మేడిన్‌ ఇండియా కాదు.. మేక్‌ ఫర్‌ వరల్డ్‌: డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి | DRDO Chairman Satheesh Reddy Comments India in science, Technology | Sakshi
Sakshi News home page

మేడిన్‌ ఇండియా కాదు.. మేక్‌ ఫర్‌ వరల్డ్‌: డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి

Published Sun, Jul 3 2022 4:33 PM | Last Updated on Sun, Jul 3 2022 5:08 PM

DRDO Chairman Satheesh Reddy Comments India in science, Technology - Sakshi

(గరికిపాటి ఉమాకాంత్‌) 
సాక్షి, తిరుపతి: ‘శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం గత ఏడేళ్లుగా ఎంతో పురోగతి సాధించింది. మన అవసరాలకు మించి ఉత్పత్తులను తయారుచేస్తున్నాం. ఇప్పటివరకు మేడ్‌ ఇన్‌ ఇండియా (దేశంలో తయారీ) దిశగా సాగాం. ఇప్పుడు ప్రపంచం కోసం తయారీ (మేక్‌ ఫర్‌ వరల్డ్‌) దిశగా మన ప్రయోగాలు, ఆవిష్కరణలు చేస్తున్నాం’ అని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్‌ డాక్టర్‌ జి,సతీష్‌రెడ్డి వెల్లడించారు. ‘ప్రపంచ దేశాల అవసరాల కోసం తయారయ్యే ఉత్పత్తులకు మన దేశమే కేంద్రం కావాలి. ప్రపంచానికి మనమే దిక్సూచి కావాలి.

రక్షణ శాఖ ఆ దిశగానే సరికొత్త ఆలోచనలు ఉన్నవారిని, పరిశోధనలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తోంది. త్వరలోనే భారత్‌ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదుగుతుంది. దేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలోనే సంక్లిష్టమైన, కీలకమైన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై డీఆర్‌డీవో దృష్టి పెట్టింది. 5 బిలియన్‌ డాలర్ల (రూ.39 వేల కోట్ల) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా డీఆర్‌డీవో పని చేస్తోంది’  అని ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. 

ఆత్మ నిర్భర్‌ భారత్‌ 
ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్రాజెక్టులో భాగంగా సొంతంగా రక్షణ ఉత్పత్తులు తయారీపై దృష్టి సారించాం. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, జనాభా, డిమాండ్‌.. ఈ ఐదూ మూల సూత్రాలుగా భారత్‌ ఎవరిపైనా ఆధారపడకుండా ఎదగడమే ప్రాజెక్టు లక్ష్యం, అందులో భాగంగా ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే బ్రహ్మోస్‌ క్షిపణిలో ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలన్నింటినీ భారత్‌లోనే తయారు చేశాం. ప్రపంచంలోనే దీర్ఘ శ్రేణి కలిగిన తుపాకీ (అడ్వాన్స్‌డ్‌ టోడ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌)ను కూడా అభివృద్ధి చేయగలిగాం. 

సేవా రంగంలోనూ డీఆర్‌డీవో సేవలు 
దేశ రక్షణతో పాటు సామాజిక సేవా రంగంలోనూ డీఆర్‌డీవో విస్తృత సేవలు అందిస్తోంది. కోవిడ్‌ సంక్షోభ సమయంలో వైద్య రంగంలోని ఉత్పత్తులపై దృష్టి సారించాం. శానిటైజర్, గ్లౌజులు, పీపీఈ కిట్‌లు తయారు చేశాం. ప్రధానమంత్రి సూచన మేరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు తయారు చేశాం. సాంకేతికతను పెంపొందించుకొని ఒక్క రోజులో 30 వేల వెంటిలేటర్లను తయారు చేసే స్థాయికి ఎదిగాం. మూడు నెలల్లోనే దేశ అవసరాలను అధిగమించాం. ఎన్నో దేశాలకు శానిటైజర్లు, పీపీఈ కిట్లు, కరోనా రక్షణ పరికరాలను పెద్దసంఖ్యలో ఎగుమతి చేశాం. 

డేర్‌ టు డ్రీం 
దేశంలో నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు డీఆర్‌డీవో  ‘డేర్‌ టు డ్రీం’ పేరిట వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తోంది. మంచి స్టార్టప్‌లు, ఆలోచనలు ఇచ్చిన వారికి రూ.10 లక్షల వరకు ప్రైజ్‌ మనీ ఇస్తోంది. ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు, మెకానిజం కూడా డీఆర్‌డీవో అందిస్తుంది. 

ప్రభుత్వ పాఠశాలల నుంచే లబ్ధ ప్రతిష్టులు 
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళే వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులై ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్ధుల మధ్య బంధం తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం వంటిది. నేను కూడా సర్కారు బడిలోనే చదివాను. నెల్లూరు జిల్లాలోని  మారుమూల పల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. స్కూలు టీచర్‌ ఎస్‌ఆర్‌ నరసింహం గారు లెక్కలు ఎక్కువగా నేర్పారు. ఆట పాటలతో పాటు క్రికెట్‌కు కూడా ఆయనే గురువు. 

అమ్మ కోరిక మేరకే ఇంజనీరింగ్‌ 
అప్పట్లో మా ఊళ్ళో మొదటి గ్రాడ్యుయేట్‌ నేనే. మా అమ్మ ఎప్పుడూ నువ్వు ఇంజనీర్‌ కావాలని అంటుంటేది. అమ్మ కోరిక మేరకే ఇంజనీర్‌ను అయ్యాను. అబ్దుల్‌ కలాం డీఆర్‌డీవో చైర్మన్‌గా ఉన్నప్పుడే ఉద్యోగంలో చేరాను. ఆయనే స్ఫుర్తి.  

దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి 
ప్రతి ఒక్కరికీ దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి. సైన్స్‌ను, సత్సంప్రదాయాలను సమానంగా  గౌరవించాలి.  ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను మన పురాణాలు, ఇతిహాసాల్లో ఎప్పుడో చెప్పారు. సైన్స్‌ అభివృద్ధి చెందక ముందే జీరోను కనుగొన్న చరిత్ర మన సొంతం. 

నంబర్‌ వన్‌గా నిలవడమే యువత లక్ష్యం 
శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలవడమే యువత ముందున్న లక్ష్యం. 75 కోట్ల మంది యువత ఉన్న ఏకైక దేశం. ఆ యువ శక్తిని, మేథో సంపత్తిని సమృద్ధిగా వినియోగించుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలి. గతంలో ఐఐటీ పూర్తి చేసుకున్న నిపుణులు 75 శాతం మంది విదేశా>లకు వెళ్లిపోయే వాళ్లు. ఇప్పుడు 75 శాతం మంది ఇక్కడే ఉంటున్నారు. ఇది మన దేశం సాధించిన ప్రగతికి నిదర్శనం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement