అస్త్రశస్త్రాల సృష్టికర్త...! | Gundra Satheesh Reddy appointed as new DRDO chairman | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీఓ చైర్మన్‌గా సతీశ్‌

Published Sun, Aug 26 2018 2:59 AM | Last Updated on Sun, Aug 26 2018 1:39 PM

Gundra Satheesh Reddy appointed as new DRDO chairman - Sakshi

గుండ్రా సతీశ్‌ రెడ్డి

న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగంలో ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త , తెలుగు తేజం గుండ్రా సతీశ్‌ రెడ్డి(55) నియమితులయ్యారు. ఆ పదవికి ఎంపిౖకైన పిన్న వయస్కుడిగా, మొదటి తెలుగు వ్యక్తిగా సతీష్‌ రెడ్డి నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మహిమలూరు గ్రామంలో జన్మించిన ఆయన స్వయం కృషితో రక్షణ, క్షిపణి రంగంలో భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రికి శాస్త్ర సలహాదారుగా, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.

డీఆర్‌డీఓ చైర్మన్‌ బాధ్యతలతో పాటు రక్షణ శాఖ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ) కార్యదర్శిగానూ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సతీశ్‌ రెడ్డి నియమకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలపగా.. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ శనివారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చేవారం ఆయన డీఆర్‌డీఓ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత మూడు నెలలుగా డీఆర్‌డీఓ చైర్మన్‌ పదవి ఖాళీగానే ఉంది. చైర్మన్‌ ఎస్‌.క్రిస్టోఫర్‌ పదవీకాలం పూర్తికావడంతో మే నుంచి ఆ బాధ్యతల్ని రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్‌ మిత్రాకు అప్పగించారు.  

క్షిపణి పరిశోధనల్లో భాగస్వామి..
సైంటిఫిక్‌ అడ్వయిజర్‌గా, క్షిపణి వ్యవస్థలు, గైడెడ్‌ వెపన్స్, ఎవియానిక్స్‌ టెక్నాలజీలు, దేశంలోని ఎయిరోస్పేస్‌ టెక్నాలజీ, పరిశ్రమల అభ్యున్నతికి సతీశ్‌ రెడ్డి ఎంతో కృషి చేశారు. క్షిపణుల రంగంలో దేశం çస్వయం సమృద్ధిని సాధించేందుకు అవసరమైన పరిశోధనల్లో, దేశీయ విధానాల రూపకల్పనలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. క్షిపణులు, స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా దేశ రక్షణ పరిశోధన కేంద్రాలైన ఏఎస్‌ఎల్, డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐ, ఐటీఆర్, టీబీఆర్‌ఎల్‌ను సాంకేతికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించడంతోపాటు æ సైనికదళాల కోసం స్వదేశీ సాంకేతికతతో ఆయుధాల తయారీకి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారు.

సుదూర లక్ష్యాలను చేధించే అగ్ని–5 క్షిపణికి అవసరమైన సాంకేతికతను తయారుచేశారు. ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా భూమి పై నుంచి ఆకాశంలోకి ప్రయోగించే మధ్యంతర శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్‌గా దేశీయంగా గైడెడ్‌ బాంబును అభివృద్ధిచేయడంతో పాటు సుదూర లక్ష్యాల చేధనకు ‘స్మార్ట్‌ గైడెడ్‌ ఆయుధాల్ని’ రూపొందించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక ఫెలో ఆఫ్‌ రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేవిగేషన్, యూకేలోని రాయల్‌ ఏరోనాటికల్‌ సొసైటీ, రష్యాలోని ఫారెన్‌ మెంబర్‌ ఆఫ్‌ ద అకాడమి ఆఫ్‌ నేవిగేషన్‌ అండ్‌ మోషన్‌ కంట్రోల్‌ సభ్యుడిగా ఉన్నారు. దేశ, విదేశాల్లోని ప్రాధాన్యత గల వివిధ సంస్థల్లో ఆయన సేవలకు గుర్తింపుగా ఫెలోషిప్‌లు, సభ్యత్వాలు లభించాయి.  

