డీఆర్డీవో విస్తృత సేవలు అందిస్తోంది. కోవిడ్ సంక్షోభ సమయంలో వైద్య రంగంలోని ఉత్పత్తులపై దృష్టి సారించాం. శానిటైజర్, గ్లౌజులు, పీపీఈ కిట్లు తయారు చేశాం. ప్రధానమంత్రి సూచన మేరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తయారు చేశాం. సాంకేతికతను పెంపొందించుకొని ఒక్క రోజులో 30 వేల వెంటిలేటర్లను తయారు చేసే స్థాయికి ఎదిగాం. మూడు నెలల్లోనే దేశ అవసరాలను అధిగమించాం. ఎన్నో దేశాలకు శానిటైజర్లు, పీపీఈ కిట్లు, కరోనా రక్షణ పరికరాలను పెద్దసంఖ్యలో ఎగుమతి చేశాం. డేర్ టు డ్రీం దేశంలో నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు డీఆర్డీవో ‘డేర్ టు డ్రీం’ పేరిట వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తోంది. మంచి స్టార్టప్‌లు, ఆలోచనలు ఇచ్చిన వారికి రూ.10 లక్షల వరకు ప్రైజ్ మనీ ఇస్తోంది. ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు, మెకానిజం కూడా డీఆర్డీవో అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచే లబ్ధ ప్రతిష్టులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళే వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులై ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్ధుల మధ్య బంధం తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం వంటిది. నేను కూడా సర్కారు బడిలోనే చదివాను. నెల్లూరు జిల్లాలోని మారుమూల పల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. స్కూలు టీచర్ ఎస్ఆర్ నరసింహం గారు లెక్కలు ఎక్కువగా నేర్పారు. ఆట పాటలతో పాటు క్రికెట్‌కు కూడా ఆయనే గురువు. అమ్మ కోరిక మేరకే ఇంజనీరింగ్ అప్పట్లో మా ఊళ్ళో మొదటి గ్రాడ్యుయేట్ నేనే. మా అమ్మ ఎప్పుడూ నువ్వు ఇంజనీర్ కావాలని అంటుంటేది. అమ్మ కోరిక మేరకే ఇంజనీర్‌ను అయ్యాను. అబ్దుల్ కలాం డీఆర్డీవో చైర్మన్‌గా ఉన్నప్పుడే ఉద్యోగంలో చేరాను. ఆయనే స్ఫుర్తి. దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి ప్రతి ఒక్కరికీ దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి. సైన్స్‌ను, సత్సంప్రదాయాలను సమానంగా గౌరవించాలి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను మన పురాణాలు, ఇతిహాసాల్లో ఎప్పుడో చెప్పారు. సైన్స్ అభివృద్ధి చెందక ముందే జీరోను కనుగొన్న చరిత్ర మన సొంతం. నంబర్ వన్‌గా నిలవడమే యువత లక్ష్యం శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో నంబర్ వన్‌గా నిలవడమే యువత ముందున్న లక్ష్యం. 75 కోట్ల మంది యువత ఉన్న ఏకైక దేశం. ఆ యువ శక్తిని, మేథో సంపత్తిని సమృద్ధిగా వినియోగించుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలి. గతంలో ఐఐటీ పూర్తి చేసుకున్న నిపుణులు 75 శాతం మంది విదేశా>లకు వెళ్లిపోయే వాళ్లు. ఇప్పుడు 75 శాతం మంది ఇక్కడే ఉంటున్నారు. ఇది మన దేశం సాధించిన ప్రగతికి నిదర్శనం. -
యాంటీ డ్రోన్ కొత్త టెక్నాలజీని అభివృద్ధి పరిచాం
జమ్మూ: తాము సొంతంగా అభివృద్ధి పరిచిన యాంటీ డ్రోన్ టెక్నాలజీని రక్షణ రంగ పరిశ్రమలకు అందజేసినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చీఫ్ జి.సతీశ్‌రెడ్డి వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో డ్రోన్లను ఎదుర్కొనే విధంగా రూపకల్పన చేసిన వ్యవస్థలను ఈ పరిశ్రమలు రక్షణ, భద్రతా సంస్థలకు అవసరమైన విధంగా తయారు చేసి అందజేస్తాయని ఆయన తెలిపారు. శత్రు డ్రోన్లపై నిఘా వేసి, గుర్తించి, వెంటాడేందుకు అవసరమైన అన్ని సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ వ్యవస్థలు ఈ టెక్నాలజీలో ఉన్నాయన్నారు. ఈ కొత్త వ్యవస్థలను పలుమార్లు విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించారు. వాటిని స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయంలో మోహరించినట్లు వివరించారు. గురువారం జమ్మూలో సెంట్రల్ యూనివర్సిటీలో డీఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. -
డ్రోన్ విధ్వంసక వ్యవస్థ త్వరలోనే సైన్యానికి..
భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. సాక్షి, అమరావతి: శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు, అసాంఘిక శక్తులు ప్రయోగించే డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఇప్పటికే విజయవంతంగా అభివృద్ధి చేసిందని సంస్థ చైర్మన్ జి. సతీశ్‌రెడ్డి వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యాలకు దీటుగా అభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పారు. భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు ఈ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రోన్ విధ్వంసక వ్యవస్థతోపాటు రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతున్న తీరును ఇలా వివరించారు.. ►డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ►ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. ►టీటీడీతో సహా ఎవరైనా సరే ఆ పరిశ్రమల నుంచి డ్రోన్ విధ్వంసక టెక్నాలజీని కొనుగోలు చేసి అవసరమైనచోట్ల నెలకొల్పుకోవచ్చు. టాప్ ఫైవ్‌లో భారత్ ►రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచంలోనే మొదటి ఐదు అగ్రరాజ్యాల జాబితాలో స్థానం సాధించింది. ►బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ కలిగి ఉన్న నాలుగు దేశాల్లో భారత్ ఒకటి. ►అత్యాధునిక తేజస్ యుద్ధ విమానాలను రూపొందించిన ఆరు దేశాల్లో మన దేశం ఉంది. ►అణు ట్యాంకర్లు కలిగిన ఏడు దేశాల్లో భారత్ ఉంది. ►క్షిపణి విధ్వంసకర వ్యవస్థను అభివృద్ధి చేసిన ఆరు దేశాల్లో భారత్‌కు చోటు దక్కింది. ►ఉపగ్రహాలను న్యూట్రలైజ్ చేసి ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగిన నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉండటం గర్వకారణం. ►ప్రపంచంలోనే అత్యంత దూరంలోని అంటే 48 వేల కి.మీ. వరకు షెల్స్ ప్రయోగించే 155 ఎంఎం గన్ను రూపొందించాం. ►దేశంలో 2 వేల ప్రధాన పరిశ్రమలతోపాటు మొత్తం 11వేల పరిశ్రమలు రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. ►రాబోయే ఐదారేళ్లలో రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం.. అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడాలన్నదే ప్రస్తుత లక్ష్యం. ►కృష్ణాజిల్లాలోని నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం దేశంలో కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం, డీఆర్డీఓ పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని సతీశ్‌రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి జిల్లాలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతుండటంతోపాటు లిక్విడ్ ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ట్యాంకర్లను సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. కరోనాను అరికట్టేందుకు మొత్తం 75 రకాల ఉత్పత్తులను కనిపెట్టడంతోపాటు 190 రకాల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. -
2–డీజీ.. గేమ్ చేంజర్.. అన్ని స్ట్రెయిన్ల మీదా పని చేస్తుంది
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ఆశాకిరణంగా నిలుస్తూ.. ‘2డీజీ (2 డీఆక్సి డీ గ్లూకోజ్)’ మందును తెస్తున్నట్టు ప్రకటించింది. కరోనా చికిత్సలో ఇది చాలా ప్రభావంతంగా పని చేస్తుందని వెల్లడించింది. దీంతో అందరి దృష్టీ ఈ మందుపై పడింది. అసలు ఈ మందు ఏమిటి, ఎలా తయారు చేశారు. ఎలా పనిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించింది. ఆ ఇంటర్వ్యూ వివరాలివీ.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ‘2డీజీ’ జనరిక్ మాలిక్యూల్. కొన్ని ప్రయోగాల్లో భాగంగా దానిని రూపొందించాం. సీసీఎంబీ దగ్గరికి వెళ్లి కరోనాపై టెస్టులు చేయించాం. పనిచేస్తోందని సీసీఎంబీ చెబితే.. క్లినికల్ ట్రయల్స్‌కోసం డీజీసీఐకి వెళ్లాం. ఏ మోతాదులో ఇస్తే ఎలా ఉంటుందని రెండు దశలుగా ప్రయోగాలు చేశాం. తర్వాత ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. ఫలితాలు బాగా వచ్చాయి. ఈ డ్రగ్ వాడితే మూడు రోజుల ముందే కోలుకుంటున్నారు. ఈ ఫలితాలతో డీజీసీఐకి వెళితే.. మందును వాడొచ్చంటూ అత్యవసర అనుమతి ఇచ్చారు. ఉత్పత్తిపై రెడ్డీస్ ల్యాబ్స్‌తో సంప్రదింపుల్లో ఉన్నాం. 11, 12 తారీఖుల్లో 10 వేల ప్యాకెట్లు రానున్నాయి. వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎక్కువ మంది ప్రజలకు అందించేలా చూస్తున్నాం. చదవండి: (డీఆర్డీవో గుడ్‌న్యూస్: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం) భారీగా తయారు చేయడం వీలవుతుందా? ‘2డీజీ’ గ్లూకోజ్ ఆధారిత మాలిక్యూల్. దీని తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు సులువుగానే దొరుకుతాయి. అయితే ఒకేసారి భారీగా ఉత్పత్తి చేయడం కష్టం కావొచ్చు. అన్నీ సమకూరితే నెల రోజుల్లో ఉత్పత్తిని అందుబాటులోకి తేవచ్చు. దీనిని గేమ్ చేంజర్‌గా భావించొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మందును కచ్చితంగా ఓ గేమ్ చేంజర్‌గా భావించొచ్చు. దీనితో చికిత్స సులువు అవుతుంది. క్లినికల్ ట్రయల్స్‌లో పరిశీలించినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. 330 మంది పేషెంట్లకు ఇచ్చి పరిశీలిస్తే.. వారు చాలా త్వరగా ఆక్సిజన్ వినియోగం నుంచి బయటికి రావడం, త్వరగా కోలుకోవడం జరిగింది. అయితే ఇది వ్యాధి వచ్చిన తర్వాత తగ్గించడానికి వాడే మందు, వ్యాధి రాకుండా ఆపే మందు కాదు. వ్యాక్సిన్లు బ్లాక్ మార్కెట్‌కు వెళుతున్నాయి? మరి ఈ మందు సజావుగా జనానికి అందేందుకు మీ ప్రణాళిక? తగిన సంఖ్యలో ఉత్పత్తి లేనప్పుడే బ్లాక్ మార్కెట్ ఏర్పడుతుంది. మేం వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులో ఉంటే.. బ్లాక్ మార్కెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ప్రాంతాన్ని బట్టి మందు పనిచేసే తీరులో తేడా ఉందా? భద్రత ఎంత? దేశవ్యాప్తంగా అన్ని మూలల్లో కలిపి 9, 10 రాష్ట్రాల్లో క్లినికల్ ట్రయల్స్ చేశాం. అన్నిచోట్లా మంచి ఫలితాలు వచ్చాయి. ఈ మందు భద్రమైనది కూడా. దీనివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్టŠస్ ఉంటాయా అని రెండు సార్లు పరీక్షించాం. పూర్తిగా భద్రమని గుర్తించాం. డీఆర్డీవో అంటే రక్షణ సంస్థ అనే భావనే ఉంది. కరోనాకు మందు ఎలా కనిపెట్టారు? నిజానికి డీఆర్డీవో సైన్యం కోసం పనిచేసే సంస్థ. అయితే సైనికులకు సంబంధించిన ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపేలా లైఫ్ సైన్సెస్ పరిశోధనలు కూడా ఉంటాయి. వారు తీసుకోవాల్సిన ఆహారం, ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన ప్రాంతాల్లో పనిచేయడం వంటి అన్ని విషయాలపై ప్రయోగాలు చేస్తుంటాం. యుద్ధాలకు సంబంధించి అణు, బయోలాజికల్, కెమికల్ వార్ వంటివి కూడా ఉంటాయి. ఈ క్రమంలో రేడియేషన్ వల్ల వచ్చే నెగెటివ్ ఎఫెక్ట్స్‌ను ఎలా తట్టుకోవచ్చనే పరిశోధనలో భాగంగా 2డీజీ మాలిక్యూల్‌పై ప్రయోగాలు చేశాం. తర్వాత ఈ మందు కరోనాపై కూడా పనిచేస్తుందని మా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో గత ఏడాదే సీసీఎంబీతో పరీక్షలు చేయించి.. అనుమతికోసం దరఖాస్తు చేశాం. కరోనా మొదటి వేవ్‌ను ఎదుర్కోగలరా? ఇలా కరోనా సెకండ్ వేవ్ వస్తుందని, ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటుందన్నది ఎవరికీ తెలియని విషయం. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కూడా రోగులపై నిరంతరంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. అలా చేశాం కాబట్టే.. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఈ డ్రగ్ రెడీగా అందుబాటులోకి వస్తోంది. సెకండ్ వేవ్ ప్రమాదాన్ని ఇతర దేశాలు గుర్తించినట్టు మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం? నేను అలా అనుకోవడం లేదు. మనలాగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చిన దేశాలేమీ లేవు. భారత్‌లో చాలా వేగంగా పెరిగిపోయాయి. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, ఆక్సిజన్ అవసరం పడే పేషెంట్ల సంఖ్య ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. ఎవరూ ఊహించనంతగా ఈ స్థాయిలో వచ్చిన ఉధృతిని ఎదుర్కోవడానికి సిద్ధం కావడం కష్టం. అయినా పది పదిహేను రోజుల్లోనే అవసరమైన మేర ఆస్పత్రులు, మందులు, ఆక్సిజన్ వంటివి రెడీ చేసుకోవడం గొప్ప విషయమే. ఆక్సిజన్ జనరేటర్ల తయారీపై డీఆర్డీవో దృష్టి పెట్టింది.. ఆ వివరాలు ఏమిటి? తేజస్ (ఎల్సీఏ) విమానాలు అత్యంత ఎత్తులో ప్రయాణిస్తాయి. అక్కడ పైలట్లకు సరిపడా ఆక్సిజన్ ఉండదు. అందుకే అక్కడిక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి అత్యాధుకమైన ఆన్‌బోర్డ్ ఆక్సిజన్ జనరేటర్‌ను తయారు చేశాం. ఆ టెక్నాలజీని ఉపయోగించే భారీగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను రూపొందించాం. వీటిని ఇప్పటికే హిమాలయాలు, ఇతర ఎత్తైన ప్రాంతాల్లో ప్రజలు, ఆస్పత్రులకు ఆక్సిజన్ కోసం వినియోగిస్తున్నాం. ఈసారి ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువగా ఉండటంతో.. పలు సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా మూడు నెలల్లో 850 ప్లాంట్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యాక్సిన్లు విదేశాలకు సరఫరా చేసిన ఖ్యాతి దక్కించుకున్నాం. ఇప్పుడీ మందును ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తారా? మన దగ్గర ఇంకా ఉత్పత్తే మొదలు కాలేదు. ముందుగా మన దేశంలో సరిపడా ఉత్పత్తి చేయడంపైనే దృష్టి పెడతాం. మన అవసరానికి మించి ఉత్పత్తి చేయగలిగినప్పుడు.. విదేశాలకు ఇవ్వడమా, ఏం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ‘2డీజీ’ మందు వాడితే.. వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందా? రోగం మన దగ్గరికి రాకుండా తోడ్పడేది వ్యాక్సిన్. ఈ మందు రోగం వచ్చాక తగ్గడానికి వాడేది. దానికి దీనికి సంబంధం లేదు. అయితే వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా అందరం వ్యాక్సిన్లు వేసుకోవడం చాలా మంచిది. వ్యాక్సిన్ వేసుకున్నాక కోవిడ్ వచ్చినా.. ఈ మందును ఉపయోగించవచ్చు. ఆక్సిజన్ అవసరం ఏమేర తగ్గుతుంది, ఆస్పత్రిలో చేరే అవసరం ఉంటుందా? ఈ మందు వాడితే వేగంగా రికవరీ అవుతారు. ఆక్సిజన్ పెట్టాల్సిన స్థాయికి వెళ్లే రోగులకు ఆ అవసరం లేకుండా చేస్తుంది. ఒకవేళ అప్పటికే ఆక్సిజన్ వాడుతున్నా.. త్వరగా బయటపడేలా చేస్తుంది. అంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరాన్ని, ఎక్కువ రోజులు ఉండాల్సిన రావడాన్ని తగ్గిస్తుంది. కొత్త కొత్త కరోనా స్ట్రెయిన్లు వస్తున్నాయి? మరి ఈ మందు పనిచేస్తుందా? అన్ని స్ట్రెయిన్ల మీద మేం పరీక్షలు చేయలేదు. కానీ ఈ మందు పనిచేసే తీరు వేరు. దీనికి నేరుగా కరోనా వైరస్‌తో సంబంధం లేదు. కరోనా సోకిన మన శరీర కణాల మీద ఈ మందు పనిచేస్తుంది. కణాల్లోకి 2డీజీ ప్రవేశించాక దానిని పూర్తిగా స్తంభింపజేస్తుంది. దాంతో అక్కడ వైరస్ పెరగడం ఆగిపోతుంది. అంటే ఏ స్ట్రెయిన్ అనే తేడా లేకుండా పనిచేస్తుంది. -
‘ఆత్మ నిర్భర్’తో నూతనోత్తేజం
సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగంలో స్వావలం బనకు సరికొత్త ప్రయత్నం మొదలైంది. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా 108 వ్యవస్థలు, ఉపవ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు డీఆర్డీవో శ్రీకారం చుట్టింది. ఈ టెక్నాల జీలు మనకు చేసే మేలు ఏమిటి? ఆత్మ నిర్భర్ భారత్‌తో రక్షణ రంగంలో వచ్చిన మార్పులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనేందుకు డీఆర్డీవో చైర్మన్ డా.జి.సతీశ్‌రెడ్డితో ‘సాక్షి’ ముచ్చటించింది. ప్రశ్న: రక్షణ రంగంలో స్వావలంబన కోసం ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో వచ్చిన మార్పులేమిటి? జవాబు: స్వావలంబన సాధించాలన్నది దేశ చిరకాల వాంఛ. నిజానికి డీఆర్డీవో ఏర్పాటు ఉద్దేశాల్లో ఇది ఒకటి. ఆరు దశాబ్దాలుగా డీఆర్ డీవో కీలకమైన రక్షణరంగ వ్యవస్థల్లో ఇతరు లపై ఆధారపడకుండా ఉండేందుకు పరిశోధ నలు సాగిస్తోంది. స్వావలంబన సాధించేం దుకు అందరూ కలసికట్టుగా ప్రయత్నించాలని ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా పిలుపునిచ్చారు. దీనివల్ల అక్కడక్కడా జరుగుతున్న వేర్వేరు ప్రయత్నాలు ఏకతాటి పైకి వస్తాయి. ఫలితంగా లక్ష్యాన్ని వేగంగా అందుకోవచ్చు. ప్రధాని పిలుపు రక్షణ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో కొత్త చైతన్యం నింపిందనడంలో సందేహం లేదు. శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ మార్పును నేను కూడా ప్రత్యక్షంగా గమనిస్తున్నా. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం డీఆర్డీవో అంతర్గత శక్తియుక్తులను బహిర్గతం చేస్తోందంటే అతిశయోక్తి కాదు. ప్ర: దేశానికి అవసరమైన అన్ని రకాల మైక్రోప్రాసెసర్లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లను సొంతంగా తయారు చేసుకొనే అవకాశం ఉందా? జ: కచ్చితంగా ఉంది. ఆధునిక ప్రపంచంలో యుద్ధం తీరుతెన్నులు మారిపోతున్నాయి. సైబర్ యుద్ధం నేపథ్యంలో వ్యూహాత్మక వ్యవస్థలు, ఆస్తులను కాపాడుకోవడం అత్యవసరం. డీఆర్డీవో ఇందుకోసం అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తోంది. మనదైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. డీఆర్డీవో ఇప్పటికే సొంత ఓఎస్‌ను అంతర్గతంగా ఉపయోగిస్తోంది. మైక్రోప్రాసెసర్ల తయారీలో కొన్ని దేశాల గుత్తాధిపత్యాన్ని తప్పించుకొనేందుకు పరిశ్రమ వర్గాలతో కలసి సిస్టమ్ ఆన్ చిప్‌తోపాటు కొన్ని ప్రాసెసర్ల అభివృద్ధి కూడా చేపట్టాం. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితాలను మనం త్వరలోనే చూడబోతున్నాం. ప్ర: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కోసం డీఆర్డీవో గుర్తించిన 108 రకాల రక్షణ వ్యవస్థల వల్ల లాభాలేమిటి? జ: భారతీయ పరిశ్రమ వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఈ 108 రక్షణ వ్యవస్థలు, ఉప వ్యవస్థలపై పనిచేసే క్రమంలో పరిశ్రమ వర్గాలు అత్యాధునిక టెక్నాలజీల డిజైనింగ్, డెవలప్మెంట్ సామర్థ్యాన్ని సంపాదించుకుంటాయి. ఈ సామర్థ్యం కాస్తా పరిశ్రమ మరింత ప్రగతి సాధించేందుకు తద్వారా భవిష్యత్తులో దేశ రక్షణ అవసరాలను తీర్చగలిగేవిగా మారతాయి. ఆత్మనిర్భర్ భారత్‌కు పరిశ్రమ తోడ్పాటు అందించడమే కాకుండా రక్షణ రంగంలో మరిన్ని ఎగుమతులు సాధించేందుకు వీలు ఏర్పడుతుంది. ప్ర: డీఆర్డీవో టెక్నాలజీలను సామాన్యులకు దగ్గర చేసేందుకు ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? జ: సరిహద్దు ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న ప్రజలు చాలా మంది ఇప్పటికే డీఆర్డీవో టెక్నాలజీలతో లాభం పొందుతున్నారు. కొండ ప్రాంతాల్లోనూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు అనువైన టెక్నాలజీలను మేం రూపొందించాం. ఈ పద్ధతిలో పండిస్తున్న పంటలను సమీపంలోని భద్రతా దళాలు వినియోగిస్తున్నాయి. డెంగీ, చికన్ గున్యా, దోమల్లాంటి కీటకాలను పారదోలే మందు, ఆహార కాలుష్యాన్ని గుర్తించే కిట్లను చాలా మంది వాడుతున్నారు. మానవ వ్యర్థాలను ఇంధనంగా మార్చేందుకు డీఆర్డీవో బయో డైజెస్టర్‌ను అభివృద్ధి చేసింది. హిమాలయాల్లో విధులు నిర్వహించే సైనికుల కోసం సిద్ధం చేసిన ఈ టెక్నాలజీ ఇప్పుడు సమాజం మొత్తానికి ఉపయోగపడుతోంది. తాజాగా ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా గుర్తించిన 108 వ్యవస్థల్లోనూ కొన్నింటిని సామాన్య ప్రజల వినియోగానికి తెచ్చే ప్రతిపాదన ఉంది. పౌరుల వాడకానికి ఉపయోగపడే టెక్నాలజీలను డీఆర్డీవో పరిశ్రమలకు ఉచితంగా బదలాయిస్తోంది. ప్ర: రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం వల్ల ధరలు ఎక్కువ కావా? జ: కానేకావు. ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి... ఇందుకోసం పలు మార్పులు చేశాం. ఆరోగ్యకరమైన పోటీ కారణంగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా రక్షణ వ్యవస్థల ధరలు తక్కువగానే ఉంటాయి. ఎగుమతులు చేసుకొనేందుకూ అవకాశం కల్పిస్తుండటం వల్ల పరిశ్రమలకూ తగిన లాభాలు ఉంటాయి. ప్ర: ఆత్మనిర్భర భారత్ సాకారమైతే ఎంత డబ్బు ఆదా చేయవచ్చు? జ: రక్షణరంగ వ్యవస్థల అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది కొనసాగుతూనే ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే మార్పులను జోడించడం, మెరుగైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవడం అవసరం. అయితే దిగుమతుల ఖర్చులతో పోలిస్తే స్థానికంగా తయారు చేసుకోవడం వల్ల మూడింట రెండొంతులు ఆదా అవుతుందని ఆశిస్తున్నాం. విదేశీ మారకద్రవ్యం రూపేణా పెద్ద మొత్తంలోనే ఆదా చేసుకోవచ్చు. -
డీఆర్డీఓ: సతీష్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చైర్మన్ శాస్త్రవేత్త జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండుళ్ల పాటు పొడిగించింది. ప్రస్తుతం డీఆర్డీఓ చీఫ్‌గా కొనసాగుతున్న సతీష్‌రెడ్డిని మరో రెండేళ్లు అదే పదవిలో కొసాగించాలని సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్వర్వులు సైతం జారీచేసింది. ప్రస్తుతం సతీశ్‌రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు.1985లో డీఆర్డీఓలో చేరారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన సతీశ్‌రెడ్డి క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించారు. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్‌గా పనిచేశారు. -
వెంటిలేటర్ల ఎగుమతికి సిద్ధం : డీఆర్డీఓ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాడేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఇప్పటివరకూ 70 మేడిన్ ఇండియా ఉత్పత్తులను రూపొందించిందని సంస్థ చైర్మన్ జీ. సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే తాము ప్రతినెలా 25,000 వెంటిలేటర్లను తయారు చేస్తామని..విదేశాలకు ఎగుమతి చేసేందుకు తాము సిద్ధమని ఆయన వెల్లడించారు. డీఆర్డీఓ నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్-19 ఆస్పత్రి ఆదివారం ప్రారంభమైన సందర్భంగా సతీష్ రెడ్డి పలు వివరాలు అందించారు. 11 రోజుల్లోనే 250 ఐసీయూ పడకలతో సహా 10000 పడకల ఆస్పత్రిని నిర్మించారు. సకల సదుపాయాలతో కూడిన ఈ ఆస్పత్రిలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సైనిక సిబ్బంది 24 గంటల పాటు రోగుల సేవల్లో నిమగ్నవుతారని అన్నారు. కాగా ఢిల్లీ కంటోన్మెంట్లో డీఆర్డీఒఓ నిర్మించిన ఈ ఆస్పత్రిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సందర్శించారు. మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే గరిష్టంగా 24,850 తాజా కేసులు వెలుగుచూశాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. తాజా పాజిటివ్ కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73, 165గా ఉంది. కాగా కరోనాతో ఒక్కరోజులో 613 మంది మరణించడంతో మరణాల సంఖ్య 19,268కి చేరుకుంది. చదవండి : చైనాకు ధీటుగా.. ఢిల్లీలో -
సీఎం జగన్‌తో డీఆర్డీఓ చైర్మన్ భేటీ
-
సీఎం జగన్‌తో డీఆర్డీఓ చైర్మన్ భేటీ
సాక్షి, అమరావతి: డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం వైఎస్ జగన్‌తో పలు కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలోని రక్షణ రంగ ప్రాజెక్టులపై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్టు సమాచారం. నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రం నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రికి సతీష్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది. ఆయనకు సీఎం జగన్ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. (చదవండి: ముందే సంక్రాంతి) -
తేజస్, శక్తి..దేశానికి గర్వకారణం
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ రంగంలో గతేడాది అత్యంత కీలకమైన రెండు ఘటనలు చోటుచేసుకున్నాయని, భారత్ తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ఘటనలు ఎంతో దోహదపడ్డాయని డీఆర్డీవో డైరెక్టర్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి అన్నారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్.. అన్ని అనుమతులు సంపాదించుకుని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో తయారీకి సిద్ధమవడం యుద్ధ విమానాల రంగంలో మనం సాధించిన అతిగొప్ప విజయమని పేర్కొన్నారు. దీంతోపాటు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహాన్ని అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టి నాశనం చేయగల టెక్నాలజీ (మిషన్ శక్తి) కూడా మన సాంకేతిక పరిజ్ఞాన పటిమకు నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఏరోనాటికల్ సొసైటీ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భూమికి సుమారు 283 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహ కేంద్ర బిందువును 10 సెంటీమీటర్ల తేడాతో క్షిపణితో ఢీకొట్టడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ టెక్నాలజీ అభివృద్ధికి రెండేళ్ల క్రితం అనుమతులు మంజూరు చేస్తే.. డీఆర్డీవోలోని అన్ని విభాగాల శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు చిత్తశుద్ధితో రేయింబవళ్లు పనిచేయడం ద్వారా విజయవంతమయ్యామని వివరించారు. 50 కంపెనీలు పనిచేశాయి... మిషన్ శక్తిపై అంతర్జాతీయ సమాజం దృష్టి పడకుండా ఉండేందుకు డీఆర్డీవో రహస్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టిందని ప్రాజెక్టు డైరెక్టర్ రాజబాబు తెలిపారు. మిషన్ ఉద్దేశం ఏమిటో ఇతరులకు తెలియకూడదన్న లక్ష్యంతో క్షిపణి, ఇతర టెక్నాలజీల పనులను దేశంలోని 50 కంపెనీలకు పంపిణీ చేశామని ‘మిషన్ శక్తి’పై ఇచ్చిన ప్రజెంటేషన్‌లో వివరించారు. ఉపగ్రహ విధ్వంస క్షిపణి సెకనులో వందో వంతులోనూ లక్ష్యాన్ని గుర్తించి అందుకు తగ్గట్టుగా దిశ, వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన టెక్నాలజీలను అభివృద్ధి చేయడం సవాలేనని అన్నారు. పేలుడు సందర్భంగా అంతరిక్షంలోకి చేరిన శకలాలు అన్నీ వారాల వ్యవధిలో నశించిపోతాయన్నారు. దేశ అవసరాలకు ప్రత్యేకంగా ఒక మైక్రోప్రాసెసర్ ఆర్కిటెక్చర్‌ను సిద్ధం చేసేందుకు ఐఐటీ మద్రాస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఐఐటీ మద్రాస్ అధ్యాపకుడు కామకోటి అన్నారు. ఇంటర్నెట్ ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలుకొని సూపర్ కంప్యూటర్ల వరకూ అవసరమైన మైక్రోప్రాసెసర్లను ఈ ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రామ్‌గోపాలరావు పాల్గొన్నారు. -
‘45 రోజుల్లో పూర్తిగా నాశనమవుతాయి’
న్యూఢిల్లీ : అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు భారత్ చేపట్టిన ప్రయోగం ‘మిషన్ శక్తి’ కారణంగా మిగిలిపోయిన ఉపగ్రహ శకలాలు 45 రోజుల్లో ధ్వంసమవుతాయని డీఆర్డీవో చీఫ్ జి. సతీష్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ లాంటి శక్తిమంతమైన దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేసినపుడే మన సామర్థ్యం గురించి ప్రపంచ దేశాలకు ఒక అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతరిక్షంలో మిషన్ శక్తి వంటి ప్రయోగాల ద్వారా రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుందన్నారు. ఇక మిషన్ శక్తి గురించి కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ ఇలాంటి ప్రయోగాలు చేసినపుడు వాటి ఫలితాలను రహస్యంగా ఉంచడం సాధ్యంకాని విషయం. ప్రయోగ సమయంలో మన ఉపగ్రహాన్ని ప్రపంచలోని అన్ని స్పేస్ స్టేషన్లు ట్రాక్ చేశాయి. ఇందుకు సంబంధించి మేము అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు సాగాం’ అని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిషన్ శక్తికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. (చదవండి : అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు) కాగా శత్రుదేశాల ఉపగ్రహాలు కూల్చేసేందుకు ఇటీవల భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి (ఏశాట్) పరీక్ష వల్ల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికే (ఐఎస్ఎస్) ముప్పు వాటిల్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ ప్రయోగం వల్ల అంతరిక్షంలో దాదాపు 400 వ్యర్థ శకలాలు పోగుపడ్డాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్‌స్టిన్ తెలిపారు. దీంతో ఐఎస్ఎస్ను వ్యర్థాలు ఢీకొనే ప్రమాదం 44 శాతం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐఎస్ఎస్కు భద్రతను దృష్టిలో పెట్టుకునే తమ టీమ్ ఈ ప్రయోగాన్ని చేపట్టిందని, 45 రోజుల్లోగా ఈ శకలాలు నాశనమవుతాయని పేర్కొన్నారు. #WATCH Defence Research and Development Organisation releases presentation on #MissionShakti pic.twitter.com/4llQ1t3JUG — ANI (@ANI) April 6, 2019 -
కొత్త బాధ్యతలు స్వీకరించిన సతీశ్ రెడ్డి
న్యూఢిల్లీ: డీఆర్డీఓ (రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ) చైర్మన్‌గా ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, తెలుగు తేజం జి.సతీశ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో డీఆర్డీఓ వెల్లడించింది. ఆయన రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగానికి కూడా కార్యదర్శిగా పనిచేస్తారు. 1985లో డీఆర్డీఓలో తన ప్రస్థానం ప్రారంభించిన సతీశ్‌రెడ్డి 1986–94 మధ్యకాలంలో క్షిపణి నేవిగేషన్(దిక్సూచి) వ్యవస్థలో అనేక మైలురాళ్లను ఆధిగమించారు. శాస్త్ర సలహాదారుగా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్, ఎవియానిక్స్ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇంతవరకూ ఆయన రక్షణ శాఖ మంత్రి శాస్త్ర సలహాదారుగా పనిచేశారు. -
స్వదేశీ టెక్నాలజీకే ఓటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దేశ రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం వాడకాన్ని మరింతగా పెంచడంతో పాటు దేశీయంగా పరికరాల తయారీకి ప్రాధాన్యం ఇస్తామని డీఆర్డీఓ కొత్త చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. మన సాంకేతిక పరిజ్ఞానంతోనే సైన్యానికి కావాల్సిన పరికరాల్ని సమర్ధంగా తయారు చేయడమే ప్రధాన ఎజెండా అని, ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. డీఆర్డీఓ చైర్మన్‌గా తన ప్రాధాన్యతలు, దేశానికి తనవంతు చేయాల్సిన కర్తవ్యాలను, క్షిపణి రంగం స్థితిగతులు తదితర అంశాలపై ఆయ న ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. భవిష్యత్ భారత్ కోసం.. మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో ముందుకు సాగుతోంది. దానికి అనుగుణంగా అన్ని రంగాల్లో దేశీయ పరిజ్ఞానంతో వస్తు ఉత్పత్తులు జరగాలనేది ప్రభుత్వ సంకల్పం. దేశ రక్షణ రంగంలోనూ ఆ దిశగా సాగడమే నా ముందున్న ప్రధాన బాధ్యత. రానున్న కాలంలో స్వదేశీ ప్రయోగాల ద్వారా దేశ సైన్యానికి కావాల్సిన అన్ని పరికరాలను తయారు చేయటంలో డీఆర్డీఓ కీలకంగా వ్యవహరిస్తుంది. తద్వారా దేశ సైన్యాన్ని సర్వం సన్నద్ధంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంగా డీఆర్డీఓ పనిచేయనుంది. ప్రస్తుతం భారత సైన్యం దిగుమతుల పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీనిని తగ్గించి మన కాళ్లపైన మనం నిలబడే స్థాయికి ఎదిగే దిశగా దేశంలో పలు ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించి కొత్త పరికరాలను, పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తాం. క్షిపణి ప్రయోగాల్లో అగ్రగామిగా... క్షిపణి ప్రయోగాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. 30 ఏళ్ల నుంచి చేసిన పరిశోధనలు, కృషి వల్లే అది సాధ్యమైంది. మరింత స్వయం సమృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. ఇప్పటికే ఆగ్ని, ఆకాష్, తిశ్రూల్ ఇలా అనేక ప్రయోగాలు విజయవంతంగా చేపట్టాం. భవిష్యత్‌లో క్షిపణి రంగంలో దిగుమతుల అవసరం లేకుండా చూస్తాం. క్షిపణి, రక్షణ రంగంలో అగ్రదేశాలకు ధీటుగా పోటీపడుతున్నాం. దేశం కోసం పని చేయడమే ప్రాధాన్యం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రక్షణ రంగంలో వెనుకంజలో ఉన్న విభాగాలపై పూర్తిగా దృష్టి పెట్టి.. వాటికి ప్రాధాన్యం ఇస్తాం. రక్షణ రంగంలో దేశాన్ని సమున్నత స్థాయిలో ఉంచడమే నా లక్ష్యం. దేశం కోసం పనిచేయడానికే నా ప్రథమ ప్రాధాన్యత. స్టారప్ట్లను బలోపేతం చేసి వారికి సహకారం అందిస్తాం. అలాగే పరిశ్రమ రంగంలోనూ అభివృద్ధికి సహకరించి వారి భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం. విద్యా సంస్థల్లో పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తాం. -
అస్త్రశస్త్రాల సృష్టికర్త...!
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగంలో ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త , తెలుగు తేజం గుండ్రా సతీశ్ రెడ్డి(55) నియమితులయ్యారు. ఆ పదవికి ఎంపిౖకైన పిన్న వయస్కుడిగా, మొదటి తెలుగు వ్యక్తిగా సతీష్ రెడ్డి నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మహిమలూరు గ్రామంలో జన్మించిన ఆయన స్వయం కృషితో రక్షణ, క్షిపణి రంగంలో భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రికి శాస్త్ర సలహాదారుగా, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. డీఆర్డీఓ చైర్మన్ బాధ్యతలతో పాటు రక్షణ శాఖ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కార్యదర్శిగానూ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సతీశ్ రెడ్డి నియమకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలపగా.. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చేవారం ఆయన డీఆర్డీఓ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత మూడు నెలలుగా డీఆర్డీఓ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. చైర్మన్ ఎస్.క్రిస్టోఫర్ పదవీకాలం పూర్తికావడంతో మే నుంచి ఆ బాధ్యతల్ని రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రాకు అప్పగించారు. క్షిపణి పరిశోధనల్లో భాగస్వామి.. సైంటిఫిక్ అడ్వయిజర్‌గా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్, ఎవియానిక్స్ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. క్షిపణుల రంగంలో దేశం çస్వయం సమృద్ధిని సాధించేందుకు అవసరమైన పరిశోధనల్లో, దేశీయ విధానాల రూపకల్పనలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. క్షిపణులు, స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా దేశ రక్షణ పరిశోధన కేంద్రాలైన ఏఎస్ఎల్, డీఆర్డీఎల్, ఆర్సీఐ, ఐటీఆర్, టీబీఆర్ఎల్ను సాంకేతికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించడంతోపాటు æ సైనికదళాల కోసం స్వదేశీ సాంకేతికతతో ఆయుధాల తయారీకి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారు. సుదూర లక్ష్యాలను చేధించే అగ్ని–5 క్షిపణికి అవసరమైన సాంకేతికతను తయారుచేశారు. ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా భూమి పై నుంచి ఆకాశంలోకి ప్రయోగించే మధ్యంతర శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్‌గా దేశీయంగా గైడెడ్ బాంబును అభివృద్ధిచేయడంతో పాటు సుదూర లక్ష్యాల చేధనకు ‘స్మార్ట్ గైడెడ్ ఆయుధాల్ని’ రూపొందించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక ఫెలో ఆఫ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్, యూకేలోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, రష్యాలోని ఫారెన్ మెంబర్ ఆఫ్ ద అకాడమి ఆఫ్ నేవిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ సభ్యుడిగా ఉన్నారు. దేశ, విదేశాల్లోని ప్రాధాన్యత గల వివిధ సంస్థల్లో ఆయన సేవలకు గుర్తింపుగా ఫెలోషిప్‌లు, సభ్యత్వాలు లభించాయి. ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రతిష్టాత్మక అవార్డుల్ని సతీశ్ రెడ్డి అందుకున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ హోమీ జె.బాబా స్మారక బంగారు పతకం, నేషనల్ ఏరోనాటిక్స్ బహుమతి, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్‌మెడల్, ఇంజినీరింగ్ ఎక్స్‌లెన్స్‌కు ఇచ్చే ఐఈఐ–ఐఈఈఈ (అమెరికా) మొదటి జాయింట్ అవార్డు, లండన్ రాయల్ ఏరోనాటిక్స్ సొసైటీ వెండిపతకం వంటివి ఉన్నాయి. ప్రఖ్యాత డా.బీరెన్‌రాయ్ స్పేస్ సైన్స్ డిజైన్ అవార్డు, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రాకెట్రీ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అవార్డును పొందారు. దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. రక్షణ, క్షిపణి పరిశోధన రంగంలో చేసిన విశేష కృషికి గాను 2015 ఏడాదికిగాను ఆయన ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకున్నారు. మహిమలూరు నుంచి డీఆర్డీవోకు.. .సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఆత్మకూరు రూరల్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో గుండ్రా సీతారామిరెడ్డి, రంగమ్మ దంపతులకు 1963, జూలై 1న రెండో సంతానంగా సతీశ్ రెడ్డి జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదవగా.. నెల్లూరు వీఆర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1984లో అనంతపురం జేఎన్టీయూలో ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. మరుసటి ఏడాదే 1985లో భారత రక్షణ శాఖలో క్షిపణి రంగ పరిశోధకుడిగా చేశారు. తర్వాత కలామ్ మానసపుత్రిక ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’(ఆర్సీఐ)లోకి మారారు. కఠోర శ్రమతో నేవిగేషన్ విభాగంలో విజయాలు అందుకున్నారు. తన అసాధారణ పరిశోధనలతో ఆగిపోకుండా 2008లో ఎంఎస్ చేశారు. 2014లో డాక్టరేట్ పట్టా పొందారు. 1986 నుంచి నేవిగేషన్ విభాగంలో అవుట్‌స్టాండింగ్ శాస్త్రవేత్తగా, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా, అవుట్‌స్టాండింగ్ డైరెక్టర్‌గా, శాస్త్రవేత్తగా, డైరెక్టర్ జనరల్‌గా, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా అనేక హోదాల్లో పనిచేశారు. రక్షణ విభాగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విశేషకృషి చేశారు. ఎన్నో అస్త్రశస్త్రాలను సృష్టించిన ఆయన పలువురు రాష్ట్రపతులు, ప్రధానుల నుంచి అవార్డులు పొందారు. 2014లో విశిష్ట శాస్త్రవేత్తగా, 2015లో రక్షణ మంత్రి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. తాను ఏ స్థాయిలో ఉన్నా పుట్టిన ఊరిని మర్చిపోకుండా మహిమలూరును దత్తత తీసుకొని అన్ని రంగాల్లో ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. 14 ఏళ్ల క్రితమే గ్రామంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి తన దార్శనికతను చాటుకున్నారు. భార్య పద్మావతి, అన్న గుండ్రా శ్రీనివాసుల రెడ్డి, సేవాదృక్పథం కలిగిన మరికొందరి గ్రామస్తుల సహకారంతో గ్రామంలో విద్య, వైద్య, మౌలిక రంగాల్లో పరిపూర్ణ అభివృద్ధి సాధించేందుకు పాటుపడుతున్నారు. కుమార్తె సిగ్ధ ఎలక్ట్రానిక్ ఇంజనీరుగా పనిచేస్తుండగా.. కొడుకు అనూష్ బీటెక్ చదువుతున్నారు. రక్షణ మంత్రి సలహదారుగా బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా మహిమలూరులో అభివృద్ది పనుల్ని పరిశీలించటంతో పాటు యువతకు కెరీర్లో సలహలు సూచనలిస్తుంటారు. డీఆర్డీఓ చైర్మన్‌గా సతీశ్ ఎంపికతో నెల్లూరు జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ నుంచి ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకుంటున్న సతీశ్ రెడ్డి. చిత్రంలో ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతి (ఫైల్) జేఎన్టీయూ–కాకినాడ నుంచి గౌరవడాక్టరేట్‌ను అందుకుంటున్న సతీశ్ రెడ్డి(ఫైల్) -
సతీశ్‌రెడ్డికి హోమీ బాబా స్మారక అవార్డు
హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి చేసిన కృషికిగాను రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డెరైక్టర్ జి.సతీశ్‌రెడ్డికి ప్రతిష్టాత్మక హోమీ జే బాబా స్మారక అవార్డు లభించింది. జమ్మూ విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రారంభమైన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అవార్డును సతీశ్‌రెడ్డికి అందజేశారు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. దేశ రక్షణలో కీలకపాత్ర పోషించే క్షిపణి వ్యవస్థలకు అవసరమైన ఏవియానిక్స్ టెక్నాలజీ తయారీలో సతీశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారన్నది తెలిసిందే. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1989 నుంచి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తోంది.