ఎన్నో అవార్డులు, డాక్టరేట్‌లు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రతిష్టాత్మక అవార్డుల్ని సతీశ్‌ రెడ్డి అందుకున్నారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ హోమీ జె.బాబా స్మారక బంగారు పతకం, నేషనల్‌ ఏరోనాటిక్స్‌ బహుమతి, నేషనల్‌ డిజైన్‌ అవార్డు, నేషనల్‌ సిస్టమ్స్‌ గోల్డ్‌మెడల్, ఇంజినీరింగ్‌ ఎక్స్‌లెన్స్‌కు ఇచ్చే ఐఈఐ–ఐఈఈఈ (అమెరికా) మొదటి జాయింట్‌ అవార్డు, లండన్‌ రాయల్‌ ఏరోనాటిక్స్‌ సొసైటీ వెండిపతకం వంటివి ఉన్నాయి. ప్రఖ్యాత డా.బీరెన్‌రాయ్‌ స్పేస్‌ సైన్స్‌ డిజైన్‌ అవార్డు, ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా రాకెట్రీ అండ్‌ రిలేటెడ్‌ టెక్నాలజీస్‌ అవార్డును పొందారు. దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. రక్షణ, క్షిపణి పరిశోధన రంగంలో చేసిన విశేష కృషికి గాను 2015 ఏడాదికిగాను ఆయన ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డు అందుకున్నారు.   

మహిమలూరు నుంచి డీఆర్‌డీవోకు..
.సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఆత్మకూరు రూరల్‌: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో గుండ్రా సీతారామిరెడ్డి, రంగమ్మ దంపతులకు 1963, జూలై 1న రెండో సంతానంగా సతీశ్‌ రెడ్డి జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.  ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదవగా.. నెల్లూరు వీఆర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. 1984లో అనంతపురం జేఎన్‌టీయూలో ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్‌ పట్టభద్రుడయ్యారు. మరుసటి ఏడాదే 1985లో భారత రక్షణ శాఖలో క్షిపణి రంగ పరిశోధకుడిగా చేశారు. తర్వాత కలామ్‌ మానసపుత్రిక ‘రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌’(ఆర్‌సీఐ)లోకి మారారు.

కఠోర శ్రమతో నేవిగేషన్‌ విభాగంలో విజయాలు అందుకున్నారు. తన అసాధారణ పరిశోధనలతో ఆగిపోకుండా 2008లో ఎంఎస్‌ చేశారు. 2014లో డాక్టరేట్‌ పట్టా పొందారు. 1986 నుంచి నేవిగేషన్‌ విభాగంలో అవుట్‌స్టాండింగ్‌ శాస్త్రవేత్తగా,  ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా, అవుట్‌స్టాండింగ్‌ డైరెక్టర్‌గా, శాస్త్రవేత్తగా, డైరెక్టర్‌ జనరల్‌గా, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా అనేక హోదాల్లో పనిచేశారు. రక్షణ విభాగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విశేషకృషి చేశారు. ఎన్నో అస్త్రశస్త్రాలను సృష్టించిన ఆయన పలువురు రాష్ట్రపతులు, ప్రధానుల నుంచి అవార్డులు పొందారు.  2014లో విశిష్ట శాస్త్రవేత్తగా, 2015లో రక్షణ మంత్రి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. తాను ఏ స్థాయిలో ఉన్నా పుట్టిన ఊరిని మర్చిపోకుండా మహిమలూరును దత్తత తీసుకొని అన్ని రంగాల్లో ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.

14 ఏళ్ల క్రితమే గ్రామంలో పిరమిడ్‌ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి తన దార్శనికతను చాటుకున్నారు. భార్య పద్మావతి, అన్న గుండ్రా శ్రీనివాసుల రెడ్డి, సేవాదృక్పథం కలిగిన మరికొందరి గ్రామస్తుల సహకారంతో గ్రామంలో విద్య, వైద్య, మౌలిక రంగాల్లో పరిపూర్ణ అభివృద్ధి సాధించేందుకు పాటుపడుతున్నారు. కుమార్తె సిగ్ధ ఎలక్ట్రానిక్‌ ఇంజనీరుగా పనిచేస్తుండగా.. కొడుకు అనూష్‌ బీటెక్‌ చదువుతున్నారు. రక్షణ మంత్రి సలహదారుగా బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా మహిమలూరులో అభివృద్ది పనుల్ని పరిశీలించటంతో పాటు యువతకు కెరీర్‌లో సలహలు సూచనలిస్తుంటారు. డీఆర్‌డీఓ చైర్మన్‌గా సతీశ్‌ ఎంపికతో నెల్లూరు జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.   


ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ నుంచి ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డు అందుకుంటున్న సతీశ్‌ రెడ్డి. చిత్రంలో ‘సాక్షి’ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతి (ఫైల్‌)


జేఎన్‌టీయూ–కాకినాడ నుంచి గౌరవడాక్టరేట్‌ను అందుకుంటున్న సతీశ్‌ రెడ్డి(ఫైల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement